పెనుమత్స సాంబశివరాజు కన్నుమూత

10 Aug, 2020 09:21 IST|Sakshi

సాక్షి, విజయనగరం: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాఖ అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక నాయకుడిగా ఆయన గుర్తింపును సొంతం చేసుకున్నారు. 1989-94 లో మంత్రిగా, 1958లో సమితి ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహించారు. 1968లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన ఆయన గజపతినగరం, సతివాడ శాసనసభ స్థానాల నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి రాజకీయ కురువృద్ధుడిగా గుర్తింపు పొందారు.

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు.. సీఎం జగన్‌ ఆదేశం
వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత దివంగత పెనుమత్స సాంబశివరాజు పార్ధివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.

డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వాణి సంతాపం
మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు మృతి పట్ల డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి సంతాపం తెలిపారు. విజయనగరం రాజకీయాల్లో ఆయన  అరుదైన ముద్ర వేసుకున్నారని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్‌, జిల్లాకి ఆయన మృతి తీరని లోటని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని పుష్ప శ్రీవాణి తెలిపారు.

మరిన్ని వార్తలు