పగటి వేషగాడిలా చంద్రబాబు మళ్లీ వస్తున్నాడు.. జగన్‌ మాటల మనిషి కాదు: సజ్జల

22 Feb, 2023 15:35 IST|Sakshi

సాక్షి, గుంటూరు: ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పగటి వేషగాడిలా మళ్లీ వస్తున్నాడని, అంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. బుధవారం మధ్యాహ్నం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..  బీసీలకు నమ్మకద్రోహం చేయటానికి చంద్రబాబు మళ్లీ సిద్దమయ్యారని, అమలు చేయని హామీలు ఇస్తూ మళ్లీ జనంలోకి వస్తున్నారంటూ పేర్కొన్నారు సజ్జల. 

చంద్రబాబు, డ్వాక్రా మహిళల నుండి ఎవర్నీ వదలకుండా మోసం చేశారు. రైతు రుణమాఫీ అని చెప్పి, నిలువునా మోసం చేశారు. ప్రజలను ఆశ పెట్టి, వారితో అప్పులు చేయించి మోసం చేశారు. కానీ, సీఎం జగన్‌ అలా కాదు. ఆయన మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించారు. తన పదవిని బాధ్యతగా తీసుకుని.. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారు.  ఎన్నికల రాబోతున్నాయని చంద్రబాబు పగటి వేషగాడిలాగా మళ్లీ వస్తున్నారు. బీసీలకు నమ్మకద్రోహం చేయటానికి సిద్దమయ్యారు. తనకున్న మీడియాబలంతో అబద్దాలను నిజాలుగా ప్రచారం చేస్తున్నారు. నాయీబ్రాహ్మణుల తోకలు కోస్తానన్న మాటలన్నీ మనం మర్చిపోయారని అనుకుంటున్నారని, మనమంతా జాగ్రత్తగా ఉండాలని ఆయన పిలుపు ఇచ్చారు.  

పారదర్శక పాలన ఇది
బీసీలంటే బ్యాక్ బోన్ క్యాస్ట్ అని నిరూపించిన వ్యక్తి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. బీసీలకు జగన్ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక చూసినా అర్థం అవుతుంది.  అనేక రకాల పదవుల్లో బీసీలు పదివేలకు పైనే ఉన్నారు. వార్డు సభ్యుల నుండి ఎంపీల వరకు బీసీలకు అధిక ప్రాధాన్యత దక్కింది. జగన్‌ అంటే అందరిలాగా మాటలు చెప్పి వెళ్లిపోయే వ్యక్తి కాదు. ఆయన సంస్కరణలు అట్టడుగు వర్గాలకు సైతం అందాయి. పిల్లలకు కార్పొరేట్ చదువులు చదివేలా చర్యలు చేపట్టారాయన. ఏ నెలలో ఏ పథకం ఇవ్వబోతున్నారో కూడా జనానికి తెలుసంటే.. పాలన ఎంత పారదర్శకంగా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు అని సజ్జల పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు