జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన తగదు

9 Aug, 2022 04:24 IST|Sakshi

రాజ్యసభలో కేంద్రానికి వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ, అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజనను కేవలం జనాభా ప్రాతి పదికన చేయడం వలన ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, కేరళ తీవ్రంగా నష్టపోతాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. ఆయన సోమవారం రాజ్యసభలో ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఈ అంశాన్ని లేవనెత్తారు. జనాభాయేతర అంశా లైన ఆ రాష్ట్ర భూభాగం, అడవులు, జీవావరణం, ఆర్థిక అంతరాలు, జనాభా నియంత్రణ వంటి వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పునర్విభజన కమి షన్‌ ఏర్పాటు చేసేందుకు ఎప్పుడు చట్టం చేసినా అందులో పైన తెలిపిన జనాభాయేతర అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం తప్పనిసరి చేయాలని కోరారు.

కొత్త పార్లమెంట్‌ భవనం చైతన్యవంతమైన భారత ఆధునిక ప్రజాస్వామ్యానికి చిహ్నం అవుతుందన్నారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 888 సీట్లతో కొత్త పార్లమెంట్‌ ఏర్పాటు కాబోతుం దన్న విషయం సంతోషించదగ్గదేనని, అయిన ప్పటికీ నియోజకవర్గాల పెంపు కేవలం జనా భా ప్రాతిపదికన మాత్రమే జరుగుతుందా అ న్న అంశం ఆందోళన కలిగిస్తుందని చెప్పారు. ప్రస్తుతం నియోజకవర్గాల పునర్విభజన 2001 జనాభా లెక్కల ఆధారంగా జరిగినప్పటికీ దేశంలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవ ర్గాల సంఖ్య మాత్రం మారలేదని తెలిపారు.

1971 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర జనాభా ఉత్తరప్రదేశ్‌ జనాభాలో 49.2 శాతమని, 2011 జనాభా లెక్కల ప్రకా రం ఉత్తరప్రదేశ్‌ జనాభాతో పోల్చుకుంటే 6.8 శాతం తగ్గి 42.4 శాతానికి చేరిందన్నారు. కొన్ని అంచనాల ప్రకారం ప్రస్తుతం ఉమ్మడి ఏపీ జనాభా ఉత్తరప్రదేశ్‌ జనాభాలో కేవలం 39.6 శాతం మాత్రమేనని చెప్పారు.

లోక్‌సభ నియోజకవర్గాల పెంపు కేవలం జనాభా ప్రాతి పదికన మాత్రమే జరిగితే ఉత్తరప్రదేశ్‌లో లోక్‌ సభ స్థానాల సంఖ్య 50 శాతం పెరిగి 120కి చేరుకుంటుందని, అదే సమయంలో ఆంధ్ర ప్రదేశ్‌ కేవలం 20 శాతం పెంపుతో 30 సీట్లకు పరిమితమవుతుందని పేర్కొన్నారు. కాబట్టి డీలిమిటేషన్‌ కమిషన్‌ కోసం ఎప్పుడు చట్టం చేసినా జనాభాయేతర అంశాలను కూడా ప్రాతిపదికగా తీసుకుని నియోజకవర్గాల పున ర్విభజన జరిగేలా చూడాలని, తద్వారా దక్షిణా ది రాష్ట్రాలకు ఈ ప్రక్రియలో అన్యాయం జరగ కుండా నివారించవచ్చని ఆయన సూచించారు. 

రైల్వేజోన్‌ ఏర్పాటుకు సర్వం సిద్ధం
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేసినట్లు రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌ చెప్పారు. భవన నిర్మాణా నికి స్థలసేకరణ పూర్తయిందని, జోన్‌ ఏర్పాటు కు నిధులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రాజ్యసభలో సోమవారం కేంద్రీయ విశ్వవిద్యా లయాల చట్ట సవరణ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుపై అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ రైల్వే జోన్‌ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌ను ఆమో దించినట్లు చెప్పారు. అంతకుముందు బిల్లుపై విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటును వేగవంతం చేయాలని,  జోన్‌లో రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. 

స్టీల్‌ప్లాంటుకు వ్యాగన్లు కేటాయించాలి
వైజాగ్‌ స్టీల్‌ప్లాంటు డిమాండ్‌కు తగ్గట్టుగా వ్యాగన్లు అందుబాటులో లేకపోవడంతో బొగ్గు సరఫరాలో కృత్రిమ కొరత ఏర్పడుతోందని, తద్వారా ఉత్పత్తి కుంటుపడుతోందని విజయసాయిరెడ్డి చెప్పారు. సాలీనా రూ.28 వేల కోట్ల టర్నోవర్‌తో విజయవంతంగా నడుస్తున్న వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేయాలనుకోవడం సరికాదన్నారు.

రైల్వేలో 2.97 లక్షల ఉద్యోగాలు భర్తీచేయాలి
రైల్వేలో ఖాళీగా ఉన్న 2.97 లక్షల ఉద్యోగాలను యుద్ధప్రాతిపదికన భర్తీచేయాలని కోరారు. యూపీఎస్సీ మాదిరిగా రైల్వేలో కూడా ఉద్యోగాల భర్తీ నిర్ణీతకాలంలో ప్రతి సంవత్సరం జరగాలని సూచించారు. 

కుకునూరు ఉక్కు గనులపై సర్వే 
ఆంధ్రప్రదేశ్‌లోని కుకునూరు గనుల్లో ఇనుప ఖనిజం అన్వేషణ, వెలికితీతకు సంబంధించి రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (విశాఖ స్టీల్‌ప్లాంట్‌) ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థతో 2017లో ఒప్పందం చేసుకుందని కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి ఫగ్గన్‌సింగ్‌ కులస్తే చెప్పారు. ఈ ఒప్పందానికి అనుగుణంగానే కుకునూరు బ్లాక్‌లో నాణ్యమైన ఇనుప ఖనిజం లభిస్తుందో లేదో తెలుసుకునేందుకు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ సర్వే చేయిస్తోందని విజయసాయిరెడ్డి మరో ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.   

మరిన్ని వార్తలు