దళితులను బెదిరించి భూములు లాక్కున్నారు: ఆర్కే

5 Jul, 2021 07:01 IST|Sakshi

వీడియో బహిర్గతం చేసిన ఎమ్మెల్యే ఆర్కే

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి చంద్రబాబే సూత్రధారి

మంత్రులు, కొందరు ఐఏఎస్‌లూ పాత్రధారులే

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో దళితులను బెదిరించి అసైన్డ్‌ భూములు లాక్కుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారని, ఈ వ్యవహారంలో మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, కొందరు ఐఏఎస్‌ల పాత్ర ఉందని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వీడియో ఆధారాలతో సహా బహిర్గతం చేశారు. దళితుల నుంచి అసైన్డ్‌ భూములను లాక్కున్నాకే గత సర్కారు  ప్యాకేజీని ప్రకటించిందన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇవీ...

నిజాలు నిగ్గు తేల్చిన వీడియో..
దాదాపు 9 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో మంగళగిరికి చెందిన రియల్టర్‌  కొమ్మారెడ్డి (భూమిపుత్ర) బ్రహ్మానందరెడ్డి టీడీపీ పెద్దల ఆదేశాల మేరకు కొందరు రియల్టర్లను పిలిచి తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో దళితులు భూములు అమ్మకపోతే నష్టపోతారని ప్రచారం చేయించాడు. ఈ హెచ్చరికలతో ఆందోళనకు గురైన దళితులు భూములను తెగనమ్ముకున్నారు. డబ్బులు ముట్టినట్లు బాండ్‌ పేపర్ల మీద వారి సంతకాలు తీసుకున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కట్టలు కట్టలు డబ్బులు తీసుకుని వెళ్లి ఇవ్వడం వీడియోలో కనిపిస్తోంది. రాజధాని ఎక్కడనేది ముందే తెలుసుకాబట్టి చంద్రబాబు ఈ పని చేయించారు. ఆయన బినామీలకు భూములు బదిలీ అయ్యాక ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించింది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సాంబశివరావు ఇందులో కీలక పాత్రధారి. రాజధాని గ్రామాల రెవెన్యూ  రికార్డులన్నింటినీ దొంగతనంగా తరలించారు. అప్పటి గుంటూరు జిల్లా ఐఏఎస్‌ అధికారులు కోన శశిధర్, కాంతీలాల్‌ దండేల సహకారంతో ఈ భూములన్నింటినీ తమకు కావాల్సిన వారికి కట్టబెట్టారు. నాలుగైదు వేల ఎకరాల భూములను కొట్టేసి దళితుల నోట్లో మట్టికొట్టారు. ముందుగానే వారితో బాండు పేపర్ల మీద సంతకాలు తీసుకోవడం ఓ కుట్ర. ప్రభుత్వ భూములకు తప్పుడు రికార్డులు సృష్టించి అనుయాయులకు ప్యాకేజీ వచ్చేలా రూ.కోట్లు కొల్లగొట్టారు.

రికార్డుల ట్యాంపరింగ్‌..
దళితులకు 1940 కన్నా ముందే ఇచ్చిన భూముల పట్టాలు వారి వద్దే ఉన్నాయి. ఆ రోజు నుంచీ వారు ఆ భూములను అనుభవిస్తున్నారు. బెదిరించి లాక్కున్న భూములన్నీ వారికి తిరిగి ఇప్పించాలి. మాజీ ఐఏఎస్‌ అధికారి సాంబశివరావు భూములకు హద్దులు లేకుండా చేశారు. గుంటూరు కలెక్టర్‌ కార్యాలయంలో కూర్చుని రికార్డులు మొత్తం ట్యాంపరింగ్‌ చేయించారు. దీంతో దళిత సోదరులు మోసానికి గురయ్యారు. చంద్రబాబు చెప్పిన తప్పుడు పనులను చేయలేదని అప్పట్లో ఐఏఎస్‌ అధికారి  నాగులపల్లి శ్రీకాంత్‌ను తప్పించారు. క్యాట్‌లో కేసులు ఉన్న చెరుకూరి శ్రీధర్‌ను తీసుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చాలి. దోషులను శిక్షించాలి. దళితులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కోరుతున్నా. 
   

మరిన్ని వార్తలు