నామినేషన్ వేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి

29 Mar, 2021 12:01 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి నెల్లూరు కలెక్టరేట్‌లో నామినేషన్ వేశారు. ముందుగా ఆయన నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి చేరుకొని దివంగత నేత వైఎస్ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వీఆర్ సెంటర్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గురుమూర్తి నివాళులు అర్పించారు. తర్వాత వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ర్యాలీగా గురుమూర్తి కలెక్టరేట్‌కు చేరుకొని మూడు సెట్ల​ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ఆశీస్సులతో నామినేషన్ వేస్తున్నానని తెలిపారు. ప్రజల నుంచి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నానని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు, బాలి నేని శ్రీనివాసరెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్, గౌతమ్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామితో పాటు చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన పలువురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, అభిమానులు హాజరయ్యారు. ఇక ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ ఆకస్మిక మరణంతో తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.

గురుమూర్తి నేపథ్యం:
► చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని మారుమూల గ్రామమైన మన్నసముద్రం దళితవాడకు సామాన్య కుటుంబంలో జన్మించారు.  
►  గురుమూర్తి తల్లిదండ్రులు రమణమ్మ, మునికృష్ణయ్య. ఆయనకు ఐదుగురు అక్క చెల్లెళ్లు ఉన్నారు.
►  తండ్రి మునికృష్ణయ్య రెండెకరాల ఆసామి. ఆ భూమి కూడా 1975లో అప్పటి ప్రభుత్వం ఇచ్చింది. ఈ భూమికి మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పట్టా ఇచ్చారు.
►  ప్రస్తుతం అందులోనే  మునికృష్ణయ్య మామిడి సాగుచేస్తున్నారు. 
►  గురుమూర్తి ఐదో తరగతి వరకు మన్నసముద్రంలో ప్రాథమిక విద్య, ఆరు నుంచి 10వ తరగతి వరకు పక్కనే ఉన్న బండారుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆ తర్వాత ఇంటర్‌ తిరుపతిలో చదువుకున్నారు. 
►  అనంతరం స్విమ్స్‌లో ఫిజియోథెరిపీ పూర్తి చేశారు. ఆ సమయంలో విద్యార్థి సంఘ నాయకుడిగా సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డిని తరచూ వెళ్లి కలిసేవారు. 
►  ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తూ వైఎస్‌ కుటుంబానికి దగ్గరయ్యారు. 
►  2017లో వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్రలో ఆయన వెంటే ఉన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు