ఊళ్లోనే ఉపాధి... జీవనానికి భరోసాగా...ఇక ఎక్కడికీ వెళ్లనవసరం లేకుండా..

11 Jun, 2022 16:47 IST|Sakshi

కూలీలకు ఉన్న ఊళ్లోనే ఉపాధి పనులను ప్రభుత్వం కల్పిస్తోంది. తద్వారా పొట్ట చేతపట్టుకుని నగరాలకు వలస వెళ్లే బాధ తప్పింది. మండు వేసవిలో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉదయం వేళల్లో మాత్రమే పని చేసేలా వెసులుబాటు కల్పించింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కూలీల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఉపాధి కూలీల జీవనానికి భరోసా ఇచ్చింది. లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూరింది. అధికార యంత్రాంగం నిర్విరామ కృషి ఫలితంగా ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రం జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. 

సాక్షి, చిత్తూరు: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది. పారదర్శకంగా పనులు చేపడుతూ కూలీల జీవనానికి భరోసా ఇచ్చింది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మొదటి స్థానం దక్కడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో జరిగిన పనులు, లబ్ధిదారులకు అందుతున్న నగదుపై నిర్వహించిన సోషల్‌ ఆడిట్‌లో ఏపీ పనితీరును కేంద్రం ప్రశంసించింది. కూలీల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు పథకాన్ని క్షేత్రస్థాయిలో ఈ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లోని 31 మండలాల్లో ఉపాధి హామీ పనులు పక్కాగా సాగుతున్నాయి. 

మూడేళ్లలో 5.5 లక్షల పనిదినాలు 
జిల్లా వ్యాప్తంగా 1,50,682  కుటుంబాల నుంచి 74,059 మంది కూలీలు ఉపాధి పనులకు  హాజరవుతున్నారు. 2019 ప్రారంభం నుంచి ఈ ఏడాది జూన్‌ 10 వరకు 5,43,81,511 పనిదినాలను కల్పించారు. ఇందుకు గాను రూ.1971.31 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది.  2021–22లో 20,393 కుటుంబాలు 100 రోజులపాటు పనులకు హాజరయ్యారు.

ఇక  2022–23 ఏడాది ఏప్రిల్‌ వరకు 13.19 శాతం వరకు వంద రోజుల పనిదినాలు పూర్తి చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.  కూలీలకు రోజువారి వేతనం సగటున రూ.251 అందుతోంది. ఉపాధి పనుల్లో జాబ్‌కార్డుపై నమోదైన ఒక కుటుంబానికి ఏడాదికి కనీసం వంద పనిదినాలు కల్పించాలన్నదే ప్రభుత్వ ఆశయం. కుటుంబంలో ముగ్గురు కంటే ఎక్కువ సభ్యులు ఉన్నా వారికి కనీసం వంద పనిదినాలు కల్పిస్తారు.  

పల్లెల్లో పచ్చదనం 
ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనుల్లో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం పెంచే పనులకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. మొక్కలు నాటేందుకు గోతులు తీయటం నుంచి మొక్కలు నాటి వాటి సంరక్షణ వరకు అన్నీ కూలీలే పర్యవేక్షిస్తున్నారు. దీనివల్ల చాలా గ్రామాల్లో పచ్చదనం పెరిగిందని అధికారులు చెబుతున్నారు.  ఇక పనిచేసిన వెంటనే కూలీలకు సకాలంలో వేతనాలను చెల్లిస్తున్నారు. 

మెరుగైన వసతులు 
జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న ఉపాధి కూలీలకు మెరుగైన వసతులు కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని పని ప్రదేశంలో నీడ, మంచినీరు, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో గ్రామీణ ప్రజలు ఉపాధి హామీ పనులకు వెళ్లేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. కలెక్టర్‌ హరి నారాయణన్‌ క్షేత్రస్థాయిలో అమలవుతున్న ఉపాధి హామీ పనులను ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తూ పనుల్లో పారదర్శకతను అమలు చేస్తున్నారు.  పని అడిగిన ప్రతి కూలీకి ఉపాధి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కూలీలు  ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా స్థానికంగానే పనులు కల్పిస్తున్నారు. వారి జీవనోపాధికి తోడ్పాటునందిస్తున్నారు. 

ఆదుకున్న ఉపాధి 
ఎండలు మండిపోతున్నాయి. పనులు చేయలేకపోతున్నాము. ఇదే సమయంలో ఉపాధి పనులు కల్పించడంతో పట్టణాలకు వలస వెళ్లాల్సిన బాధ తప్పిపోయింది. ప్రభుత్వం ఉదయం 10 గంటల్లోపే పనులు చేసుకునే వెసులుబాటు కల్పించింది. అనంతరం పశుపోషణతో మెరుగైన జీవనం సాగిస్తున్నాం.  
–కుప్పయ్య, గొల్లపల్లె యాదమరి మండలం 

రోజుకు రూ.250  
పనులు లేని కాలంలోనే రోజుకు రూ.250 సంపాదించుకునే ఉపాధిని ప్రభుత్వం కల్పించింది. నిత్యం పట్టణానికి వెళ్లే అవస్థ తప్పింది. ఇంటి దగ్గర పశువులను చూసుకునే వారు లేక ఇబ్బందులు పడుతున్నాను. ఉపాధి పనుల వల్ల కూలీ వస్తోంది. మిగిలిన సమయంలో సొంతపనులూ చేసుకుంటున్నాం. 
– నాగమ్మ, విజయపురం 

పని కల్పించటమే ధ్యేయం 
జిల్లా వ్యాప్తంగా అడిగిన వారందరికీ పని కల్పించేలా చర్యలు చేపట్టాము. ఉపాధి పనుల్లో జిల్లాను రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిపేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నాం. అడిగిన వారికి జాబ్‌కార్డులను ఇస్తున్నాము. వేసవిని దృష్టిలో ఉంచుకుని కూలీలకు వసతులు కల్పిస్తున్నాము.   
 – హరి నారాయణన్, కలెక్టర్, చిత్తూరు జిల్లా

(చదవండి: పవన్ కల్యాణ్ జనసేన జనం కోసమా.. చంద్రబాబు కోసమా..?)

మరిన్ని వార్తలు