పోలవరానికి పెట్టుబడి క్లియరెన్స్‌ ఇవ్వండి

27 Jul, 2021 09:05 IST|Sakshi
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైన వైఎస్సార్‌సీపీ ఎంపీల బృందం

సాక్షి, ఢిల్లీ: పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు సవరించిన అంచనా వ్యయం మేరకు పెట్టుబడి క్లియరెన్స్‌ ఇవ్వాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ విజ్ఞప్తి చేసింది. పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత పి.వి.మిథున్‌రెడ్డి నేతృత్వంలో ఎంపీలు సోమవారం ఆర్థిక మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలు.. కేంద్ర జలశక్తిశాఖ సాంకేతిక సలహా కమిటీ ఆమోదించిన మేరకు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం చేసిన సిఫారసుల మేరకు 2017–18 ధరల సూచీకి అనుగుణంగా రూ. 55,656 కోట్ల అంచనాలకు కేంద్ర ఆర్థికశాఖ పెట్టుబడి క్లియరెన్స్‌ ఇవ్వాల్సి ఉందని నివేదించారు.

కాంపొనెంట్‌ వారీ అర్హతలంటూ ఆంక్షలు విధించకుండా చేసిన వ్యయాన్ని రీయింబర్స్‌ చేయాలని కోరారు. నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించి భూసేకరణ, పునరావాసం, పరిహారం విషయంలో చేసే వాస్తవిక వ్యయానికి అనుగుణంగా రీయింబర్స్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని 5 కోట్ల ప్రజల కలగా ఉన్న పోలవరం ప్రాజెక్టు సత్వరం సాకారమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

జాప్యం చేస్తే వ్యయం మరింత పెరిగే ప్రమాదం
ప్రాజెక్టు విషయంలో ఏమాత్రం జాప్యం జరిగినా ప్రాజెక్టు వ్యయం మరింత పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 90(1) ప్రకారం ఇది జాతీయ ప్రాజెక్టు అని, ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రాజెక్టుపై నియంత్రణను, అభివృద్ధిని కేంద్రం చేపట్టాల్సి ఉందని చెప్పారు. 2014 మే నెలలో ఈ మేరకు స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ ఏర్పాటైందని, రాష్ట్ర ప్రభుత్వంగానీ, నైపుణ్యం కలిగిన ఇతర ఏజెన్సీలుగానీ ప్రాజెక్టు అమలు చేసేందుకు ఈ ఎస్పీవీని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక్కటే ఈ ప్రాజెక్టుకు ఎగ్జిక్యూటివ్‌ ఏజెన్సీగా పనిచేస్తుందని, కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తిచేసేందుకు సంపూర్ణ బాధ్యత కలిగి ఉంటుందని స్పష్టమైందని పేర్కొన్నారు.

2010–11 ధరల సూచీని అనుసరించి పోలవరం ప్రాజెక్టుకు పెట్టుబడి క్లియరెన్స్‌ వచ్చిందని, అయితే పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సవరించిన అంచనాలు సమర్పించాలని అడిగినప్పుడు 2017–18 ధరల సూచీకి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం సమర్పించిందని గుర్తుచేశారు. ప్రాజెక్టు నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ద్వారా పునరావాస ప్యాకేజీ అమలు చేయాల్సి రావడం వల్ల అంచనా వ్యయం పెరిగిందన్నారు. ఈ చట్టం ఆమోదం పొంది ఏడేళ్లయిందని చెప్పారు. సవరించిన అంచనాల ఆమోదానికి జరుగుతున్న జాప్యం కారణంగా ప్రాజెక్టు నిర్మాణ పురోగతి నెమ్మదిస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పలుమార్లు లేఖలు రాశారని, జలశక్తి మంత్రిని, ప్రధానమంత్రిని కలిశారని గుర్తుచేశారు.

జనవరి 2021 నుంచి ఇప్పటివరకు వెచ్చించిన రూ.1,920 కోట్లను తిరిగి చెల్లించాలని కోరారని, కోవిడ్‌ నేపథ్య క్లిష్ట పరిస్థితుల్లోనూ అవి విడుదల కాలేదని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు, అయోధ్యరామిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, నందిగం సురేష్, జి.మాధవి, గోరంట్ల మాధవ్, బెల్లాన చంద్రశేఖర్, పోచ బ్రహ్మానందరెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, వంగా గీతావిశ్వనాథ్, డాక్టర్‌ బి.వి.సత్యవతి, మార్గాని భరత్‌రామ్, ఎం.గురుమూర్తి, తలారి రంగయ్య, ఎన్‌.రెడ్డప్ప పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు