సత్తార్ మా కుటుంబానికి ఆప్తుడు: జక్కంపూడి

7 Oct, 2020 11:02 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సత్తార్‌

సాక్షి, కాకినాడ: తన కుమార్తెపై లైంగిక దాడికి యత్నించిన కేసులో నిందితులను శిక్షించాలని కోరుతూ ఆత్మహత్యకు యత్నించిన రాజమహేంద్రవరం బొమ్మూరుకు చెందిన సత్తార్‌ కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ నేత జక్కంపూడి గణేష్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'సత్తార్ కుమార్తె కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గత రెండు రోజులుగా పలు పార్టీల నేతలు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అవి పూర్తిగా అవాస్తవం.

సత్తార్ మా కుటుంబానికి ఆప్తుడు. మేము నిర్వహించిన పలు కార్యాక్రమాల్లో సత్తార్ పాల్గొన్నారు. టీడీపీ అనుకూల మీడియాను అడ్డుపెట్టుకుని కొందరు నేతలు వారి స్వప్రయోజనా కోసం మాపై ఆరోపణలు చేస్తున్నారు. మా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు, నా సోదరుడు రాజా గెలుపుకు ఎస్సీలు, మైనార్టీలే కారణం. వారికెప్పుడు మా కుటుంబం అండగా ఉంటుంది. అల్లా దయవల్ల సత్తార్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను' అని గణేష్‌ పేర్కొన్నారు. 

సత్తార్ భార్య సమీరా బేగం మాట్లాడుతూ.. 'నా భర్త ఆత్మహత్యయత్నాన్ని కొందరు రాజకీయ పార్టీల పెద్దలు రాజకీయం చేస్తున్నారు. జక్కంపూడి గణేష్ మా కుటుంబానికి అన్యాయం చేశాడని నేను ఎక్కడా చెప్పలేదు. ఆయన మాకు ఎటువంటి అన్యాయం చెయ్యలేదు. గణేష్ తల్లి విజయలక్ష్మీ మాకు జరిగిన అన్యాయంపై స్పందించి వెంటనే యాక్షన్ తీసుకోవాలని పోలీసులకు ఫోన్ చేశారు. గణేష్ అన్న మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఓదార్చి.. మా పిల్లల్ని చదిస్తానని భరోసా ఇచ్చారు. వైఎస్సార్‌సీపీకి మా కేసుకు ఎలాంటి సంబంధం లేదు. చేతనైతే నా భర్తను కాపాడండి. అంతే కానీ రాజకీయాలు చేయవద్దని ఇతర పార్టీల నేతల్ని కోరుతున్నా' అని సమీరా బేగం అన్నారు.

వైఎస్సార్‌సీపీ మైనార్టీ నేతలు హబీబ్‌ బాషా, మహ్మద్‌ ఆరీఫ్‌లు మాట్లాడుతూ.. 'మా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పట్ల వేరే జిల్లాకు చెందిన అనామకులు అవాకులు చవాకులు పేలుతున్నారు. ద్వారంపూడికి ముస్లింలకు మధ్య ఎంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన ముస్లింలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. సత్తార్ కుమార్తె విషయంలో టీడీపీ నేతలు కెమెరాలతో వచ్చి‌‌ హడావిడి చేసి వెళ్ళిపోయారు. ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుంటూ నిందితులను అరెస్టు చేసింది. తన నియోజకవర్గంలో జరిగిన ఘటనపై రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి  ఇంత వరకు ఎందుకు స్పందించలేదు' అని మైనార్టీ నాయకులు ప్రశ్నించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు