ముఖం చాటేసిన టీడీపీ.. అక్కున చేర్చుకున్న వైఎస్సార్‌సీపీ

7 Aug, 2020 07:15 IST|Sakshi
సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 6.75 లక్షల చెక్కును బాధితుడు పుట్టి ఆదిబాబుకు అందజేస్తున్న ఎమ్మెల్యే ద్వారంపూడి 

తమ పార్టీ నేత మంచాన పడినా పట్టించుకోని టీడీపీ నేతలు 

చేయూతనందించిన వైఎస్సార్‌ సీపీ 

సమస్య తెలిసిన వెంటనే పరామర్శించిన ఎమ్మెల్యే ద్వారంపూడి 

సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.6.75 లక్షలు అందజేత 

అతనో టీడీపీ వీరాభిమాని.. దాదాపు 22 ఏళ్లుగా ఆ పార్టీ జెండా మోశాడు. తెలుగుదేశం విజయం కోసం రక్తం ధారపోశాడు. తీరా కష్టం వచ్చేసరికి దన్నుగా నిలవాల్సిన సొంత పార్టీ ముఖం చాటేసింది. శత్రువుగా భావించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అక్కున చేర్చుకొని ప్రాణదానం చేసింది.   

సాక్షి, కాకినాడ: కాకినాడ జగన్నాథపురం గొల్లపేటకు చెందిన పుట్టా ఆదిబాబు (ఆదినారాయణ) రెండు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీని వెన్నంటి ఉన్నాడు. మాజీ మంత్రి యనమల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో పయనిస్తూ పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తూ వచ్చాడు. జిల్లా టీడీపీ కార్యదర్శిగా, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌గా, తెలుగుయువత కార్యదర్శిగా టీడీపీలో అనేక పదవులు చేశాడు. ఇలా పార్టీ కోసం పాటుపడుతూ.. అకస్మాత్తుగా దాదాపు రెండున్నరేళ్ల క్రితం సొంత పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యులను సంప్రదిస్తే రెండు కిడ్నీలూ పాడయ్యాయని, ఎంతోకాలం బతకడం కష్టం అన్నారు.  

ముఖం చాటేసిన టీడీపీ 
రెండు దశాబ్దాలకు పైగా పడ్డ కష్టానికి తనను తెలుగుదేశం పార్టీ తనను ఆదుకొంటుందని ఆశపడ్డ పుట్టి ఆదిబాబుకు నిరాశే ఎదురైంది. నమ్ముకొన్న నేతల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. సదరు నేతలు ముఖం చాటేసి నిర్లక్ష్యం చేయడంతో జీవితంపై ఆదిబాబు ఆశలు వదులుకొన్నారు.  
 
ఎమ్మెల్యే ద్వారంపూడి దృష్టికి రాగానే.. 
ఆదిబాబు అనారోగ్య సమస్యను కుటుంబ సభ్యులు సుమారు ఏడాది క్రితం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి ఆరోగ్య సమస్యను తీసుకొచ్చారు. గడచిన ప్రతి ఎన్నికలోనూ 20 ఏళ్లుగా తన ఓటమి కోసం పనిచేసిన ఆదిబాబు విషయంలో ఎమ్మెల్యే మాత్రం సానుకూలంగా స్పందించారు. అతడి ఇంటికి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకొన్నారు. కార్పొరేటర్‌ ఎంజీకే కిశోర్‌కు అతడి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే  బాధ్యత అప్పగించారు. మూడు నెలలకు బతికే అవకాశం లేదన్న వైద్యుల సూచన నేపథ్యంలో వెంటనే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కోసం విశాఖ పంపించారు. దాతలతో కూడా ఎమ్మెల్యే సంప్రదించి ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో ఆదిబాబు పూర్తిగా కోలుకొనే వరకు నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చారు.  (ఉన్నతంగా మారుద్దాం)

  
సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.6.75 లక్షలు 
ఆదిబాబు ఆర్థిక, ఆరోగ్య సమస్యను ఎమ్మెల్యే ద్వారంపూడి ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా ఆదిబాబుకు రూ.6.75 లక్షలు విడుదల చేశారు. ప్రభుత్వం నుంచి విడుదలైన ఆ చెక్కును ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి బాధితుడు పుట్టా ఆదిబాబుకు తన నివాసం వద్ద అందజేశారు. 

మానవీయతకు దర్పణం 
అతను తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి అయినా.. ఆరోగ్యం కుదుటపడేవరకు పర్యవేక్షించడంతో పాటు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా నిధులు విడుదల చేయించిన తీరుపై  
హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 

సీఎం పారదర్శతకు నిదర్శనం 
ఎన్నికల తరువాత పారీ్టలకతీతంగా.. అర్హతే ప్రాతిపదికగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సాగిస్తున్న పారదర్శక పాలనకు ఈ సంఘటన నిదర్శనం. ఇదే తరహాలో ఇళ్ల స్థలాలు, పింఛన్లు సహా ప్రతి పథకాన్ని అర్హులకు అందజేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ముఖ్యంగా ఆదిబాబు విషయంలో సీఎం ఎంతో సానుకూలంగా వ్యవహరించి నిధులు విడుదల చేయడం ఆనందదాయకం.     – ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే

ఆజన్మాంతం రుణపడి ఉంటా.. 
ప్రాణభిక్ష పెట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డిలకు జన్మజన్మలకు రుణపడి ఉంటా. నమ్ముకొన్న తెలుగుదేశం పార్టీ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. నేను పనిచేసిన పార్టీని చూడకుండా నా ఆరోగ్య సమస్యను మాత్రమే దృష్టిలో ఉంచుకొని ప్రాణదానం చేసిన ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 
– పుట్టి ఆదిబాబు, బాధితుడు 

మరిన్ని వార్తలు