ఫోన్‌ ట్యాపింగ్‌ లేఖ పెద్ద కుట్ర 

25 Aug, 2020 08:09 IST|Sakshi

తాడికొండ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి

తాడికొండ: ఫోన్‌ ట్యాపింగ్‌ లేఖ అంశం పెద్ద కుట్ర అని, ప్రజా క్షేత్రంలో గెలవలేనని తెలిసిన చంద్రబాబు చేసేదేమీ లేక కుటిల ప్రయత్నాలు పన్నుతున్నారని తాడికొండ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. సోమవారం గుంటూరులోని తన కార్యాలయంలో మాట్లాడుతూ తమ కుట్రలతో జగన్‌ను ఎలా దెబ్బ కొట్టాలి అనే ఆలోచనలు టీడీపీలో సాగుతున్నాయన్నారు. తాజాగా టీడీపీ అనుకూల పత్రికలో వచ్చిన ‘న్యాయదేవతపై నిఘా’ అంటూ వచ్చిన కథనంలో కుట్ర కనిపిస్తుందన్నారు. దీనిపై టీడీపీ ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. రిటైర్డ్‌ జడ్జి ఈశ్వరయ్య ఒక జూనియర్‌ న్యాయాధికారితో మాట్లాడిన విషయాలపై రాద్ధాంతం చేశారని, చివరికి హైకోర్టుకు కూడా పంపించి వారికి సందేహాలు వచ్చేలా చేసేందుకు యత్నించడం సిగ్గుచేటన్నారు.

గతంలోనూ తప్పుడు కథనాలు అల్లించి చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నించారన్నారు. చంద్రబాబు తీరు నీచంగా ఉందని చెప్పారు. ఓటుకు నోటు కేసులో సైతం ఇదే జరిగినప్పటికీ బాబు వక్ర బుద్ధిని గమనించిన ప్రజలు 2019 ఎన్నికల్లో ఓటు హక్కుతో తగిన బుద్ధి చెప్పి కేవలం 23 సీట్లకే పరిమితం చేశారన్నారు. ఆంధ్రజ్యోతి రాసిన కల్పిత కథకు వత్తాసు ఇవ్వడం కోసం చంద్రబాబు ఫోన్‌ ట్యాపింగ్‌ అంటూ లేఖ రాయడం, అందులో మోదీని పొగిడిన తీరు చూసి బీజేపీ నాయకులే విస్తు పోతున్నారన్నారు. ఆధారాలు లేకుండా ఎవరి ఫోన్లు ట్యాపింగ్‌ జరిగాయో తెలియకుండా బాబు ఉత్తరాలు రాయడం తీరు చూస్తే బట్టకాల్చి మీద వేయడం వంటిదేనని శ్రీదేవి చెప్పారు.    

మరిన్ని వార్తలు