ఉపాధి పనిదినాలను 26 కోట్లకు పెంచండి 

31 Mar, 2022 04:19 IST|Sakshi
కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇస్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, మార్గాని భరత్‌ తదితరులు

కేంద్ర గామీణాభివృద్ధి శాఖ మంత్రికి వైఎస్సార్‌సీపీ ఎంపీల విజ్ఞప్తి 

సాక్షి, న్యూఢిల్లీ: ఉపాధిహామీ పథకం (నరేగా)లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన పనిదినాలను 26 కోట్లకు పెంచాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్‌సీపీపీ నేత విజయసాయిరెడ్డి, పార్టీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డిల నేతృత్వంలో పార్టీ ఎంపీలు బుధవారం ఢిల్లీలో కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించి ఆ శాఖలో పెండింగ్‌ అంశాలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఎంపీల బృందంలో మార్గాని భరత్, పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, బెల్లాన చంద్రశేఖర్, తలారి రంగయ్య, ఆదాల ప్రభాకరరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎన్‌.రెడ్డప్ప, గోరంట్ల మాధవ్, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మద్దెల గురుమూర్తి, గొడ్డేటి మాధవి, బి.సత్యవతి, వంగా గీత, చింతా అనురాధ ఉన్నారు. ఈ సమావేశంలో మంత్రికి అపరిష్కృతంగా ఉన్న అంశాలను విజయసాయిరెడ్డి వివరించారు. విజయసాయిరెడ్డి మంత్రికి నివేదించిన అంశాలు.. 

బడ్జెట్‌లో గణనీయంగా తగ్గిన ఉపాధి నిధులు 
ఉపాధిహామీ పథకానికి కేటాయింపులు తగ్గించారు. 2020–21 బడ్జెట్‌లో రూ.1.10 లక్షల కోట్లు ఉపాధిహామీ పనులకు కేటాయిస్తే 2021–22 బడ్జెట్‌లో రూ.98 వేల కోట్లు, 2022–23 బడ్జెట్‌లో రూ.73 వేల కోట్లకు కుదించారు. ఈ మొత్తంలో పెండింగ్‌ బకాయిలు రూ.18,350 కోట్లు తీసేస్తే మిగిలింది కేవలం 54,650 కోట్ల రూపాయలే. అంటే 2021–22 బడ్జెట్‌తో పోల్చుకుంటే నరేగాకు నిధుల కేటాయింపు 50 శాతం కంటే తగ్గిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌కు 2021–22లో 23.68 కోట్ల పనిదినాలు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం 24 కోట్ల పనిదినాలను కల్పించింది.  

రూ.2,828 కోట్ల పెండింగ్‌ నిధులు విడుదల చేయండి 
ఉపాధి హామీ పథకం కింద 2021–22 ఆర్థిక సంవత్సరంలో మెటీరియల్‌ కాస్ట్, అడ్మిన్‌ కాస్ట్‌ కింద రెండో విడత విడుదల చేయాల్సిన రూ.2,888.64 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. తద్వారా రాష్ట్రంలో ఈ పథకం నిరాటంకంగా అమలు చేయడానికి సహకరించాలి.  

కాఫీ తోటల పనులు చేర్చండి 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2009–10 నుంచి గిరిజన ప్రాంతాల్లో కాఫీ తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. విశాఖపట్నం జిల్లాలోని తూర్పు కనుమల్లో కాఫీ తోటల పెంపకం వలన అక్కడి గిరిజన కుటుంబాల జీవన స్థితిగతులు మెరుగుపడుతున్నాయి. కాఫీ తోటల పెంపకంలో భాగంగా నరేగా కింద వేతనానికి సంబంధించిన గుంతల తవ్వకం, మొక్కలు నాటడం వంటి పనులు నిర్వహిస్తున్నారు. ఇందులో మెటీరియల్‌ కాంపోనెంట్‌ ఖర్చులను ఐటీడీఏ, కాఫీ బోర్డు భరిస్తున్నాయి. అయితే నరేగా పనులు కాఫీ తోటల పనులకు వర్తించవని 2020లో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. కాఫీ రైతులకు వేతనాల చెల్లింపును ఉపసంహరించడంతో అరకు కాఫీసాగు కష్టసాధ్యంగా మారింది.

ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమైన అరకు కాఫీ బ్రాండ్‌ ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. కాఫీని వాణిజ్య పంటగా మాత్రమే గుర్తించి నరేగా కింద దానిని పరిగణించడం సరికాదు. కాఫీ తోటలు విరివిగా ఉండే కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కాఫీసాగు వాణిజ్య పంటగా ఎస్టేట్‌లలో సాగవుతుంది. కానీ గిరిజన ప్రాంతమైన పాడేరు వంటి ప్రాంతాల్లో కాఫీసాగు కేవలం గిరిజనుల జీవనోపాధిగా మాత్రమే సాగవుతోంది. అందువల్ల దీన్ని ప్రత్యేక కేసుగా పరిగణించి గిరిజన ప్రాంతాల్లో కాఫీ తోటల పనులను నరేగా కింద అనుమతించాలి. 

ఉద్యాన సాగును అనుమతించాలి 
కరవు పీడిత ప్రాంతమైన రాయలసీమలో ఉద్యానపంటల సాగుకు ఉపాధి నిధులు అనుమతించాలి. కరువు పీడిత ప్రాంతాల్లో రైతుకు ఉన్న మొత్తం భూమి విస్తీర్ణంతో నిమిత్తం లేకుండా.. ఐదెకరాలు సాగుకు వీలైన భూమి ఉన్న రైతులు నరేగా కింద ఉద్యాన పంటలు సాగుచేసుకోడానికి అనుమతించాలి.  గ్రామీణ ప్రాంతాల్లో శ్మశానవాటికల చుట్టూ ప్రహరీ నిర్మాణానికి ఉపాధి నిధులు వినియోగించుకునేలా అనుమతించాలి.  

90 రోజుల పనిదినాలు కల్పించాలి 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రానున్న మూడేళ్లలో 30 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానమంత్రి అవాస్‌ యోజన–గ్రామీణ (పీఎంఏవై–జీ) కింద లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణంలో భాగంగా 90 రోజుల పనిదినాలు పొందడానికి అర్హులు. నరేగా కింద పొందే 100 రోజుల పని హామీకి అదనంగా లబ్ధిదారులకు 90 రోజులు పనిదినాలు కల్పించాలి. పీఎంఏవై–జీ కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని ధరలకు అనుగుణంగా సవరించాలి.    

26 కోట్ల పనిదినాలు అడిగితే 14 కోట్లే ఇచ్చారు  
ఉపాధి పనిదినాల కేటాయింపుపై గత ఫిబ్రవరిలో గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహించిన సమీక్షలో 26 కోట్ల పనిదినాలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తే ప్రభుత్వం కేవలం 14 కోట్ల పనిదినాలే కేటాయించారు.  ఇది గ్రామీణ ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సుమారు కోటిమంది పేదలకు నష్టం జరుగుతుంది. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్‌కు 26 కోట్ల పనిదినాలు కేటాయించాలి.  రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాలు, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిలాలకు డ్రిప్, స్ప్రింక్లర్ల సాగు వ్యవస్థను ఏర్పాటు చేయాలి.   

మరిన్ని వార్తలు