చంద్రబాబును దళిత జాతి ఎప్పటికీ క్షమించదు

27 Aug, 2020 14:22 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్షనేత చం‍ద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లిలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ, ‘దళితుల మీద చంద్రబాబు అండ్ కో కపట ప్రేమ చూపిస్తున్నారు. చంద్రబాబు చేతిలో దగాపడ్డ దళిత నేతలు వర్ల రామయ్య, నక్క ఆనంద్‌బాబు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మీద పుస్తకం విడుదల చేశారు. చంద్రబాబు తన పాలనలో దళిత చట్టాలను చుట్టాలుగా మార్చారు. దళితుల్లో ఎవరైనా పుడతారా అని చంద్రబాబు అన్నప్పుడే దేశం నివ్వెర పోయింది. చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం దళితులు భయబ్రాంతులతో బతికారు. చంద్రబాబు హయాంలో దళితులపై దాడుల్లో రాష్ట్రం నాలుగవ స్థానంలో ఉంది. చంద్రబాబు హయాంలో దళితులపై జరిగిన దాడులపై త్వరలో ఒక పుస్తకం విడుదల చేస్తున్నాం. చంద్రబాబు పాలనలో దళితులపై  జరిగిన దాడులపై బహిరంగ చర్చకు మేము సిద్ధం. దళితులపై దాడుల విషయంలో చంద్రబాబు మీద చాలా పుస్తకాలు వేయగలం. 

దళిత చట్టాలను చంద్రబాబు అపహాస్యం చేశారు. అంబేద్కర్ విగ్రహం పెడతామంటే  54 రోజులు పాటు దళిత కుటుంబాలను వెలివేశారు. జెర్రిపోతులపాలెంలో మీ ఎమ్మెల్యే దళిత మహిళను వివస్త్రను చేసి దాడి చేశారు. చంద్రబాబు సొంత ఊరిలో కూడా దళితులపై దాడులు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని తప్పుడు రాతలు రాయిస్తున్నారు. పెద్దిరెడ్డికి దళిత యువకుడి మరణానికి సంబంధం లేదని చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. దళితులపై ఎవరు దాడి చేసిన క్షమించేది లేదని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పారు. దళితుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు.  సీఎం జగన్‌ దళితుల పక్షపాతి. బడుగు బలహీన వర్గాలకు 60 శాతం మంత్రి పదవులు కట్టబెట్టారు. సీఎం జగన్‌ ఐదుగురు దళితులకు తన కేబినెట్ లో మంత్రి పదవులు ఇచ్చారు.  ఎస్సీకి హోమ్ మంత్రి పదవి ఇచ్చారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను చంద్రబాబు దారి మళ్లించారు. దళితులపై దాడి చేసిన వారిపై వెంటనే  సీఎం జగన్‌ చర్యలు తీసుకున్నారు’ అని మేరుగ నాగార్జున తెలిపారు. 

చదవండి: బాబుగారి 'వెన్నుపోటు' మరోసారి మార్మోగింది..

>
మరిన్ని వార్తలు