కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు

30 Mar, 2022 20:18 IST|Sakshi
(ఫైల్ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ: ఉపాధి హామీ పథకం (నరేగా) కింద ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు  కేటాయించిన పని దినాలను 26 కోట్లకు పెంచాలని వైఎస్సార్సీపీ ఎంపీలు బుధవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, పార్టీ లోక్‌సభా పక్ష నాయకుడు పి.వి. మిధున్‌ రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్సీపీ ఎంపీల బృందం మంత్రితో భేటీ అయింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలో పెండింగ్‌లో ఉన్న పలు అంశాల పరిష్కారం కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించింది. అపరిష్కృతంగా ఉన్న అంశాలను విజయసాయిరెడ్డి మంత్రికి స్వయంగా వివరించారు.

చదవండి: AP: కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణపై స్పందించిన మంత్రి బొత్స

బడ్జెట్‌లో గణనీయంగా తగ్గిన ఉపాధి నిధులు
ఉపాధి హామీ పథకం కోసం బడ్జెట్‌ కేటాయింపులను క్రమేపీ తగ్గించడం పట్ల శ్రీ విజయసాయి రెడ్డి తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. 2020-21 బడ్జెట్‌లో 1 లక్షా 10 వేల కోట్ల రూపాయలు ఉపాధి హామీ పనులకు కేటాయిస్తే 2021-22 బడ్జెట్‌లో అది 98 వేల కోట్లకు కుదించారు. 2022-23 బడ్జెట్‌లో ఉపాధి నిధులు 73 వేల కోట్ల రూపాయలకు కుదించారు. ఈ మొత్తంలో పెండింగ్‌ బకాయిలు 18,350 కోట్ల రూపాయలు తీసేసే మిగిలింది కేవలం 54,650 కోట్ల రూపాయలే...అంటే 2021-22 బడ్జెట్‌తో పోల్చుకుంటే నరేగాకు నిధుల కేటాయింపు 50 శాతానికి కంటే తగ్గిపోవడం శోచనీయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు 2021-22లో 23.68 కోట్ల పని దినాలు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం 24 కోట్ల పని దినాలను కల్పించినట్లు విజయసాయి రెడ్డి చెప్పారు.

26 కోట్ల పనిదినాలు అడిగితే 14 కోట్లే ఇచ్చారు..
ఉపాధి హామీ పని దినాల కేటాయింపుపై గత ఫిబ్రవరిలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమీక్షలో 26 కోట్ల పనిదినాలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తే ప్రభుత్వం కేవలం 14 కోట్ల పని దినాలే కేటాయించారని విజయసాయి రెడ్డి తెలిపారు. గత ఏడాదితో పోల్చుకుంటే 9.68 కోట్ల పని దినాలు తగ్గిపోయాయని అన్నారు. ఇది గ్రామీణ ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సుమారు ఒక కోటి మంది పేదలకు నష్టం జరుగుతుందని చెప్పారు. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్‌కు 26 కోట్ల పని దినాలు కేటాయించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.

2,828 కోట్ల పెండింగ్‌ బకాయిలు విడుదల చేయండి..
ఉపాధి హామీ పథకం కింద 2021-22 ఆర్థిక సంవత్సరంలో మెటీరియల్ కాస్ట్, అడ్మిన్ కాస్ట్ కింద రెండో విడత విడుదల చేయవలసిన 2,888.64 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేసి రాష్ట్రంలో ఈ పథకం నిరాటంకంగా అమలు చేయడానికి సహకరించాలని కోరారు.

కాఫీ తోటల పనులను నరేగా కింద చేర్చండి...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2009 -10 నుంచి గిరిజన ప్రాంతాల్లో కాఫీ తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. విశాఖపట్నం జిల్లాలోని తూర్పు కనుమల్లో కాఫీ తోటల పెంపకం వలన అక్కడి గిరిజన కుటంబాల జీవన స్థితిగతులు మెరుగుపడుతున్నాయి. కాఫీ తోటల పెంపకంలో భాగంగా నరేగా కింద వేతనానికి సంబంధించిన గుంతల తవ్వకం, మొక్కలు నాటడం వంటి పనులు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో మెటీరియల్ కాంపోనెంట్ ఖర్చులను ఐటీడీఏ, కాఫీ బోర్డు భరిస్తున్నాయి.

అయితే నరేగా పనులు కాఫీ తోటల పెంపకంలో నిమగ్నమయ్యే రైతులకు వర్తించవంటూ 2020లో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. కాఫీ రైతులకు వేతనాల చెల్లింపును ఉపసంహరించడం వలన అరకు కాఫీ సాగు కష్టసాధ్యంగా మారింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమైన అరకు కాఫీ బ్రాండ్ ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. కాఫీని ప్రభుత్వం వాణిజ్య పంటగా మాత్రమే గుర్తించి నరేగా కింద దానిని పరిగణించడానికి నిరాకరిస్తోంది.

కాఫీ తోటలు విరివిగా ఉండే కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కాఫీ సాగు వాణిజ్య పంటగా ఎస్టేట్‌లలో సాగవుతుంది. కానీ గిరిజన ప్రాంతమైన పాడేరు వంటి ప్రాంతాల్లో కాఫీ సాగు కేవలం గిరిజనుల జీవనోపాధిగా మాత్రమే సాగవుతున్నందున దీనిని ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ గిరిజన ప్రాంతాల్లో కాఫీ తోటల పనులను నరేగా కింద పరిగణించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

కరువు పీడిత ప్రాంతాల్లో ఉద్యాన సాగును అనుమతించాలి
కరవు పీడిత ప్రాంతమైన రాయలసీమ జిల్లాల్లో అధిక శాతం రైతులను వారికున్న భూముల విస్తీర్ణాన్ని బట్టి పెద్ద రైతులుగా వర్గీకరించడం జరిగింది. వాస్తవానికి నిరంతర కరవు పరిస్థితులు, నీటి కొరత ఎద్దడి కారణంగా ఆర్థికంగా వెనుకబడిన వారే. సాగు నీరు కొరత, కరువు కారణంగా వారి వ్యవసాయ భూములు నిస్సారంగా మారిపోయాయి. అందువలన కరువు పీడిత ప్రాంతాల్లో భూమి విస్తీర్ణంతో నిమిత్తం లేకుండా 5 ఎకరాలు సాగుకు వీలైన భూమి కలిగి ఉన్న రైతులు నరేగా కింద ఉద్యాన పంటలు సాగు చేసుకోడానికి అనుమతించాలని కోరుతున్నామని చెప్పారు.

శ్మశానవాటికల్లో ప్రహరీ నిర్మాణాన్ని నరేగా కింద చేర్చాలి...
గ్రామీణ ప్రాంతాల్లో విపరీతమైన విపరీతమైన నిర్లక్ష్యానికి గురవుతున్న వాటిలో శ్మశానవాటికలు. శ్మశానాలే అయినప్పటికీ ఈ ప్రదేశాలు ప్రజల మనోభావాలతో ముడిపడి ఉంటాయి. పశువులు, పందులు ఇతర జంతువులు యధేచ్ఛగా శ్మశానాల్లో సంచరిస్తున్నందు వలన అవి ఆ ప్రాంతాన్ని అపరిశుభ్రంగా, అపవిత్రంగా మారుస్తుంటాయి. శ్మశానాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలంటే ఆయా జంతువుల ప్రవేశాన్ని అరికట్టాలి. అందుకోసం వాటి చుట్టూ ప్రహరీ గోడలు నిర్మించాల్సిన తక్షణ అవసరం ఉంది. ప్రహరీ గోడల నిర్మాణం వలన శ్మశాన భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షించవచ్చు. కాబట్టి శ్మశానాల్లో  ప్రహరీ గోడ నిర్మాణాన్ని నరేగా కింద అనుమతించాలని కోరారు.

పీఎంఏవై(జీ) కింద 90 రోజులు పని దినాలు కల్పించాలి
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రానున్న మూడేళ్ళలో 30 లక్షల ఇళ్ళు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన మంత్రి అవాస్‌ యోజన (గ్రామీణ) కింద లబ్ధిదారులు తమ ఇళ్ళ నిర్మాణంలో భాగంగా 90 రోజుల పనిదినాలు పొందడానికి అర్హులు. నరేగా కింద పొందే 100 రోజుల పని హామీకి అదనంగా లబ్ధిదారులకు 90 రోజులు పని దినాలను కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు.

పీఎంఏవై (జీ) కింద కేంద్ర సాయం పెంచాలి
ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద ఒక్కో ఇంటికి కేంద్ర ఇచ్చే ఆర్థిక సహాయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. ద్రవ్యోల్బణం, ముడి సరుకుల ధరలు, రవాణా, లేబర్‌ ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో నిరుపేద లభ్దిదారులు ఇళ్ళు కట్టుకోవడం సవాలుగా మారింది. అందరికీ ఇళ్ళు అనేది నెరవేరని కలగా మారే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇంటికి ఇంతని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని పెరిగిన ధరలకు అనుగుణంగా సవరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
సీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు డ్రిప్‌, స్ప్రింక్లర్లు కేటాయించాలి.

రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు తరచుగా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటూ కరువు బారిన పడుతుంటాయి. ఈ కారణంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సాగునీటి సౌకర్యాలు లేక వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కాబట్టి ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన కింద ఈ రెండు ప్రాంతాలకు చెందిన ఏడు జిల్లాలకు  డ్రిప్‌, స్ప్రింక్లర్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌ను కేటాయించి ఆయా జిల్లాల్లో సాగు నీటిని సమర్ధవంతంగా వినియోగించేందుకు సహకరించవలసిందిగా మంత్రిని కోరారు.

గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌ను కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీల బృందంలో మార్గాని భరత్‌, పిల్లి సుభాష్‌ చంద్ర బోస్‌, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, బెల్లాన చంద్ర శేఖర్‌, తలారి రంగయ్య, ఆదాల ప్రభాకర రెడ్డి, లావు కృష్ణదేవరాయలు,  ఎన్‌.రెడ్డప్ప, గోరంట్ల మాధవ్‌, వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, మద్దెల గురుమూర్తి, గొడ్డేటి మాధవి, బి.సత్యవతి,   వంగా గీత, చింతా అనురాధ ఉన్నారు.

మరిన్ని వార్తలు