హీరోయిన్‌గా రాణించడం కష్టమన్నారు..

17 Nov, 2020 17:11 IST|Sakshi

నేడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా పుట్టినరోజు

సాక్షి, చిత్తూరు : వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) చైర్మన్‌ ఆర్‌కే రోజా పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆమె జన్మదినం సందర్భంగా వేడుకలు జరుపుకున్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఆమె జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక సినీ పరిశ్రమలోనూ సుధీర్ఘ కాలం కొనసాగిన రోజుకు పలువురు సినీ ప్రముఖుల నుంచి కూడా జన్మదిన శుభాకాంక్షలు అందాయి.

చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన రోజా 1972 నవంబర్‌ 17న జన్మించారు. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీలో చదివారు. రాజకీయ విజ్ఞానంలో నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పట్టభద్రులయ్యారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. 2004, 2009 శాసనసభ ఎన్నికల్లో నగరి, చంద్రగిరి నియోజకవర్గాల నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014 శాసనసభ ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నగరి నియోజకవర్గం నుంచి పోటీచేసి తన సమీప అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడుపై 858 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019లోనూ విజయం సాధించి వరుసగా రెండోసారి చట్టసభకు ఎన్నికయ్యారు. 

అగ్ర కథానాయకుల సరసన
రాజకీయాల్లోకి రాకముందు రోజా తెలుగు చిత్రాలతో చిత్ర రంగ ప్రవేశం చేశారు. డాక్టర్‌ శివప్రసాద్‌ ప్రోత్సాహంతో రాజేంద్ర ప్రసాద్‌ సరసన ప్రేమ తపస్సు సినిమాలో కథానాయికగా చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించారు. తరువాత, సినీ నిర్మాతగా కూడా మారారు. తమిళ చిత్ర పరిశ్రమకు దర్శకులు ఆర్.కే.సెల్వమణిని వివాహం చేసుకున్నారు. వెండితెరపైనే కాక బుల్లితెరపై కూడా జబర్దస్త్, బతుకు జట్కబండి, రంగస్థలం వంటి షోలకు ప్రయోక్తగా వ్యవహరిస్తూ దూసుకెల్తున్నారు.

రెండుసార్లు ఎమ్మెల్యేగా..
ఈ సందర్భంగా మంగళవారం సాక్షి నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రోజా మాట్లాడారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. వైఎస్సార్‌సీపీలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం సంతోషంగా ఉంది. చిత్ర పరిశ్రమలో ఎంతో కాలం కొనసాగాను. తొలినాళ్లలో హీరోయిన్‌గా రాణించడం చాలా కష్టమని ఎంతో మంది ఎగతాలి చేశారు. అయినప్పటికీ.. ఎంతో కష్టపడి నటన, డాన్స్‌ నేర్చుకున్నాను. పరిశ్రమలో నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాను. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమం‍త్రి జయలలిత స్ఫూర్తితో రాజకీయాల్లోకి ప్రవేశించాను. కొత్తలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాను. విమర్శలను పాజిటివ్‌గా తీసుకున్నాను. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేగా సేవ చేయడం ఆనందంగా ఉంది.’ అని సంతోషం వ్యక్తం చేశారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

>
మరిన్ని వార్తలు