త్యాగానికి బహుమతి...వంశధార నిర్వాసితులకు పరిహారం మంజూరు

22 Jun, 2022 11:56 IST|Sakshi

ఎల్‌ఎన్‌ పేట, హిరమండలం, శ్రీకాకుళం పీఎన్‌ కాలనీ: వంశధార నిర్వాసితులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అదనపు పరిహారాన్ని వైఎస్సార్‌ సీపీ ప్ర భుత్వం ప్రకటించింది. మెత్తం రూ.216.71కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు హిరమండలం, కొత్తూరు, ఎల్‌ఎన్‌పేట మండలాల్లోని పునరావాస కాలనీల్లో లబ్ధిదారులను గుర్తించే పనిలో అ«ధికారులు పడ్డారు. 

ఇదీ చరిత్ర.. 
వైఎస్‌ రాజశేఖర రెడ్డి అప్పట్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా 2005లో హిరమండలం వద్ద 10 వేల ఎకరాల్లో 19 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో వంశధార రిజర్వాయర్‌ (జలాశయం) నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిర్వాసితులను గుర్తించేందుకు అనేక సర్వేలు 2007 వరకు జరిగాయి. సర్వే అనంతరం పంట భూములకు పరిహారం చెల్లించి నిర్మాణం పనులు చేపట్టారు. రిజర్వాయర్‌ నిర్మాణంలో హిరమండలం, కొత్తూరు, ఎల్‌.ఎన్‌.పేట మండలాల్లోని 19 గ్రామాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. 

మరో 14 గ్రామాలు పాక్షికంగా నష్టపోయాయి. 8 వేల కుటుంబాలు నిర్వాసితులుగా గుర్తించారు. అప్పట్లో ఎకరా పల్లం భూమికి రూ.1.29లక్షలు, ఎకరా మెట్టు భూమికి రూ.90 వేలు నష్ట పరిహారం చెక్కుల రూపంలో అందజేశారు. ఇప్పుడు అదనపు పరిహారం చెల్లించేందుకు రైతుల నుంచి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. లబ్ధిదారుల ఆధార్‌ కార్డుల ఆధారంగా వివరాలు పొందుపరుస్తున్నారు. అయితే చాలామంది భూ యజమానులు చనిపోయారు. వారి స్థానంలోకి వచ్చిన వారి ఫ్యామిలీ సర్టిఫికెట్‌(లీగల్‌ హేర్‌) వివరాలు సేకరిస్తున్నారు. 

అదనపు పరిహారం చెల్లింపు ఇలా..  

  • భూములు కోల్పోయిన రైతులతో పాటు పీడీఎఫ్‌ పొందిన కుటుంబాలకు ఆదనపు పరిహారం చెల్లించేందుకు వీలుగా ప్రభుత్వం జీఓ విడుదల చేసింది.  
  • రిజర్వాయర్‌ నిర్మాణం కోసం 9,579.62 ఎకరాల భూమిని సేకరించగా వీటిలో 8775.42 ఎకరాల ప్రైవేటు భూములు ఉన్నాయి. 804.20 ఎకరాల డి–పట్టా భూములు ఉన్నాయి. భూములకు గాను ఎకరానికి రూ.లక్ష అదనపు పరిహారంగా మొత్తం 95.80 కోట్లు విడుదల చేశారు.   
  • 12,091 మంది పీడీఎఫ్‌ అర్హత కలిగిన కుటుంబాలు ఉండగా వీరిలో 7,103 కుటుంబాలకు పీడీఎఫ్‌ పరిహారానికి, 4,988 మంది 18 ఏళ్లు దాటిన వారికి ఒక్కొక్కరికి రూ.లక్ష చెప్పున్న రూ.120.91 కోట్లు విడుదల చేశారు.  

ఎమ్మెల్యేదే కీలక పాత్ర 
వంశధార నిర్వాసితులకు అదనపు పరిహారం తీసుకురావటంలో పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి  కీలక పాత్ర పోషించారు. ఆమెతో పాటు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు, ప్రస్తుత రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావులు కూడా కృషి చేశారు. అదనపు పరిహారం విడుదలపై కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లాఠకర్, వంశధార ఎస్‌ఈ డోల తిరుమలరావులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.  

మాట నిలబెట్టుకునేలా.. 
వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 2017లో హిరమండలం వచ్చి ఒక బహిరంగ సభలో నిర్వాసితుల కష్టాలను తెలుసుకున్నా రు. అప్పుడే మన ప్రభుత్వం వస్తే ఆదుకుంటామని మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఇప్పుడు రూ.216.71 కోట్లు విడుదల చేశారు.  సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం.   
– రెడ్డి శాంతి, ఎమ్మెల్యే, పాతపట్నం  

ప్రభుత్వ ఆదేశాల మేరకే..  
ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్‌ కార్యాలయం నుంచి కోరిన ప్రొఫార్మాలో వంశధార నిర్వాసితుల నుంచి వివరాలు సేకరిస్తున్నాం. ఈ నెల 27న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. ఈ లోగా నిర్వాసితుల పూర్తి వివరాలు సేకరించి కలెక్టర్‌ కార్యాలయానికి అందజేయాలని  అధికారులకు ఆదేశాలిచ్చాం. 
– ఎం.విజయ సునీత, జాయింట్‌ కలెక్టర్, శ్రీకాకుళం 

సంతోషంగా ఉంది  
వంశధార నిర్వాసితులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అదనపు పరిహారం ఇస్తాననడం ఎంతో సంతోషంగా ఉంది. çస్థిరాస్తులను కోల్పోయి నిరాశ్రయులయ్యాం. పునరావాస కాలనీల్లో అదనపు పరిహారం కోసం గ్రామాల్లో సర్వే ముమ్మరంగా సాగుతుంది.  
– గవర వెంకటరావు,నిర్వాసితుడు గార్లపాడు  

మరిన్ని వార్తలు