YSRCP Plenary 2022: వన్స్‌మోర్‌ జగనన్న 

9 Jul, 2022 03:16 IST|Sakshi

2024 ఎన్నికల్లో రాష్ట్ర మహిళల నినాదం ఇదే  

ఉన్మాది చంద్రబాబుకు మహిళలే గుణపాఠం చెబుతారు 

టీడీపీ జంబలకిడిపంబ పార్టీలా తయారైనట్లనిపిస్తోంది 

ప్లీనరీలో ‘మహిళా సాధికారత–దిశ చట్టం’ తీర్మానంపై మంత్రి రోజా

వైఎస్సార్‌ ప్రాంగణం నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ‘వన్స్‌మోర్‌ జగనన్న’ అన్నదే 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోని మహిళల నినాదం కావాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా పిలుపునిచ్చారు. మహిళల సంక్షేమం, రక్షణ, సాధికారికతలో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటిస్థానంలో నిలిపిన సీఎం వైఎస్‌ జగన్‌ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మహిళలందరిపై ఉందన్నారు. గుంటూరు జిల్లాలోని ఏఎన్‌యూ సమీపంలో ఏర్పాటు చేసిన ‘వైఎస్సార్‌ ప్రాంగణం’లో శుక్రవారం ప్రారంభమైన వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో ‘మహిళా సాధికారత–దిశ చట్టం’ తీర్మానంపై చర్చించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించగా మంత్రి రోజా, రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి బలపరిచారు.

మంత్రి రోజా ఏమన్నారంటే.. 
తన కుమార్తె ఉన్నత విద్యను అభ్యసించిన రీతిలోనే రాష్ట్రంలోని ఆడపిల్లలు అందరూ ఉన్నత విద్యను అభ్యసించి అత్యున్నత స్థానాలకు చేరాలన్నదే సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యం. మహిళలకు సంక్షేమ పథకాలు, రక్షణ, సాధికారత, రాజకీయంగా ఉన్నతస్థానాలు అందించడంలో  దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉంది. అందుకే.. అమ్మ జన్మనిస్తుంటే జగనన్న జీవితం ఇస్తున్నారని మహిళలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. మహిళల రక్షణ కోసం తీసుకువచ్చిన దిశ బిల్లు దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. కేంద్రం ఇంకా పెండింగ్‌ లో ఉంచినప్పటికీ దిశ చట్టం స్ఫూర్తిని పోలీసు శాఖలో తీసుకువచ్చి సీఎం మహిళల భద్రతకు భరోసానిస్తున్నారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు మహిళల పట్ల ఓ ఉన్మాదిలా వ్యవహరించారు. వనజాక్షిపై అప్పటి టీడీపీ ఎమ్మెల్యే దాడిచేస్తే చంద్రబాబు సెటిల్‌మెంట్‌ చేశారు. నాటి టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా విజయవాడలో ఓ తల్లీకూతళ్ల ఆస్తి కోసం వారికి నరకం చూపిస్తే కూడా చంద్రబాబు చోద్యం చూశారు. ఇక బుద్దా వెంకన్న కాల్‌మనీ రాకెట్‌తో మహిళల జీవితాలను నాశనం చేస్తుండటాన్ని ప్రశ్నిస్తే నన్ను అసెంబ్లీలోకి రానీయకుండా అరెస్టుచేసి బలవంతంగా తీసుకువెళ్లిన దుర్మార్గుడు చంద్రబాబు. సీఎం వైఎస్‌ జగన్‌ను భయపెట్టాలని టీడీపీ, జనసేన సమావేశాలు పెట్టుకుంటున్నాయి.

జగన్‌ను భయపెట్టాలంటే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ మరో జన్మ ఎత్తాలి. పవన్‌ రీల్‌ స్టార్‌ అయితే సీఎం జగన్‌ రియల్‌ స్టార్‌. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీచేయాలి. టీడీపీ మహానాడును రోజా ప్రస్తావిస్తూ.. ‘టీడీపీలో ఆడవాళ్లు తొడలు కొడుతున్నారు. మగవాళ్లు ఏడుస్తున్నారు. ఇదంతా చూస్తుంటే టీడీపీ జంబలకిడిపంబ పార్టీలా తయారైందనిపిస్తోంది’ అని ఎద్దేవా చేశారు.  

‘మహిళా సాధికారత–దిశ చట్టం’ తీర్మానం హైలైట్స్‌..
తన కుమార్తెలాగే రాష్ట్రంలోని ఆడపిల్లలు అందరూ ఉన్నత విద్యను అభ్యసించి అత్యున్నత స్థానాలకు చేరాలన్నదే సీఎం జగన్‌ లక్ష్యం..
అమ్మ జన్మనిస్తుంటే జగనన్న జీవితం ఇస్తున్నారు..
మహిళల భద్రతకు దేశానికే స్ఫూర్తిదాయకంగా ‘దిశ’ బిల్లు 
మహిళల ఓట్లే జగనన్నకు రాఖీలుగా పంపాలి..
మహిళల పట్ల చంద్రబాబు ఉన్మాదిలా వ్యవహరించారు..
అంబేడ్కర్, జ్యోతిబాపూలే ఆశయాలను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నెరవేరుస్తున్నారు.. 
చంద్రబాబుది సంక్షామ సర్కారు అయితే.. ఇప్పుడున్నది సంక్షేమ ప్రభుత్వం.. 
జగన్‌ను భయపెట్టేందుకు టీడీపీ, జనసేనలు ఎక్కడెక్కడో సమావేశమవుతున్నాయి..
టీడీపీలో ఆడవాళ్లు తొడలు కొడుతున్నారు.. మగవాళ్లు ఏడుస్తున్నారు. 

ప్రతిపక్షాల కుట్రలకు బెదిరేదే లేదు 
మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చి వారి అభ్యున్నతికి సీఎం వైఎస్‌ 
జగన్‌ కృషిచేస్తున్నారు. బాబు హయాంలో సం‘క్షామ’ ప్రభుత్వం ఉండగా ప్రస్తుతం సంక్షేమ ప్రభుత్వం ఏర్పడింది. జగన్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు మూకుమ్మడిగా ఎన్ని కుట్రలకు పాల్పడినా బెదిరేదేలేదు.  ఏపీ 2019 తరువాత జగన్‌ అడ్డాగా మారింది. 
– జక్కంపూడి విజయలక్ష్మి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు 

ఏపీలోనే అత్యధికంగా మహిళలు కీలక స్థానాల్లో.. 
టీడీపీ హయాంలో పండుగకు కొత్త బట్టలు కొనుక్కోలేని దుస్థితి నుంచి ఇప్పుడు బంగారం కొనుక్కొని పండుగ చేసుకునే స్థాయిని మహిళలకు కల్పించిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కుతుంది. వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత, జగనన్న అమ్మఒడి, అందరికీ ఇళ్లు వంటి పథకాలతో మహిళల సంక్షేమం, విద్య, సాధికారతకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు తీసుకుంటోంది. మహిళలు కీలక స్థానాల్లో ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. తెలంగాణలో 28 శాతం మంది, రాజస్థాన్‌లో 24.7శాతం మంది, కేరళలో 25.9 శాతం మంది ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా 51.6 శాతం మంది ఉన్నారు. అలాగే, నామినేటెడ్‌ పోస్టులు, నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించిన సీఎం జగన్‌ ఆచరణలో అంతకంటే ఎక్కువగా ఇస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మహిళలు అందరూ తమ ఓట్లనే జగనన్నకు రాఖీలుగా పంపాలి. 
– ఉషశ్రీ చరణ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి  

రాజకీయ సంస్కర్త సీఎం జగన్‌ 
రాష్ట్రంలో చెదలుపట్టి, పురుగులు పట్టిన రాజకీయాన్ని ప్రక్షాళన చేస్తున్న సంస్కర్త సీఎం వైఎస్‌ 
జగన్‌. అసమానలతో కూడిన వ్యవస్థలను సరిచేసి సమసమాజ స్థాపనకు తఆయన కృషిచేస్తున్నారు. మహిళా సాధికారత కోసం మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌ ప్రవచించిన ఆశయాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆచరణలోకి తీసుకొచ్చింది. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను మరోసారి అధికారంలోకి మహిళలే తీసుకొస్తారు. 
– నందమూరి లక్ష్మీ పార్వతి, రాష్ట్ర తెలుగు–సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్‌ 

సామాజిక న్యాయ సాధనే సీఎం వైఎస్‌ జగన్‌ ధ్యేయం 
సామాజిక న్యాయ సాధనే ధ్యేయంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంబేడ్కర్, జ్యోతిబాపూలే ఆశయాలను నెరవేరుస్తున్నారు. మహిళలు ఎలాంటి పోరాటాలు చేయాల్సిన అవసరంలేకుండానే జగన్‌ బడుగు, బలహీన వర్గాలకు 55 శాతం రాజ్యాధికారం కల్పించారు. అంతటి ఉన్నత భావాలున్న ఆయన దేశంలో అతిగొప్ప సామ్యవాది. 
– పోతుల సునీత, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ 

మరిన్ని వార్తలు