అక్కచెల్లెమ్మలకు రూ.20 వేల కోట్ల ఆస్తి

13 Sep, 2020 02:46 IST|Sakshi

ఇళ్ల స్థలాల రూపంలో వారి పేరుతో రిజిస్ట్రేషన్‌కు సిద్ధం

62 వేల ఎకరాల్లో లే అవుట్లు,డీ మార్కింగ్, సరిహద్దు రాళ్లు 

న్యాయ స్థానాల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ కోసం సర్కారు ఎదురు చూపులు 

లబ్ధిదారుల్లో బీసీలదే అగ్రస్థానం

సాక్షి, అమరావతి: ఇప్పటి వరకు రాష్ట్ర, దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాల రూపంలో రూ.20 వేల కోట్ల ఆస్తిని పంపిణీ చేసేందుకు మొట్టమొదటి సారిగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏకంగా 62 వేల ఎకరాల భూమిని అన్ని విధాలా సిద్ధం చేసింది. మొత్తం 29,50,985 మంది లబ్ధిదారులకు ఈ ఆస్తిని ఇళ్ల స్థలాల రూపంలో ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇళ్ల స్థలాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6,607.45 కోట్లు వ్యయం చేసింది. గతంలో అరకొరగా ఇళ్ల స్థలాలు ఇచ్చినా, ఆ స్థలాలపై లబ్ధిదారులకు పూర్తి హక్కు ఉండేది కాదు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులైన అక్క చెల్లెమ్మల పేరు మీద రిజస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలని, శాశ్వతంగా ఆ ఇళ్ల స్థలాలపై వారికి హక్కు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
– అయితే తెలుగుదేశం నేతలు ఇళ్ల స్థలాలపై న్యాయస్థానాలకు వెళ్లారు. దీంతో పేదలకు ఇవ్వాల్సిన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ నిలిచిపోయింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. తీర్పు కోసం ఎదురు చూస్తోంది. 
– ఈ లోగా లబ్ధిదారులకు ఇచ్చే ఇళ్ల స్థలాల లే అవుట్లు, రాళ్లతో సహా డిమార్కింగ్‌ పూర్తి చేశారు. ప్లాట్ల లేఅవుట్లలో మొక్కలు నాటడం, ఇళ్ల స్థలాల పట్టాల డాక్యుమెంట్లలో ఫొటోలు, ప్లాట్ల నంబర్ల నమోదుతో పాటు, సరిహద్దులు స్పష్టంగా రాయడం వంటివి పూర్తి చేశారు. 

గతనాకి, ఇప్పటికి తేడా స్పష్టం
– గత తెలుగుదేశం ప్రభుత్వం పారిశ్రామిక వేత్తల కోసం పది లక్షల ఎకరా>లతో ల్యాండ్‌ బ్యాంకును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంది తప్ప పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. పేదలకు కేటాయించిన అసైన్డ్‌ భూములను కూడా ఇతర అవసరాల పేరుతో లాగేసుకుంది. 
– ప్రస్తుత ప్రభుత్వం ఇందుకు భిన్నంగా పేదల కోసం ఏకంగా 62 వేల ఎకరాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంది. ప్రభుత్వ భూమి లేని చోట వందల కోట్ల రూపాయలు వ్యయం చేసి కొనుగోలు చేసింది. 

పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
– కులం, మతం, ప్రాంతం, పార్టీ, రాజకీయాలకు అతీతంగా వలంటీర్ల ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశారు.
– ‘నాకు ఓటు వేయని వారైనా సరే అర్హత ఉంటే వారికి ఇంటి స్థలం మంజూరు చేయాల్సిందే’ అని సీఎం జగన్‌ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దీంతో అర్హులను ఎంపిక చేసి గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితా ప్రదర్శించారు. 
– రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం బీసీలే. ఇళ్ల స్థలాల లబ్ధిదారుల్లో కూడా వీరికే అగ్రస్థానం దక్కింది. 

మరిన్ని వార్తలు