దమ్ముంటే కర్నూలు నుంచి పోటీ చెయ్‌!

9 May, 2022 11:25 IST|Sakshi

కర్నూలు(రాజ్‌విహార్‌): జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు దమ్ముంటే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవాలని కర్నూలు ఎమ్మెల్యే ఎంఎ హఫీజ్‌ఖాన్‌ అన్నారు. ఆదివారం కర్నూలు పాతబస్తీలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు చోట్ల పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన పవన్‌కు ప్రజా సంక్షేమ పాలనపై విమర్శించే అర్హత లేదన్నారు. ఆయన ఉనికిని కాపాడుకునేందుకే పర్యటనలు చేస్తున్నారని, నిజంగా ప్రజాబలం ఉంటే కర్నూలులో పోటీ చేయాలన్నారు.

 గోదావరి జిల్లాల కంటే ఇక్కడ ఘోరంగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతూ పర్యటనలు చేస్తున్నారు తప్ప ప్రజా మేలు కోసం కాదన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీల్లో 95 శాతానికి పైగా అమలు చేశారని, అందులో అత్యధిక శాతం బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకు మేలు చేసేవి ఉన్నాయన్నారు. పవన్‌ ఒకవైపు బీజేపీతో కాపురం చేస్తూ.. మరోవైపు టీడీపీతో జత కట్టేందుకు తహతహలాడుతున్నారని పేర్కొన్నారు. కర్నూలుకు వచ్చిన ఆయన రైతుల గురంచి మాట్లాడడం కాదని.. గతంలో చంద్రబాబు కర్నూలుకు ఇచ్చిన హామీలపై మాట్లాడి ఉంటే ప్రజలు వినేందుకు బాగుండేదన్నారు.

 వాస్తవానికి రైతుల వ్యతిరేకి అయిన చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు అన్నదాతల మేలు కోరి మాట్లాడేందుకు ఏమీ లేదన్నారు. నటుడు పవన్‌ కల్యాణ్‌కు స్క్రిప్ట్‌ ఇచ్చి పంపించారని, ఆయన పర్యటనల్లో దానిని చదువుతూ బాబు మెప్పు పొందుతున్నారని పేర్కొన్నారు. రైతుల శ్రేయస్సు కోరి తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలు దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచాయన్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, రుణాల పంపిణీ, విత్తన సరఫరాతో పాటు ఎన్నో రకాల మేలు చేస్తున్నారని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా వైఎస్‌ఆర్‌సీపీని ఏమీ చేయలేరని అన్నారు. సమావేశంలో పార్టీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు