ఆయన మరణం పార్టీకి తీవ్రమైన లోటు

17 Sep, 2020 16:03 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : తిరుపతి వైఎస్సార్‌ సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు మరణం పార్టీకి తీవ్రమైన లోటని, పార్ల‌మెంట్‌లో రాష్ట్ర ప్ర‌జ‌ల గ‌ళం వినిపిస్తూ, రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ప‌రితపిస్తున్న వైఎస్సార్‌ సీపీ ఎంపీల‌ బృంద‌ంలో ఒక సీనియ‌ర్ నేత‌ను కోల్పోయామని ప్ర‌భుత్వ ‌స‌ల‌హాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. దుర్గాప్ర‌సాదరావు అకాల మ‌ర‌ణానికి చింతిస్తూ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సంతాప సభ  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణ‌ారెడ్డి, మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, శంక‌ర్ నారాయ‌ణ‌, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి త‌దిత‌రులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ‘‘  దుర్గాప్రసాదరావు వైఎస్సార్‌ సీపీ త‌రపున ఎంపీ అయ్యే స‌మ‌యానికి ముందే మంత్రిగా, శాసన స‌భ్యునిగా ద‌శాబ్దాల పాటు నెల్లూరు, చిత్తూరు, రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల‌కు.. అలాగే ఉమ్మ‌డి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు కూడా ‌సుప‌రిచితులు. ఆయ‌న ఆస్ప‌త్రిలో కోలుకుంటున్నారు అనే స‌మ‌యానికి గుండెపోటుతో మ‌ర‌ణించ‌డం అనేది చాలా బాధాక‌ర‌మైన విష‌యం. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు పార్టీ త‌రపున ప్ర‌గాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఈ వార్త తెలిసిన వెంటనే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దుర్గాప్రసాదరావు కుమారుడితో మాట్లాడారు. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండ‌గా ఉంటామ‌ని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. ఒక మంచి నాయ‌కుడిని, సీనియ‌ర్ నాయ‌కుడిని, ద‌ళిత నాయ‌కుడిని, పార్ల‌మెంట్ స‌భ్యుడిని కోల్పోవ‌డం అనేది పార్టీకే కాకుండా రాష్ట్రానికి కూడా న‌ష్టంగా భావిస్తూ, ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాలని కోరుకుంటున్నామ’’న్నారు. ( ఎంపీ దుర్గాప్రసాద్‌ అంత్యక్రియలు పూర్తి )

మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ.. ‘‘ నెల్లూరు జిల్లా వాసిగా దాదాపు మూడు ‌సార్లు శాసన స‌భ్యునిగా, మంత్రిగా, తిరుప‌తి పార్ల‌మెంట్ స‌భ్యులుగా బ‌ల్లి దుర్గాప్ర‌‌సాదరావు ప్రజలకు సేవలందించారు. ఆయన అకాల మ‌ర‌ణం పార్టీకి, ఈ రాష్ట్రానికే కాకుండా, ముఖ్యంగా  నెల్లూరు జిల్లాకు తీర‌ని లోటు. ఒక మంచి నాయ‌కుడు, ఎప్పుడు న‌వ్వుతూ ఆప్యాయంగా ప‌ల‌కరించే వ్య‌క్తి దుర్గాప్ర‌‌సాదరావు. ఆ బాధ నుంచి ఆ కుటుంబం త్వ‌ర‌గా కోలుకోవాల‌ని, ఆ కుటుంబానికి ఆ భ‌గ‌వంతుడు మ‌నోధైర్యం ప్ర‌‌సాదించాల‌ని కోరుకుంటున్నాను.’’

మంత్రి శంక‌ర నారాయ‌ణ మాట్లాడుతూ..‘‘ అతి చిన్న వ‌య‌సులోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చి, మూడు ‌సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ప‌ని చేసి, ప్రస్తుతం తిరుప‌తి ఎంపీగా ఉన్న గొప్ప నాయకుడు దుర్గాప్ర‌సాదరావును కోల్పోవ‌డం పార్టీకి తీర‌ని లోటు. అలాగే ఆ ప్రాంత ప్ర‌జ‌లంద‌రూ ఆయ‌న చేసిన సేవ‌ల‌ను, ఆ ప్రాంత అభివృద్ధికి ఆయ‌న చేసిన కృషిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్నాము. ఆయ‌న కుటుంబ స‌భ్యులంద‌రికి ఆ దేవుడు మ‌నోధైర్యాన్ని, మ‌నో నిబ్బ‌రాన్ని ప్ర‌సాదించాల‌ని కోరుకుంటూ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్‌రావుకు ఘ‌న‌ నివాళులు అర్పిస్తున్నాము.’’

ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ‘‘ తిరుప‌తి పార్ల‌మెంట్ స‌భ్యులు, రాయ‌ల‌సీమ జిల్లాల్లో సీనియ‌ర్ ద‌ళిత నాయ‌కులు  బ‌ల్లి దుర్గాప్ర‌‌సాద్‌రావు అకాల మ‌ర‌ణం పార్టీకి, ద‌ళిత‌ లోకానికి తీర‌ని లోటు. మొన్న జ‌రిగిన ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్‌ ఏరికోరి తిరుప‌తి పార్ల‌మెంట్ నుంచి బ‌ల‌మైన‌ ద‌ళిత నాయ‌కుడిని తీ‌సుకురావాల‌ని దుర్గాప్రసాద్‌రావును అభ్యర్థిగా నిల‌బెట్టారు. సీఎం జగన్‌ నమ్మకాన్ని నిలబెడుతూ ఆయన ఆ ప్రాంతంలో  దళిత హక్కులు కాపాడుతూనే  ఆ ప్రాంత సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుప‌‌డ్డారు’’

మరిన్ని వార్తలు