సంక్షేమానికి నీరాజనం

17 Nov, 2020 03:48 IST|Sakshi
గుంటూరు జిల్లా పెదకూరపాడులో నిర్వహించిన భారీ పాదయాత్రలో ఎమ్మెల్యేలు శంకరరావు, అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తదితరులు

‘ప్రజల్లో నాడు–ప్రజల కోసం నేడు’ కార్యక్రమాలకు బ్రహ్మరథం 

కుల వృత్తులు, చేతి వృత్తుల శకటాలతో పాదయాత్రలు, ర్యాలీలు

పార్టీలకు అతీతంగా తరలివచ్చిన ప్రజలు

సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రమంతటా ప్రజాచైతన్య ఝరి ఎగసింది. ప్రజాసంక్షేమ కార్యక్రమాల అమలు తీరుకు నీరాజనం పలికింది. కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి వెన్నుదన్నుగా నిలుస్తూ.. అన్ని వర్గాలనూ ఆదుకుంటూ ముందడుగు వేస్తున్న పాలనకు జేజేలు పలికింది. జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ప్రజల్లో నాడు–ప్రజల కోసం నేడు’ కార్యక్రమాలు సోమవారంతో ముగిశాయి. చివరి రోజున సైతం పాదయాత్రలు, ర్యాలీలు, ఇతర కార్యక్రమాలు హోరెత్తాయి. విజయనగరం జిల్లా కురుపాంలో ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, నెల్లిమర్లలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ పాదయాత్ర చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అట్టహాసంగా కార్యక్రమాలు జరిగాయి.

విశాఖ జిల్లాలో ఎంపీ భీశెట్టి సత్యవతి, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ మహా పాదయాత్ర నిర్వహించారు. కుల వృత్తులు, చేతి వృత్తుల శకటాలతో వినూత్న ప్రదర్శన జరిపి బహిరంగ సభ జరిపారు. పార్టీ సిటీ విభాగం ఆధ్వర్యంలో ఆనం కళా కేంద్రంలో గుడి సెట్టింగ్‌ వేసి సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కొలిచారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పాదయాత్ర నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రకు ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ హాజరయ్యారు. భీమవరంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పాదయాత్రలు జరిగాయి. విజయవాడ పశ్చిమలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ప్రజాచైతన్య పాదయాత్రలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో పలుచోట్ల హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు పాల్గొన్నారు.

చిలకలూరిపేటలో మహిళలు 25 వేల ప్రమిదలను అమ్మ ఒడి, విద్యాదీవెన తదితర 12 పథకాల పేర్లతో అమర్చి కార్తీక దీపాల్ని వెలిగించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జేజేలు పలికారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ పాదయాత్ర నిర్వహించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్‌నారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్, అనంతపురంలో ఎంపీ తలారి రంగయ్య పాదయాత్రలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో నిర్వహించిన పాదయాత్రలకు విశేష స్పందన లభించింది. ఎంపీ రెడ్డెప్ప పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో పలుచోట్ల సంఘీభావ యాత్రలను అట్టహాసంగా నిర్వహించారు. కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఎమ్మెల్యేలు, నాయకుల ఆధ్వర్యంలో పాదయాత్రలు జరిగాయి.

మరిన్ని వార్తలు