వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సునీత

12 Jan, 2021 03:59 IST|Sakshi
సీఎం జగన్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేస్తున్న పోతుల సునీత

సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపిన మాజీ ఎమ్మెల్సీ.. నామినేషన్‌ దాఖలు 

సాక్షి, అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో ఖాళీ అయిన స్థానానికి అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీతను అభ్యర్థిగా సీఎం జగన్‌ ప్రకటించారు. ఆయన చేతుల మీదుగా సునీత బీ ఫారం అందుకున్నారు. తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు సోమవారం తాడేపల్లిలోని సీఎం నివాసంలో వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె వెంట మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పోతుల సురేష్‌ ఉన్నారు. ఆ తర్వాత వెలగపూడిలోని అసెంబ్లీ ప్రాంగణంలో శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి పీవీ సుబ్బారెడ్డికి సునీత తన నామినేషన్‌ పత్రాలు అందజేశారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు బీసీలను వాడుకుని వదిలేసేవారని, సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీలను ఆదరిస్తున్నారని చెప్పారు. జగన్‌ పాలన స్వర్ణయుగమన్నారు. అన్ని వర్గాల ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చూడాలనే లక్ష్యంతో పనిచేస్తున్న జగన్‌ దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారన్నారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు కుళ్లు, కుతంత్రాలు, కుట్రలతో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుని తన బుద్ధిని చూపిస్తున్నారని విమర్శించారు. దేవుడినీ వదలకుండా రాజకీయానికి వాడుకుంటున్నారన్నారు. గతంలో టీడీపీ ఎమ్మెల్సీగా కొనసాగిన సునీత.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీరును నిరసిస్తూ రాజీనామా చేయడం తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు