టీడీపీ ఎంపీలపై విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు

4 Feb, 2021 17:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నిన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన టీడీపీ ఎంపీలపై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారే వెళ్లి శాంతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ఆలయాలపై దాడులకు పాల్పడింది ఎవరన్న విషయం ఆధారాలతో బహిర్గతం కావడంతో టీడీపీ ఎంపీలు కాళ్ల బేరానికి వెళ్లారని పేర్కొన్నారు.  రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని అడ్డు పెట్టుకుని రాష్ట్రంలో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న విషయం కేంద్రం దృష్టికి వెళ్లడంతో గత్యంతరం లేక అమిత్‌ షా వద్ద సాష్టాంగ పడేందుకు ఢిల్లీకి వెళ్లారని విమర్శించారు. 

టీడీపీ ఎంపీల తీరుపై ఆయన వ్యంగ్యంగా స్పందిస్తూ.. తల్లిదండ్రులను కడతేర్చిన ఓ కసాయి కొడుకు కోర్టు బోనులో భోరున విలపిస్తూ.. 'తల్లితండ్రి లేని వాడిని', 'నన్ను శిక్షించకండి' అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. నిన్న అమిత్‌ షా వద్దకు వెళ్లిన టీడీపీ ఎంపీలు..ప్రవీణ్‌ చక్రవర్తికి సంబంధించిన పాత వీడియోను ఆయనకు చూపించి, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని, దీన్ని బట్టి దొంగలు ఎవరు, నేరం ఎవరిదనే విషయం స్పష్టమయ్యిందంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీ ఆరాచకాలపై పూర్తి సమాచారం కలిగిన అమిత్‌ షా ముందు వారి పప్పులు ఉడకలేదని, అందుకే నామమాత్రపు భేటీని ఆయన త్వరగా ముగించి సాగనంపారన్నారు.
 

మరిన్ని వార్తలు