విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు నినాదాలతో దద్దరిల్లిన ప్రాంగణం

20 Feb, 2021 18:31 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ‘ఎన్నో త్యాగాల ఫలమే విశాఖ స్టీల్‌ప్లాంట్‌. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను మేం వ్యతిరేకిస్తున్నాం’’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.  విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి సుమారు 25 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టగా.. ప్రజల నుంచి విశేషమైన మద్దతు లభించింది. అనంతరం ప్లాంట్‌ ఎదురుగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ క్రమంలోనే విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అన్న భావోద్వేగ నినాదాలతో సభా ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది.

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ‘పోస్కో ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిస్తే.. విశాఖలో తప్ప మరోచోట ఎక్కడైనా పెట్టుకోవాలని చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌ నష్టాలకు కారణం సొంత గనులు లేకపోవడమే. స్టీల్‌ప్లాంట్‌కున్న రుణభారం రూ.25వేల కోట్లు. రుణభారాన్ని ఈక్విటీలోకి మారిస్తే స్టీల్‌ప్లాంట్‌ లాభాల్లోకి వస్తుంది. ఇదే విషయాన్ని ప్రధానికి రాసిన లేఖలో సీఎం పేర్కొన్నారు. ఉత్పత్తి స్థిరీకరణ చాలా అవసరం.. ఉత్పత్తి ఆగితే నష్టాలు మరింత పెరుగుతాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉత్పత్తి ఆగకూడదు. స్టీల్‌ప్లాంట్‌లో ఉన్న పైఅధికారులు మన రాష్ట్రం వారు కాదు. వాళ్లే కేంద్రాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. చంద్రబాబుకు చిత్తుశుద్ధి ఉంటే ప్రధానిని కలవాలి. ఇప్పటివరకు చంద్రబాబు ఎందుకు ప్రధానికి లేఖ రాయలేదు. కార్మిక సంఘాలకు పూర్తి భరోసాగా ఉంటాం .. స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనుల కోసం పోరాడుతాం. ప్రైవేటీకరణ వద్దని ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేస్తాం’ అని పేర్కొన్నారు.

ఎంపీ గోరంట్ల మాధవ్‌ మాట్లాడుతూ... ‘‘విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రభుత్వరంగంలో కొనసాగేలా ఉద్యమం కొనసాగిస్తాం. కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తాం. రాయలసీమ నుంచి కూడా ఉద్యమానికి మద్దతుగా నిలుస్తాం.  స్టీల్‌ప్లాంట్‌ కోసం ఉక్కుదీక్షతో ముందుకెళ్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం కానివ్వం’’ అని పేర్కొన్నారు. 

ఇక  విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘‘స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ వద్దని పార్లమెంట్‌లో కూడా చెప్పాం. ఇప్పటికే ప్రధానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు’’ అని తెలిపారు. ‘‘విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలి. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే పెద్దఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ప్రైవేటీకరణను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించం’’ అని రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ స్పష్టం చేశారు.

పోరాటం కొనసాగిస్తాం: ఎంపీ సత్యవతి
మా అందరికీ ఎప్పటికప్పుడు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా పోరాటం ఉధృతం చేస్తాం.

కాపాడుకుని తీరతాం: గుడివాడ అమర్‌నాథ్‌
32 మంది ప్రాణాల త్యాగఫలమే విశాఖ స్టీల్‌ప్లాంట్‌. దానిని కచ్చితంగా కాపాడుకుని తీరుతాం. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తెస్తాం.

విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అనగానే మొదటిగా స్పందించిన వ్యక్తి సీఎం జగన్‌.. ఇప్పటికే ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఇప్పటికే సీఎం చెప్పారు.

చదవండి: విజయసాయిరెడ్డి పాదయాత్ర విజయవంతం

మరిన్ని వార్తలు