తిరుపతి ఓటర్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లేఖ

9 Apr, 2021 11:41 IST|Sakshi

ఇంటింటికీ జరిగిన మేలును గుర్తు చేసిన సీఎం..

లేఖలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కార్యక్రమాల వివరాలు 

తిరుపతి ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని అభ్యర్థన

సాక్షి, అమరావతి: ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ జరిగిన మేలును వివరిస్తూ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలోని కుటుంబాలకు స్వయంగా లేఖలు రాశారు. తన 21 నెలల పరిపాలనలో ప్రభుత్వ పథకాలు, చేపట్టిన కార్యక్రమాలను, వాటి ద్వారా ఆయా కుటుంబాలకు కలిగిన లబ్ధిని ఈ లేఖలో పొందుపరిచారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం తొలి లేఖపై వైఎస్‌ జగన్‌ సంతకం చేశారు. తిరుపతి లోక్‌సభ పరిధిలోని ప్రతి కుటుంబంలోని సోదరుడు లేదా అక్కచెల్లెమ్మలను ఉద్దేశించి నేరుగా ఆయన ఈ లేఖ రాశారు.


వైఎస్సార్‌ సున్నావడ్డీ.. వైఎస్సార్‌ ఆసరా, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ పింఛన్‌ కానుక, జగనన్న అమ్మ ఒడి, పేదలందరికీ ఇళ్లు వంటి పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు కలిగిన లబ్ధిని ఈ లేఖల్లో పేర్కొన్నారు. వైద్యం, విద్య, వ్యవసాయ రంగాలు, రైతులు, అక్కచెల్లెమ్మలు, సామాజిక న్యాయం, పారదర్శక పాలన, అభివృద్ధి పనులు, గ్రామాలు, నగరాలు తదితర అంశాలను జగన్‌ తన లేఖలో ప్రస్తావించారు. ప్రతిపక్ష పార్టీల మీద ఎలాంటి విమర్శలు చేయకుండా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను, ప్రభుత్వ దార్శనికతను, వాగ్దానాలను నిలబెట్టుకున్న విధానాన్ని ప్రజలకు తెలియజెప్పారు.

గత రాజకీయ సంస్కృతికి భిన్నంగా వైఎస్‌ జగన్‌ లేఖ సాగడం విశేషం. తిరుపతి ఉప ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓటువేసి,  వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తిని గెలిపించాలని తిరుపతి లోక్‌సభ ఓటర్లను జగన్‌ కోరారు. పార్టీ అధ్యక్షుడి సంతకంతో ఉన్న ఈ లేఖలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ప్రతి కుటుంబానికి అందజేయనున్నాయి.

మరిన్ని వార్తలు