YS Vijayamma Quits YSRCP: జగన్‌ను మీ చేతుల్లో పెడుతున్నా..ఇక షర్మిలకు అండగా

9 Jul, 2022 02:43 IST|Sakshi

తెలంగాణలో ఒంటరి పోరాటం చేస్తున్న షర్మిలకు తోడుగా ఉండమని నా మనసు చెబుతోంది

జగన్‌ మంచి సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు

ఇద్దరూ వైఎస్సార్‌ భావాలను పుణికి పుచ్చుకున్నారు

వివాదాలకు దూరంగా ఉండేందుకే వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలిగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నా

ప్రజాహితం కోసం దేవుడే జరిపిస్తున్నాడని నమ్ముతున్నా

ప్లీనరీలో వైఎస్‌ విజయమ్మ భావోద్వేగపూరిత ప్రసంగం 

వైఎస్సార్‌ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: ‘‘వైఎస్‌ రాజశేఖరరెడ్డి వారసులుగా జగన్, షర్మిల.. ఇద్దరూ ఆయన భావాలను పుణికి పుచ్చుకున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు నా కుమారుడికి తోడుగా ఉన్నా. ఇక్కడ సంతోషంగా ఉన్న సమయంలో తెలంగాణలో వైఎస్సార్‌ ఆశయ సాధన కోసం షర్మిల పోరాడుతోంది. ఇప్పడు ఆమెకు తోడుగా ఉండమని నా మనస్సాక్షి చెబుతోంది. రెండు రాష్ట్రాల్లో రాజకీయ వివాదాలకు తావులేకుండా వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలిగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నా’’ అని ప్లీనరీ వేదికగా వైఎస్‌ విజయమ్మ ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ ప్లీనరీ తొలిరోజైన శుక్రవారం ఆమె ఉద్వేగభరితంగా మాట్లాడారు. ప్రసంగం వివరాలు ఆమె మాటల్లోనే..

మా అనుబంధాలు గొప్పవి..
మాది చాలా అభిమానం కలిగిన కుటుంబం. మా అనుబంధాలు, సంస్కారాలు గొప్పవే. తన అన్నకు ఇక్కడ ఏ ఇబ్బందీ కలుగకుండా ఉండాలనే తెలంగాణ కోడలిగా షర్మిల అక్కడ వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసుకుంది. వాళ్ల నాన్న ఆశయాలను నెరవేర్చాలని, వాళ్ల నాన్న ప్రేమించిన ప్రజలకు నిజాయితీగా సేవ చేయాలని, తన జన్మకు సార్థకత ఉండాలని గట్టిగా పోరాడుతోంది. రాజశేఖరరెడ్డి భార్యగా, ఓ తల్లిగా ఆ బిడ్డకు అండగా ఉండాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇక్కడ జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌ సీపీకి, అక్కడ షర్మిల వైఎస్సార్‌టీపీకి ఒకే  సమయంలో మద్దతు పలకడంపై రెండు పార్టీల్లో సభ్యత్వం ఉండవచ్చా? అన్న దానిపై చాలా ఆత్రుతగా, ఏదో జరిగిపోతోందన్నట్లుగా, ఉన్నవీ లేనివీ కల్పించి ఎల్లో మీడియాలో గొప్పగా రాశారు.

రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం
ఓ తల్లిగా ఇద్దరి భవిష్యత్తూ బాగుండాలని కోరుకున్నా. ఇంత వరకు జరిగింది ఒక ఎత్తు.. ఇకపై జరగబోయేది ఒక ఎత్తు. రాజకీయ ఎన్నికల యుద్ధం రాబోతోంది. తెలంగాణలో ముందుగా ఎన్నికలు వస్తాయి. అక్కడ షర్మిల ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆమె తెలంగాణ ప్రయోజనాలపై మాట్లాడుతోంది. ఇక్కడ జగన్‌ ఏపీ ప్రజల కోసం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో సీఎంగా జగన్‌కు ఒక స్టాండ్‌ ఉంటుంది. అదే సమయంలో ఇద్దరికీ వేర్వేరు విధానాలు తప్పవు. ఇద్దరూ వేర్వేరు రాష్ట్రాల ప్రతినిధులుగా ఉండే పరిస్థితులు వస్తాయని ఊహించలేదు. ఇది ప్రజాహితం కోసం దేవుడు జరిపిస్తున్నాడని నమ్ముతున్నా.

రెండోసారి తిరుగులేని మెజార్టీతో..
రెండు రాష్ట్రాల మధ్య ప్రయోజనాల విషయంలో కొన్ని అంశాల్లోనైనా వక్రీకరణలకు, బురదజల్లే రాజకీయాలకు తావివ్వకుండా ఉండాలంటే పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవిలో కొనసాగడం మంచిది కాదని నిర్ణయించుకున్నా. నా రాజకీయ జీవితంలో మీరంతా భాగమయ్యారు. నేను ఏదైనా జవాబు చెప్పాల్సి వస్తే మీకు (ప్రజలకు) మాత్రమే చెప్పాలి. అందుకే ఉన్నది ఉన్నట్లు చెప్పాలని నిర్ణయించుకున్నా. జగన్‌ తనను తాను నిరూపించుకుంటూ మంచి సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మీ అందరి దయతో, తిరుగులేని మెజార్టీతో రెండోసారీ సీఎం అవుతారనే నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. ఈ పరిస్థితుల్లో నేను రెండు రాష్ట్రాల్లో తల్లిగా ఇద్దరికీ అండగా ఉన్నా.. ఇద్దరిపై విమర్శలు చేసే వారు ఉంటారు. ఎక్కడికి వెళ్లినా తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను రాజశేఖరరెడ్డి భార్యగా ఆదరిస్తారు. 

దిగజారుడుతనం తగదు..
నేను రాయని లేఖతో, చేయని సంతకంతో సోషల్‌ మీడియాలో నా రాజీనామా పేరుతో జగన్‌కు వ్యతిరేకంగా లేఖ విడుదల చేశారు. ఇటువంటి వాటిల్లో వారి దిగజారుడుతనం కనిపిస్తోంది. పిచ్చిరాతలు, జుగుప్సాకర రాతలతో కుట్రలు బయపడుతున్నాయి. ఇటువంటి నాయకులకు, ఇలాంటి రాతలు రాసేవారికి ఎవరి కుటుంబంపైనా గౌరవం ఉండనిపిస్తుంది. దుష్ప్రచారాలు, వెన్నుపోట్లు.. రాజకీయం కాదు. రాజశేఖరరెడ్డి మాదిరిగా ప్రజలకు చివరి నిమిషం వరకు సేవ చేసి చనిపోయే నాయకులు కావాలి. నాకు రాజశేఖరరెడ్డి లేని లోటు తీరనిది. తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో జగన్, తెలంగాణలో షర్మిలమ్మ వైఎస్సార్‌ లేని లోటును తీరుస్తారు. మీరు బలం అయితే వారే మీకు బలం, అండ అవుతారు. వేరే రాష్ట్రంలో రాజకీయంగా షర్మిలకు అండగా ఉన్నా.. తల్లిగా జగన్‌కు, రాష్ట్ర ప్రజలకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటా.

మాట కోసం పుట్టిన పార్టీ
రాజకీయ పార్టీలు అధికారం కోసం పుడితే..  వైఎస్సార్‌ సీపీ మాత్రం నల్లకాలువలో జగన్‌ ఇచ్చిన మాట నుంచి పురుడు పోసుకుంది. దేశంలోని శక్తివంతమైన వ్యవస్థలన్నీ కలసి దాడి చేసినా.. తాను చేసేది న్యాయం, ధర్మం, మంచి అని నమ్మిన జగన్‌ ఎన్ని కష్టాలు వచ్చినా లెక్కచేయకుండా ప్రజల కోసం నిలబడ్డాడు. అప్పుడు నా బిడ్డ జగన్‌ను మీ చేతుల్లో పెట్టా. మిమ్మల్ని నడిపించమంటే.. వెన్నంటే ఉండి ముఖ్యమంత్రిని చేశారు. మళ్లీ మీకే అప్పగిస్తున్నా.. మీరే అతనికి బలం కావాలి. మీ బిడ్డల భవిష్యత్తును  ఉజ్వలంగా తీర్చిదిద్దుతాడని మాటిస్తున్నా. కాంగ్రెస్‌ పార్టీ పొమ్మనక పొగపెడితే 2011లో మానవత్వపు విలువలతో వైఎస్సార్‌సీపీ పురుడు పోసుకుంది. అరెస్టులతో భయపెట్టినా.. కష్టాల బాట ముందు ఉందని తెలిసినా వెరవకుండా నిలబడింది. జగన్‌ మీద అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేశారు.

ప్రతిపక్షాలకు ఇదే నా సమాధానం..
ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా తనను గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలనే వ్యక్తిత్వంతో జగన్‌ పని చేస్తున్నాడు. అందుకే ఏడాదిన్నరలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 95 శాతం అమలు చేసిన ఏకైక పార్టీ వైఎస్సార్‌ సీపీ అని గర్వంగా చెబుతున్నా. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.1.60 లక్షల కోట్లను డీబీటీ విధానంలో లంచాలు లేకుండా నేరుగా ప్రజలకు అందించాం. అభివృద్ధి ఎక్కడ జరుగుతుందని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలకు ఇదే నా సమాధానం. సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే నిజమైన అభివృద్ధి. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఎవరికీ ఏ ఒక్క పథకం కూడా గుర్తు రాదు.  

నాన్న బాటలోనే నడుస్తా...!
‘‘జగన్‌ అప్పుడు చాలా చిన్నవాడు. పదో తరగతి చదువుతున్నాడు. వైఎస్సార్‌ ఎక్కువగా ప్రజలతోనే ఉండేవారు. మాతో వారానికి ఒక్క పూటైనా గడిపిన సందర్భాలు చాలా తక్కువ. ఆ సమయంలో జగన్‌తో.. నాన్నా నీకు రాజకీయాలు వద్దు. నాలుగు పరిశ్రమలు పెట్టుకుని దర్జాగా కాలిపై కాలేసుకుని పది మందికి పని కల్పించే జీవితాన్ని ఎంచుకోమన్నా. కానీ 15 ఏళ్లు కూడా లేని జగన్‌.. అటువంటి జీవితం నాకొద్దమ్మ.  నాన్న ఏ విధంగా నడుస్తున్నారో ఆ జీవితాన్నే నేను కోరుకుంటా అని చెప్పాడు. ఈ రోజు ప్రజలందరి ప్రేమ, అభిమానాన్ని సంపాదించిన నా బిడ్డ జగన్‌ను చూసి చాలా గర్వపడుతున్నా. మనసుతో చేసే ప్రజా పరిపాలనను కళ్లారా చూస్తున్నా’’
–వైఎస్‌ విజయమ్మ

చదవండి: ఉద్దండ నాయకులకే గొంతు ఎండిపోయేలా చేశారు: వైఎస్‌ విజయమ్మ

మరిన్ని వార్తలు