పేదలంతా కళ్యాణమస్తు వినియోగించుకోండి

15 Sep, 2022 06:22 IST|Sakshi

దేశానికే సీఎం వైఎస్‌ జగన్‌ ఆదర్శం

వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య 

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణమస్తు పథకాన్ని పేదలంతా వినియోగించుకోవాలని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య కోరారు. బీసీల కోసం సీఎం వైఎస్‌ జగన్‌ ఈ పథకాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఇందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం ఆర్‌.కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు.

బీసీల కోసం ఈ తరహా పథకం అమలు చేసిన ఏకైక సీఎంగా వైఎస్‌ జగన్‌ దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అలాగే బీసీల రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‌లో బిల్లు పెట్టించారని ప్రశంసించారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లుకు ఆమోదం పొందడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ముందుకు సాగుతోందన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారత చరిత్రలో ఏ ముఖ్యమంత్రి, ఏ పార్టీ సీఎం జగన్‌ లాగా నిర్ణయం తీసుకోలేదని గుర్తు చేశారు.

బీసీల పార్టీలుగా చెప్పుకుంటున్న డీఎంకే, జనతాదళ్, ఎస్పీ ఎప్పుడూ బీసీల కోసం ఇలా చేయలేదన్నారు. నామినేటె?డ్‌ పోస్టుల్లో 50 శాతం వెనుకబడిన తరగతులకు కేటాయించడం దేశంలో ఎక్కడా లేదని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మద్దతు సీఎం జగన్‌కేనన్నారు. ఈ వర్గాల ప్రజలు సీఎంను ఆరాధిస్తున్నారన్నారు. పేదల సర్వతోముఖాభివృద్ధికి, వికాసానికి సీఎం జగన్‌ ఆలోచనలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.

రాష్ట్ర బడ్జెట్‌లోనూ, అధికారంలోనూ బీసీలకు వాటా ఇచ్చిన చరిత్ర ఒక్క సీఎం జగన్‌కే దక్కిందన్నారు. వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాల్లోనే కాకుండా జిల్లా పరిషత్‌ చైర్మన్లుగా బలహీన వర్గాలకు అవకాశాలు ఇచ్చారని కొనియాడారు. 

మరిన్ని వార్తలు