ఇది.. జగనన్న పాదయాత్ర కాలనీ

19 Jan, 2021 05:09 IST|Sakshi
గొల్లపూడిలోని జగనన్న పాదయాత్ర కాలనీ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి, హోంమంత్రి సుచరిత, చిత్రంలో మంత్రులు కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్‌, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు జోగిరమేష్, వసంత కృష్ణప్రసాద్, వంశీ తదితరులు

జగనన్న పాదయాత్రలో నడిచింది 3,648 కిలోమీటర్లు 

గొల్లపూడి లే అవుట్‌లో 3,648 మందికి పట్టాల పంపిణీ 

పట్టాతో పాటు చీర, గాజులు, పసుపు, కుంకుమ కూడా.. 

సాక్షి, అమరావతి: ప్రజల సమస్యల్ని క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన 3,648 కిలోమీటర్ల చారిత్రాత్మక పాదయాత్రకు గుర్తుగా 3,648 ఇళ్లతో ఒక కాలనీ రూపుదిద్దుకోనుంది. ప్రజల కష్టాలు తీర్చడానికి, వారి సంక్షేమం కోసం చేపట్టే అనేక పథకాల ఆలోచనలకు పురుడుపోసిన పాదయాత్ర తీపి గుర్తు.. ‘జగనన్న పాదయాత్ర కాలనీ’గా ల్యాండ్‌మార్క్‌ కానుంది. విజయవాడ నగరానికి సమీపంలోని గొల్లపూడిలో ఈ కాలనీ ఏర్పాటు కానుంది. ‘నవరత్నాలు–అందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా మైలవరం నియోజకవర్గంలోని గొల్లపూడిలో సోమవారం 3,648 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. లబ్ధిదారులకు ఇంటి పట్టాతో పాటు చీర, గాజులు, పసుపు, కుంకుమ అందజేశారు. జగనన్న మాకోసం నడిచింది 3,648 కిలోమీటర్లు.. మా కాలనీలో ఇళ్లు 3,648.. అంటూ లబ్ధిదారులు ఆనందంతో చెప్పుకోవడం వినిపించింది. 

నిరంతరం ప్రజల కోసం ఆలోచించే సీఎం వైఎస్‌ జగన్‌: మంత్రి పెద్దిరెడ్డి 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 3,648 కిలోమీటర్ల పాదయాత్రచేసి ప్రజలతో మమేకమయ్యారని, గొల్లపూడి లేఅవుట్‌లో 3,648 మందికి పట్టాలు ఇవ్వడం సంతోషంగా ఉందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. పాదయాత్ర సాగిన దూరం, ఈ లేఅవుట్‌లో పేదలకు ఇస్తున్న పట్టాల సంఖ్య కలవడం బాగుందన్నారు. ఇది ‘జగనన్న పాదయాత్ర కాలనీ’గా ల్యాండ్‌మార్క్‌ అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. గొల్లపూడిలో జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో 90 శాతం ఎన్నికల హామీలను అమలు చేసిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కు దక్కుతుందని, దేశ చరిత్రలో ఈ రకంగా హామీలను అమలు చేసిన తొలి ముఖ్యమంత్రి కూడా ఆయనేనని చెప్పారు.

ఎన్నికల్లో ఆరువేలకు పైగా హామీలిచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేకపోయారని, వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపే హామీలన్నీ దాదాపుగా అమలు చేశారని తెలిపారు. పోలవరం, ఉత్తరాంధ్ర, రాయలసీమలో ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో సుమారు 31 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇవ్వడం ఒక చరిత్ర అని చెప్పారు. అమరావతి ప్రాంతంలో 50 వేలమంది పేదలకు ఇళ్లపట్టాలు ఇస్తామంటే చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం ప్రజల కోసమే ఆలోచన చేస్తుంటారని పేర్కొన్నారు. పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని, రవాణాశాఖ మంత్రి పేర్ని నాని, హోం మంత్రి మేకతోటి సుచరిత, దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

యాదృచ్ఛికంగానే.. 
పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ 3,648 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్ర కో ఆర్డినేటర్‌గా వ్యవహరించిన తలశిల రఘురాం స్వగ్రామం గొల్లపూడి. ఆ ఊళ్లో ఏర్పాటు చేసిన లేఅవుట్‌లో 3,648 ప్లాట్లు ఉన్నాయి. ఇది యాదృచ్చికంగానే జరిగిందని రఘురాం ‘సాక్షి’కి చెప్పారు.  

మరిన్ని వార్తలు