Andhra Pradesh: ఉవ్వెత్తున ఉద్యమం

13 Oct, 2022 03:14 IST|Sakshi
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో బైక్‌ ర్యాలీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు

విశాఖ కోసం ఏకమైన ఉత్తరాంధ్ర.. మూడు రాజధానులతోనే సమన్యాయం

మరోసారి రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వబోం.. ప్రజల ఆకాంక్షకు మేధావులు, విద్యార్థులు, న్యాయవాదుల మద్దతు

భారీ ర్యాలీలు, బైక్‌ ర్యాలీలు, మానవ హారాలు, దేవాలయాల్లో పూజలు 

15న జరగనున్న విశాఖ గర్జనకు తరలిరావాలని నాన్‌ పొలిటికల్‌ జేఏసీ పిలుపు 

ఉత్తరాంధ్రులది బతుకు పోరాటమన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు 

అభివృద్ధికి అడ్డురావద్దని హితవు 

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర సమగ్రాభివృద్ధిని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న వికేంద్రీకరణ విధానం గ్రామగ్రామాన నినదిస్తోంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా ఎదగాలని తపిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే హేతుబద్ధత లేని విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ మరోసారి ముక్కలు చెక్కలు కాకుండా సీఎం దూరదృష్టితో కాపాడుతున్నారంటూ ప్రజలంతా బాసటగా నిలుస్తున్నారు.

అనవసర వ్యయాన్ని, పెనుభారాన్ని భరించే పరిస్థితిలో రాష్ట్రం ఏమాత్రం లేదని, అందుకే అన్ని సదుపాయాలున్న విశాఖ పరిపాలన రాజధాని కావాలని స్పష్టం చేస్తున్నారు. మూడు రాజధానుల ఏర్పాటుతోనే సమన్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే గర్జిస్తామంటూ మేధావులు, విద్యార్థులు, న్యాయవాదులు, ఉద్యోగులు ఏకతాటిపైకి వచ్చారు. మానవహారాలు, భారీ ర్యాలీలు, పూజలతో ప్రజల ఆకాంక్షను చాటి చెబుతున్నారు.

విశాఖపట్నంలో ర్యాలీల హోరు
విశాఖ నగరం సహా పలు ప్రాంతాల్లో బుధవారం భారీ ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో యువత, మేధావులు, న్యాయవాదులు, సామాన్య ప్రజలు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జీవీఎంసీ 77వ వార్డు నమ్మిదొడ్డి జంక్షన్‌లో వివిధ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి నినాదాలతో హోరెత్తించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వికేంద్రీకరణకు మైనారిటీ సంఘాలు మద్దతు పలికాయి.

గోపాలపట్నం ప్రధాన రహదారిలో మసీదు వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. విశాఖ పరిపాలన రాజధానిగా కావాలని కోరుతూ పెందుర్తిలో నాన్‌ పొలిటికల్‌ జేఏసీ నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ పాల్గొన్నారు. వేపగుంట కూడలిలో వందలాది మందితో ర్యాలీ చేశారు. ఈ నెల 15న జరిగే విశాఖ గర్జనలో అంతా పాల్గొనాలని కోరుతూ ప్రయాణికులకు, స్థానికులకు, పాదచారులకు, చిరు వ్యాపారులకు ఎమ్మెల్యే కరపత్రాలు పంపిణీ చేశారు.

పరవాడ సినిమా హాలు కూడలిలో రాజకీయేతర జేఏసీ భారీ మానవహారం నిర్వహించి ఒక్క రాజధాని వద్దు.. మూడు రాజధానులే ముద్దు అంటూ నినదించింది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో నాన్‌ పొలిటికల్‌ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకి మంత్రి గుడివాడ అమర్‌నా«ధ్, నగర మేయరు గొలగాని హరి వెంకటకుమారి హాజరయ్యారు. ఈనెల 15న జరిగే విశాఖ గర్జనకు ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. మూడు రాజధానులకు మద్దతుగా గాజువాకలో ఎమ్మెల్యే నాగిరెడ్డి ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. 

అనకాపల్లి జిల్లాలో..
పరిపాలనా రాజధానిగా విశాఖకు మద్దతుగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లిలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నక్కపల్లి జాతీయ రహదారి పక్కన ఉన్న పాన్‌షాప్‌ వద్ద మూడు రాజధానులే మేలంటూ ప్లెక్సీ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. చోడవరం నియోజకవర్గం వడ్డాదిలో వెంకటేశ్వరస్వామి ఆర్చ్‌ నుంచి బుచ్చెయ్యపేట నాలుగు రోడ్ల జంక్షన్‌ వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

బుచ్చెయ్యపేట జంక్షన్‌లో మానవ హారంగా ఏర్పడి మూడు రాజధానులు కోరుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కోఆపరేటివ్‌ అధ్యక్షులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వికేంద్రీకరణ, విశాఖ పరిపాలనా రాజదాని కోరుతూ బుచ్చింపేట నుంచి జె.పి.అగ్రహారం వరకు వివిధ అభివృద్ధి సంఘాల ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

శ్రీకాకుళం జిల్లాలో..
వికేంద్రీకరణకు మద్దతుగా శ్రీకాకుళం జిల్లాలో ఐదు రోజులుగా జరుగుతున్న రిలే దీక్షలు బుధవారంతో ముగిశాయి. నరసన్నపేటలో జరుగుతున్న ఈ దీక్షా శిబిరాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బుధవారం సందర్శించారు. ఈ నెల 15న నాన్‌ పొలిటికల్‌ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విశాఖ గర్జనకు ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.

విశాఖను పరిపాలన రాజధాని చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఆముదాలవలస నియోజకవర్గం పొందూరులో స్పీకర్‌ తమ్మినేని సీతారాం వికేంద్రీకరణ అవసరాన్ని ప్రజలకు వివరిస్తూ, విశాఖ రాజధాని సాధన కోసం యువత, ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

విజయనగరం జిల్లాలో..
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో సదస్సులు నిర్వహించారు. బాడంగి మండలం భీమవరంలో జరిగిన సదస్సులో జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు పాల్గొని ఉత్తరాంధ్ర అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ విశాఖ గర్జనకు రావాలని పిలుపునిచ్చారు. బాడంగి మండలంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో వికేంద్రీకరణకు మద్దతుగా ప్రదర్శనలు చేశారు.

అల్లూరి జిల్లాలో..
మూడు రాజధానులకు మద్దతుగా చింతపల్లిలోని ముత్యాలమ్మ దేవాలయంలో వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు మత్స్యరాస వెంకటలక్ష్మి 108 కొబ్బరి కాయలు కొట్టారు. 26 జిల్లాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం జగన్‌కు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలబడేలా దీవించాలని మొక్కుకున్నారు.  

మరిన్ని వార్తలు