వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రుహుల్లా నామినేషన్‌ దాఖలు

11 Mar, 2022 04:16 IST|Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎండీ రుహుల్లా గురువారం శాసనసభ ఉప కార్యదర్శి కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేశారు. రిటర్నింగ్‌ అధికారి పి.వి.సుబ్బారెడ్డికి నామినేషన్‌ పత్రాలను అందజేశారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మహ్మద్‌ కరీమున్నిసా హఠాన్మరణంతో ఖాళీ అయిన స్థానానికి శాసనసభ్యుల కోటాలో ఆ ఎన్నిక జరగనుంది. నామినేషన్‌ దాఖలు చేసిన సందర్భంగా ఎండీ రుహుల్లా మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ఆశయాల మేరకు పనిచేసేవారికి పదవులు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయని తెలిపారు.

కష్టపడి పనిచేసే కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీలో తగిన గౌరవం, గుర్తింపు ఉంటాయని చెప్పారు. తనపై నమ్మకంతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్సీ టికెట్‌ ఇచ్చారన్నారు. సీఎం నమ్మకాన్ని వమ్ము చేయనని, కార్యకర్తలకు అందుబాటులో ఉండి పార్టీ చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేస్తానని చెప్పారు. మైనార్టీలు జీవితాంతం సీఎంకు రుణపడి ఉంటారన్నారు. రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మైనార్టీలకు పెద్దపీట వేశారని, దాన్లో భాగంగానే ఎమ్మెల్సీగా అందుకే రుహుల్లాకు అవకాశం కల్పించారని చెప్పారు.

సీఎం జగన్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు. రెండు పేజీలతో ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినట్లు గుర్తుచేశారు. నవరత్నాల అమలుకు హామీ ఇచ్చామన్నారు. వీటన్నింటిని తూ.చ. తప్పకుండా సీఎం జగన్‌ అమలు చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, ఏపీ ఫైబర్‌నెట్‌ చైర్మన్‌ పూనూరు గౌతమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు