YSRCP Leaders: ప్రజాశీస్సుల కోసం గడప గడపకూ..

9 May, 2022 03:07 IST|Sakshi

ఎల్లుండి నుంచి ఇంటింటికీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ

ఒక్కో సచివాలయం పరిధిలో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు రెండు రోజుల పర్యటన

మూడేళ్లలోనే 95 శాతం హామీల అమలు.. ఎన్నికల మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం 

డీబీటీ రూపంలో లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1,38,894 కోట్లు జమ

31 లక్షలకుపైగా పేదలకు 17,005 వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణం

పరిపాలన వికేంద్రీకరణతో ప్రజల చెంతకే ప్రభుత్వ సేవలు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సింహభాగం పదవులతో సామాజిక మహా విప్లవం 

వీటన్నింటినీ ప్రతి ఇంటికీ వెళ్లి వివరించి, ఆశీర్వాదం కోరనున్న ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు

ప్రతి మంచి పనిపై దుష్ప్రచారం చేస్తున్న దుష్టచతుష్టయం తీరునూ ఎండగట్టాలని నిర్ణయం

ప్రతి గ్రామంలో బూత్‌ కమిటీల ఏర్పాటు.. అందులో 50 శాతం మహిళలకు స్థానం

తద్వారా వైఎస్సార్‌సీపీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం జగన్‌ అడుగులు

సాక్షి, అమరావతి: మూడేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా చేకూర్చిన ప్రయోజనంతో పాటు ప్రతిపక్షం, ఎల్లో మీడియా సాగిస్తున్న దుష్ప్రచారాన్ని ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు ప్రజలకు వివరించి.. వారి ఆశీర్వాదం తీసుకునే  గడపగడపకూ వైఎస్సార్‌సీపీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11న ప్రారంభం కానుంది. సీఎం వైఎస్‌ జగన్‌ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఒక్కో సచివాలయం పరిధిలో రెండు రోజులపాటు పర్యటించి.. ప్రతి ఇంటి గడపకూ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లు వెళ్లనున్నారు. ఆ ఇంటి సభ్యులకు మూడేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా చేకూర్చిన ప్రయోజనాన్ని, సంక్షేమాభివృద్ధి పథకాలకు మారీచుల్లా అడ్డుపడుతున్న దుష్టచతుష్టయం (టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5) తీరును వివరించి.. తమకు తోడుగా ఉండాలని కోరనున్నారు. 

మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం 
దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు.. 151 శాసనసభ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ రికార్డు విజయాన్ని సాధించింది. అధికారం చేపట్టిన మూడేళ్లలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేసి.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం చెప్పారని రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో సంక్షేమ పథకాల ద్వారా అర్హతే ప్రమాణికంగా.. ఎలాంటి అవినీతికి తావు ఇవ్వకుండా.. డీబీటీ (నగదు బదిలీ) ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.1,38,894 కోట్లు జమ చేశారు.

కరోనా ప్రతికూల పరిస్థితుల్లో.. ఆర్థిక ఇబ్బందుల్లో.. నిరుపేద లబ్ధిదారులకు ఆర్థిక సమస్యలు లేకుండా చేశారని సామాజిక వేత్తలు ప్రశంసిస్తున్నారు. ఇళ్లు లేని 31 లక్షలకుపైగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చి.. గృహాలను నిర్మిస్తున్నారు. ఏకంగా 17,005 ఊళ్ల (వైఎస్సార్‌ జగనన్న కాలనీలు)ను కట్టడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని పరిశీలకులు చెబుతున్నారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను కార్పొరేట్‌కు దీటుగా ఆధునికీకరిస్తున్నారు. రహదారులను అభివృద్ధి చేశారు. ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు వీటన్నింటినీ ప్రతి ఇంటికీ వెళ్లి వివరించడంతో పాటు.. ఎన్నికల మేనిఫెస్టో, మూడేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులకు చేకూర్చిన ప్రయోజనాన్ని వివరిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ రాసిన లేఖను ఆ కుటుంబానికి అందించి, ఆశీర్వదించాలని కోరనున్నారు. 

దుష్టచతుష్టయంపై యుద్ధం 
సంస్కరణల ద్వారా పరిపాలనలో సీఎం వైఎస్‌ జగన్‌ విప్లవాత్మక మార్పులు తెచ్చారు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత జిల్లాలను పునర్‌ వ్యవస్థీకరించి.. పరిపాలన సౌలభ్యం, ప్రజలకు సౌకర్యం కోసం 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే సంక్షేమ పథకాల నుంచి పరిపాలన వికేంద్రీకరణ వరకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు మారీచుల్లా అడ్డుపడుతున్నారు.

సీఎం జగన్‌కు మంచి పేరు వస్తుండటం చూసి కడుపు మంటతో ఇళ్లు, ఇంగ్లిష్‌ మీడియం.. తదితర పథకాలు, కార్యక్రమాలపై కోర్టుల్లో కేసులు వేయించారు. బ్యాంకుల ద్వారా నిధులు అందకుండా చేయడం ద్వారా రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోజూస్తున్నారు. ఒక బలమైన దురుద్దేశంతో విస్తృతంగా దుష్ఫ్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జ్‌లు వీటన్నింటి గురించి కూడా ప్రజలకు వివరించి, తమను ఆశీర్వదించాలని, తమకు తోడుగా నిలవాలని కోరనున్నారు. ఒక్కో నియోజకవర్గం పరిధిలో సుమారు 80 సచివాలయాలు ఉంటాయి. నెలలో 20 రోజులు గడపగడపకూ వైఎస్సార్‌సీపీ కార్యక్రమం సాగుతుంది. అంటే.. ఈ కార్యక్రమం పూర్తవడానికి 8 నుంచి 9 నెలల సమయం పడుతుంది.

పార్టీ బలోపేతమే లక్ష్యం
ప్రజలతో మరింతగా మమేకమవడానికి దోహదపడే ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత నెల 27న నిర్వహించిన సమావేశంలో ఈ కార్యక్రమాన్ని ప్రణాళికా బద్ధంగా నిర్వహించి.. విజయవంతం చేసే బాధ్యతను ప్రాంతీయ సమన్వయకర్తలు, మంత్రులు, జిల్లా అధ్యక్షులకు అప్పగించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లను జిల్లా అధ్యక్షులు, మంత్రులు, ప్రాంతీయ సమన్వయకర్తలు సమన్వయం చేయనున్నారు. రోజూ ఈ కార్యక్రమాన్ని సమీక్షించే బాధ్యతను ప్రాంతీయ సమన్వయకర్తల కో–ఆర్డినేటర్, వైఎస్సార్‌పీపీ నేత వి.విజయసాయిరెడ్డికి సీఎం అప్పగించారు.

ఈ కార్యక్రమ తీరుతెన్నులను తాను కూడా క్రమం తప్పకుండా సమీక్షిస్తానని స్పష్టం చేశారు. సచివాలయం పరిధిలో ఈ కార్యక్రమం ముగిసేలోపే.. బూత్‌ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీల్లో 50 శాతం మహిళలకు స్థానం కల్పించనున్నారు. తద్వారా బూత్‌ స్థాయి నుంచే పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలన్నది సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యం. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఆఖండ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే క్రియాశీలకం చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

మరిన్ని వార్తలు