YSRCP Plenary 2022: తుది దశకు వైఎస్సార్‌సీపీ ప్లీనరీ ఏర్పాట్లు

7 Jul, 2022 03:20 IST|Sakshi
గుంటూరు జిల్లాలోని ఏఎన్‌యూ ఎదురుగా సిద్ధం చేసిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీ ప్రాంగణంలోని ఓ భాగం

రేపే ప్లీనరీ 

ఆచార్య నాగార్జున వర్సిటీ ఎదుట సువిశాల మైదానంలో నిర్వహణ

ఏర్పాట్లు పరిశీలించిన వైఎస్సార్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, మంత్రులు

ప్లీనరీ ఏర్పాట్ల కోసం 20 కమిటీలను నియమించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

గ్రామ వార్డు సభ్యుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకూ పేరు పేరునా ఆహ్వానిస్తూ సీఎం లేఖలు 

వాటిని ఫ్రేమ్‌లు కట్టించుకుని మురిసిపోతున్న కార్యకర్తలు, నేతలు

తొలి రోజు ప్రతినిధుల సభ.. రెండో రోజు విస్తృత స్థాయి సమావేశం

హామీల అమలు, నవరత్నాలు, మహిళా సాధికారత, వివిధ రంగాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులపై చర్చ 

వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడంపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్‌సీపీ నిర్వహించనున్న ప్లీనరీకి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప్లీనరీ కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2017 జూలై 8, 9న రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే.. విజయవాడ–గుంటూరు ప్రధాన రహదారికి సమీపంలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సువిశాల మైదానాన్ని ప్లీనరీ నిర్వహణ కోసం అందంగా ముస్తాబు చేస్తోంది.

ప్లీనరీకి ప్రతినిధులను ఆహ్వానించడం దగ్గర నుంచి ఏర్పాట్ల వరకు అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించడానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్‌ జగన్‌  20 కమిటీలు ఏర్పాటు చేశారు. ప్లీనరీకి హాజరయ్యే ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ఆ 20 కమిటీలు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. బుధవారం ప్లీనరీ ఏర్పాట్లను వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, హోం మంత్రి తానేటి వనతి, గృహ నిర్మాణ, దేవాదాయ శాఖ మంత్రులు జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ తదితరులు పరిశీలించారు. గుంటూరు రేంజ్‌ ఐటీ త్రివిక్రమ వర్మతో కలిసి బందోబస్తును, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా చేపట్టాల్సిన చర్యలను సమీక్షించారు. 

ప్రతి ఊరికీ ప్రాతినిధ్యం 
ప్రతి ఊరికీ ప్లీనరీలో ప్రాతినిధ్యం కల్పిస్తూ శ్రేణులకు వైఎస్సార్‌సీపీ ఆహ్వానాలు పంపింది. గ్రామ, వార్డు సభ్యుడి నుంచి ప్రజా ప్రతినిధుల వరకూ ప్లీనరీకి ఆహ్వానిస్తూ పేరు పేరునా సీఎం వైఎస్‌ జగన్‌ లేఖలు రాశారు. తమను ప్లీనరీకి ఆహ్వానిస్తూ సాక్షాత్తూ సీఎం వైఎస్‌ జగన్‌ రాసిన లేఖను పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఫ్రేమ్‌ కట్టించుకుని మురిసిపోతున్నారు.

రాష్ట్రం నలుమూలల నుంచి విస్తృతంగా శ్రేణులు హాజరు కానున్న నేపథ్యంలో సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ – గుంటూరు ప్రధాన రహదారిపై నుంచి చూసినా స్పష్టంగా కన్పించేలా వంద అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు, 6.5 మీటర్ల ఎత్తుతో అత్యంత భారీ వేదిక నిర్మాణాన్ని పూర్తి చేశారు. భారీ వర్షం కురిసినా ఏ ఒక్కరూ తడవకుండా భారీ టెంట్‌ నిర్మించారు. టిఫిన్‌లు, భోజనాల తయారీ కోసం భారీ ఎత్తున వంట శాలల ఏర్పాట్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఒక్కసారి ఎనిమిది వేల మందికిపైగా టిఫిన్‌లు, భోజనాలు చేయడానికి వీలుగా భారీ టెంట్‌ను నిర్మించారు. 

► దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఇడుపులపాయలో సమాధి వద్ద మహానేతకు సీఎం వైఎస్‌ జగన్‌ నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత ప్లీనరీ ప్రాంగణానికి చేరుకోనున్నారు. తొలి రోజున ప్రతినిధులతో సభను నిర్వహించనున్నారు. రెండో రోజున విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. 
► ప్రతి ఐదేళ్లకు ఓ సారి ప్లీనరీ నిర్వహిస్తోంది. పార్టీ ఆవిర్భాంచాక తొలి సారిగా 2011 జూలై 8–9న ఇడుపులపాయలో ప్లీనరీ నిర్వహించింది. 2017 జూలై 8–9న నిర్వహించిన ప్లీనరీలో నవరత్నాలు ప్రకటించి ప్రజలకు ప్రతిపక్షనేతగా వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. అదే వేదికపై నుంచి చరిత్రాత్మక ప్రజా సంకల్ప పాదయాత్రను ప్రకటించారు.
► ప్లీనరీ వేదికగా ఇచ్చిన భరోసాకు ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్‌ జగన్‌కు ప్రజలు నీరాజనాలు పలికారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఘన విజయాన్ని అందించారు. అధికారంలోకి వచ్చాక ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీలను సీఎం వైఎస్‌ జగన్‌ పూర్తి స్థాయిలో అమలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95 శాతం అమలు చేశారు. మూడేళ్లలో ఏ దశలోనూ ఏ ఒక్క పథకాన్ని ఆపలేదు. తద్వారా వరుస ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీకి ఘన విజయాలు కట్టబెట్టారు.  

ప్రజల జీవన ప్రమాణాల్లో పెను మార్పులు 
► రెండో ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలను అమలు చేయడం వల్ల ఈ మూడేళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడటాన్ని మదింపు చేసి.. ప్లీనరీలో వివరించనున్నారు. 
► విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో తెచ్చిన విప్లవాత్మక మార్పులు, పారిశ్రామికాభివృద్ధి–ఉపాధి కల్పనకు చేపట్టిన చర్యలు, సామాజిక న్యాయం–సాధికారత, మహిళా సాధికారత–భద్రతలో దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసేలా తీసుకున్న చర్యలు, నవరత్నాలు–డీబీటీ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచిన తీరుపై చర్చించనున్నారు.
► ప్రజలు మెచ్చేలా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన అందిస్తున్న ప్రభుత్వంపై చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లతో కూడిన దుష్టచతుష్టయం చేస్తున్న దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టాలని శ్రేణులకు సీఎం వైఎస్‌ జగన్‌ పిలుపునివ్వనున్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన చర్యలను శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.  

మరిన్ని వార్తలు