బర్త్‌డే కేక్‌లా రాష్ట్ర విభజన 

10 Feb, 2023 06:08 IST|Sakshi

ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాల్సిందే

లోక్‌సభలో గళమెత్తిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు భరత్‌రామ్, శ్రీకృష్ణదేవరాయలు 

సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ లబ్ధి కోసం బర్త్‌డే కేక్‌లా రాష్ట్రాన్ని విభజించారని లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు విమర్శించారు. అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించడమే కాకుండా తొమ్మిదో బడ్జెట్‌లోనూ రాష్ట్రంపై సవతి ప్రేమే చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం లోక్‌సభలో బడ్జెట్‌ పద్దులపై వైఎస్సార్‌సీపీ తరఫున చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌రామ్‌ మాట్లాడారు. సంఖ్యా పరంగా ఏపీ నుంచి 25 మంది ఎంపీలు మాత్రమే ఉన్నా ప్రత్యేకహోదా విషయంలో గట్టిగా గళం వినిపిస్తామని తేల్చిచెప్పారు.

విభజన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చెప్పారు. పార్లమెంటు వేదికగా నాటి ప్రధాని ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. విభజన చట్టం ప్రకారం ఏపీలో తగిన సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు. రాముడు అరణ్యవాసానికి వెళ్లినప్పుడు భరతుడు మాది­రిగా ప్రధాని మోదీ ఏపీని భుజాలకు ఎత్తుకోవాలని పేర్కొన్నారు.

ఆ సమయంలో సభాపతి స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్‌ జోక్యం చేసుకొని మీరు భరతుడే కదా అని చమత్కరించారు. తొమ్మిదేళ్లు అయినా రైల్వే జోన్‌ కూడా ఏం పూర్తికాలేదని భరత్‌ తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనా రూ.55 వేల కోట్లను ఆమోదించడం లేదని అన్నారు.

విశాఖ, విజయవాడలకు మెట్రో ప్రాజెక్టులు ఇవ్వండి
ముంబై, బెంగళూరు, హైద­రా­­బాద్, చెన్నై వంటి నగరాలతో పోటీ పడేలా విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం వంటివి తయారు కావాలని ఎంపీ భరత్‌ పేర్కొన్నారు. విశాఖపట్నం, విజయవాడలకు మెట్రో ప్రాజెక్టులు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌కు నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

హోదా ప్రకటించినా దాని ఊసే లేదు
ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ విభజన అనంతరం ఏపీకి ప్రత్యేకహోదా ప్రకటించారని కానీ ప్రస్తుతం ఆ ఊసే లేదన్నారు. 1950ల్లో తగిన సాంకేతికత లేకున్నా నాగార్జునసాగర్‌ కట్టారని.. ఆ ప్రాజెక్టుకు పట్టిన సమయం కన్నా పోలవరం ప్రాజెక్టుకు ఎక్కువ సమయం పడుతోందన్నారు.

రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించారని మండిపడ్డారు. తెలంగాణ ఇవ్వాల్సిన రూ.6,800 కోట్లు విద్యుత్‌ బకాయిల సమస్యను పరిష్కరించాలన్నారు. ఏపీలో వైద్య కళాశాలలకు కేంద్రం సహకారం అందించాలని విన్నవించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించే యోచన విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు.  

మరిన్ని వార్తలు