కుప్పంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేద్దాం

29 Jun, 2022 18:16 IST|Sakshi
మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు భరత్, వేదికపై ఎంపీ రెడ్డెప్ప. ప్రజాప్రతినిధులు, నేతలు

చిత్తూరు (కుప్పం): సార్వత్రిక ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గాన్ని గెలుచుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు కానుగా ఇద్దామంటూ వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని బీసీఎన్‌ కల్యాణమండపంలో నియోజకవర్గస్థాయి ప్లీనరీ సమావేశం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్, జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్సీ, ప్లీనరీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ.. మూడున్నర దశాబ్దాలుగా కుప్పం నియోజవర్గాన్ని చంద్రబాబు మోసం చేస్తున్నారని, 2024 ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. చంద్రబాబు హయాంలో నియోజకవర్గంలో కేవలం ఐదు వేల గృహాలు మంజూరు చేస్తే వైఎస్సార్‌సీపీ వచ్చిన మూడేళ్లల్లో ఏడు వేల ఇళ్లు మంజూరు చేశారని అన్నారు. రాబోయే రోజుల్లో కుప్పం ప్రజలు చంద్రబాబును తరిమికొడతారని స్పష్టం చేశారు. 

కుప్పానికి హంద్రీనీవా నీరు 
ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందని ఎంపీ రెడ్డెప్ప అన్నారు. కుప్పం ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న హంద్రీనీవా నీటిని నియోజవర్గానికి తీసుకువచ్చి బీడు భూమలను సైతం సస్యశ్యామలం చేస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రికి వస్తున్న ఆదరణ ఓర్వలేక చంద్రబాబు, ఆయన బృందాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. 

కడపను తలపిస్తున్న కుప్పం 
కుప్పంలో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తల ఉత్సాహం కడప జిల్లాను తలపిస్తున్నట్లు ఉందని, ఎమ్మెల్సీ, రమేష్‌యాదవ్‌ అన్నారు. అన్ని కులాలకు సమానంగా గుర్తింపు ఇచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రాంతాలకు న్యాయం చేసిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. దీనికి నిదర్శనం కడప జిల్లాలో మొదటి సారిగా బీసీ వర్గానికి చెందిన తనను శాసనమండలికి పంపడమే అన్నారు.  

భారీగా తరలివచ్చిన జనం 
నియోజకవర్గస్థాయి ప్లీనరీ సమావేశానికి నాలుగు మండలాల నుంచి వైఎస్సార్‌ సీపీ శ్రేణులు భారీ ఎత్తున తరలి వచ్చారు. రామకుప్పం, శాంతిపురం, గుడుపల్లె మండలాల నుంచి ద్విచక్ర వాహనాల ర్యాలీలతో సమావేశ ప్రాంతానికి ర్యాలీగా వచ్చారు. యువకులు ద్విచక్ర వాహనాలకు వైఎస్సార్‌ సీపీ జెండాలు కట్టుకుని రావడం పండుగ వాతావరణాన్ని తలపించింది. 

వైఎస్సార్‌సీపీలో చేరిక 
ప్లీనరీ సందర్భంగా రామకుప్పం మండలం, బల్ల పంచాయతీకి చెందిన టీడీపీ నాయకులు మునస్వామి, మరో 50 మంది కార్యకర్తలు వైఎస్సార్‌ సీపీలో చేరారు. నాయకులు వారికి  కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో రాష్ట్ర వన్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ వనిత, రెస్కో చైర్మన్‌ సెంథిల్, మున్సిపల్‌ చైర్మన్‌ సుధీర్, ఎంపీపీలు అశ్విని, వరలక్ష్మీ, సుబ్రహ్మణ్యం, జెడ్పీటీసీ సభ్యులు ఏడీఎస్‌ శరవణ, నితిన్‌రెడ్డి, శ్రీనివాసులు, కృష్ణమూర్తి, కన్వీనర్లు మురుగేష్, దండపాణి, బాబురెడ్డి, రామకృష్ణ, నాయకులు హఫీజ్, మునస్వామి, విద్యాసాగర్‌ పాల్గొన్నారు. 

కుప్పం గెలుపే లక్ష్యం 
కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యమని ఎమ్మెల్సీ భరత్‌ అన్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ జెండా ఎగురవేసి సీఎం జగన్‌కు కానుకగా ఇస్తామన్నారు. నియోజవర్గంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ గెలుపు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి ఖాయమన్నారు. కరోనా సమయంలో ఇంటి నుంచి బయటకు బాబు ప్రజలను మభ్యపెట్టేందుకు జిమ్మిక్కులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు సీఎం జగన్‌కు మద్దతు తెలిపారని, ఇందుకు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కుప్పంలో విజయం సాధిస్తామన్నారు. 

మరిన్ని వార్తలు