‘రంగా హత్య గురించి పవన్‌ వాస్తవాలు తెలుసుకోవాలి’

31 Oct, 2022 16:26 IST|Sakshi

రాజమహేంద్రవరం: వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కాపులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని వైఎస్సార్‌సీపీ కాపు నేతలు మరోసారి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే టికెట్ల నుంచి నామినేటెడ్‌ పదవుల వరకూ కాపులకు సీఎం వైఎస్‌ జగన్‌ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని వైఎస్సార్‌సీపీ కాపు నేతలు మీడియా ముఖంగా పేర్కొన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం కాపులకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి వైఎస్సార్‌సీపీ కాపు నేతలు రాజమహేంద్రవరంలో  మీడియాతో మాట్లాడారు.

దీనిలో భాగంగా తొలుత కాపునేత, మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కాపులకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఎమ్మెల్యే టికెట్ల నుంచి నామినేటెడ్‌ పదవుల వరకూ వైఎస్‌ జగన్‌ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. గత ప్రభుత్వాలు కాపులను ఓటు బ్యాంక్‌గానే చూశాయి.  వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కాపులకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. కాపు సామాజిక వర్గానికి సీఎం జగన్‌ ప్రాధాన్యత ఇచ్చారు. సీఎం జగన్‌ కాపుల సంక్షేమానికి శ్రీకారం చుట్టారు.  ఆర్థికంగా అభివృద్ధి చెందే విషయంలో కాపులకు అండగా నిలిచారు. కాపుల సమస్యలు ఉంటే సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళతాం. ఇటీవల ఓ పార్టీ అధినేత మాట్లాడిన మాటలను ఖండిస్తున్నాం. త్వరలో విజయవాడలో కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తాం’ అని అన్నారు.

పవన్‌ విచక్షణ కోల్పోయి ఉన్మాదిలా  మాట్లాడుతున్నాడు..
మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ..‘ పీఆర్‌పీకి ద్రోహం చేసినవారికి సమాధానం చెబుతానన్న పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు వాళ్లతోనే స్నేహం చేస్తున్నాడు. చంద్రబాబుకు దగ్గరై కాపు సామాజిక వర్గాన్ని కించపరుస్తున్నాడు. మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న పవన్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. విచక్షణ కోల్పోయి పవన్‌ కల్యాణ్‌ ఉన్మాదిలా మాట్లాడుతున్నాడు. పవన్‌ వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయి’ అని అన్నారు.

కాపులకు సీఎం జగన్‌ పెద్దపీట వేశారు
‘కాపులకు సీఎం జగన్‌ పెద్ద పీట వేశారు. గతంలో రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేయడమే కాకుండా ముద్రగడ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేశారు. ఇటీవల కాపు ఎమ్మెల్యేలను పవన్‌ దూషించడాన్ని ఖండిస్తున్నాం. రాజకీయాల్లో ఉన్న వ్యక్తి దిగజారి మాట్లాడతారా?, రంగా మరణానికి పవన్‌ కల్యాణ్‌ కొత్త భాష్యం చెప్పారు. రంగా హత్యకు కారణమైన చంద్రబాబుతో పవన్‌ జట్టు కట్టారు. టీడీపీ హయాంలో కాపులను వేధిస్తే.. సీఎం జగన్‌  అన్ని రకాలుగా అండగా నిలిచారు. పవన్‌ ముసుగు తొలగింది.కాపు సోదరులు ఆ విషయం గుర్తించాలి’ అని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.

రంగా హత్యగురించి పవన్‌ కల్యాణ్‌ వాస్తవాలు తెలుసుకోవాలి
‘ప్రాణహాని ఉందని వంగవీటి రంగా చెప్పినా అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. రంగాను చంద్రబాబే హత్య చేయించారని హరిరామజోగయ్య తన పుస్తకంలో రాశారు’ అని దాటిశెట్టి రాజా పేర్కొన్నారు. రంగా హత్యగురించి పవన్‌ కల్యాణ్‌ వాస్తవాలు తెలుసుకోవాలి. ఆరోజు ఏం జరిగిందో హోంమంత్రిగా ఉన్న హరిరామజోగయ్య చెప్పారు’ అని మరో వైఎస్సార్‌సీపీ కాపు నేత కన్నబాబు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు