మానవత్వం చాటిన వైఎస్సార్‌ సీపీ నేత

26 Nov, 2021 11:05 IST|Sakshi
పూరి గుడిసె స్థానంలో నిర్మిస్తున్న రేకుల షెడ్డు

సాక్షి, ఆకివీడు(పశ్చిమ గోదావరి): ఎన్నికల ప్రచారంలో ఓటు అభ్యర్థించేందుకు వెళ్లిన సమయంలో పూరి గుడిసెలో దయనీయ స్థితిలో ఉన్న ఓ వృద్ధురాలిని చూసి చలించిన 15వ వార్డు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి వెస్లీ ఆమెకు గూడు కల్పించేందుకు శ్రీకారం చుట్టి తన మానవత్వాన్ని చాటారు. వివరాల్లోకి వెళితే.. జాతీయ రహదారికి చేర్చి, జెడ్పీ ఉన్నత పాఠశాల ఎదురుగా పాడుబడిన పూరి పాకలో వృద్ధురాలు బొమ్మిడి లక్ష్మీ నివసిస్తోంది. భర్త చనిపోగా బంధువులు పట్టించుకోవడం మానేశారు. దివ్యాంగురాలైన కుమార్తెతో కలిసి వృద్ధురాలికి వచ్చే పింఛను సొమ్ముతోనే జీవిస్తున్నారు.


అవ్వతో కొబ్బరికాయ కొట్టించిన నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ జామి హైమావతి

ఇదిలా ఉండగా, ఇటీవల నగర పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇంటింటా ప్రచారానికి వచ్చిన కటికతల జాన్‌ వెస్లీ వృద్ధురాలిని ఓటు అడిగేందుకు వచ్చారు. ఆ సమయంలో శిథిలమైన పూరిపాకలో వర్షానికి తడిసిపోయి ఇంటి ముందు బురద, దుర్వాసనలో జీవిస్తుండటాన్ని గమనించి చలించిపోయారు. ఎన్నికల అనంతరం తాను గెలిచినా, ఓడినా వృద్ధురాలికి గూడు నిర్మిస్తానని సంకల్పించారు. అనంతరం కౌన్సిలర్‌గా గెలుపొందగా, గురువారం చైర్‌పర్సన్‌ జామి హైమావతితో కలిసి జాన్‌ వెస్లీ వృద్ధురాలి ఇంటికి వెళ్లి పరిశీలించారు. పూరి గుడిసె స్థానంలో షెడ్డు నిర్మాణానికి వృద్ధురాలితోనే కొబ్బరికాయ కొట్టి కొత్త నిర్మాణం ప్రారంభించారు. రెండు రోజుల్లో నిర్మాణం పూర్తవుతుందని, ఇందుకు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు ఖర్చవుతుందన్నారు. వృద్ధురాలి కుమార్తెకు దివ్యాంగ పింఛను మంజూరుకు కృషి చేస్తానన్నారు.

మరిన్ని వార్తలు