మంత్రి హోదాలో విచ్చేసిన సీదిరి

31 Jul, 2020 12:23 IST|Sakshi
మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు

పలాస: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందని 
మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఆయన మంత్రి హోదాలో పలాసకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పేద ప్రజల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని అన్నారు. పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా సీఎం పాలన కొనసాగుతోందని తెలిపారు. సామాన్య మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన తనకు మంత్రి పదవి కేటాయించడం ద్వారా మత్స్యకారులు సీఎం జగన్‌కు రుణపడి ఉంటారన్నారు.

అయితే ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన సీదిరి అప్పలరాజు పలాస నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా.. ఈ ప్రాంతం నుంచి మంత్రి పదవిని అధిష్టించిన మొదటి నేత గా అరుదైన గుర్తింపు సాధించారు. మత్స్య, పశు సంవర్ధక మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మొదటిసారిగా మంత్రి హోదాలో పలాసలో అడుగు పెట్టారు. 

ఇదీ చరిత్ర.. 
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలు సోంపేట, టెక్కలి నియోజకవర్గాల్లో ఉండేవి. సోంపేట నియోజకవర్గానికి 1952లో జరిగిన మొదటి ఎన్నికల్లో గౌతు లచ్చన్న ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వరసగా ఆయన ఐదు సార్లు, కుమారుడు గౌతు శ్యామసుందర శివాజీ ఐదుమార్లు ఎన్నికయ్యారు. మధ్యలో మజ్జి తులసీదాసు, ఆయన సోదరుడు మజ్జి నారాయణరావులు చెరోసారి గెలిచారు. నారాయణరావు ఒక ఏడాది మాత్రమే ఎమ్మెల్యేగా పనిచేశారు. వీరిలో గౌతు శివాజీ మాత్రమే సహాయ మంత్రిగా కొంతకాలం పనిచేశారు. టెక్కలి నియోజకవర్గంలో మొదటగా ఆర్‌ఎల్‌ఎన్‌ దొర ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత రోణంకి సత్యనారాయణ, నిశ్చెర్ల రాములు, సత్తారు లోకనాథం, బమ్మిడి నారాయణస్వామి, అట్టాడ జనార్దనరావు, వరద సరోజ, దుబ్బాడ నాగావళి, హనుమంతు అప్పయ్యదొర, డాక్టర్‌ కె.రేవతీపతిలు ఎమ్మెల్యేలుగా పనిచేశారు.

వీరిలో ఎవరికి కూడా మంత్రి పదవి లభించలేదు. నియోజకవర్గ పునర్విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన పలాస నియోజకవర్గానికి మొదటి ఎమ్మెల్యేగా జుత్తు జగన్నాయకులు 2009లో శివాజీపై గెలుపొందారు. 2014లో మళ్లీ శివాజీ ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో సీదిరి అప్పలరాజు అపూర్వ విజయం సాధించారు. ఆ వెంటనే సమస్యల పరిష్కారానికి నడుం బిగించారు. ఆ చొరవ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టిలో పడింది. దీంతో పాటు 200 పడకల ఆస్పత్రి, కిడ్నీ పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన వంటి పనులు కూడా సీదిరి పనితీరును చూపించాయి. అలాగే డయాలసిస్‌ కేంద్రాల ఏ ర్పాటు, కిడ్నీ రోగులకు పింఛన్లు, రక్షిత మంచినీటి కోసం రూ.700 కోట్లతో పనులు, మంచినీళ్లపేట వద్ద ఫిషింగ్‌ జెట్టీ వంటి పనులు సీదిరి నాయకత్వంపై స్థానికులు ఆశలు పెంచుకునేలా చేశాయి. అతి తక్కువ కాలంలో ఇన్ని పనులు జరగడంతో ఆయనకు మంత్రి పదవి కూడా వరించింది. దీంతో స్థానికులు సంబర పడుతున్నారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిస్తున్నారు.  

మరిన్ని వార్తలు