మైదుకూరులో సాధికార మహోత్సవం

21 Nov, 2023 05:35 IST|Sakshi
బస్సు యాత్రలో పాల్గొన్న మంత్రి రజిని. చిత్రంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు 

సామాజిక సాధికార యాత్రకు పోటెత్తిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు

వీధివీధిలో ఘనస్వాగతం పలికిన ప్రజలు ∙బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహిని

జై జగన్‌ నినాదాలతో హోరెత్తిన సభా ప్రాంగణం

సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్‌ జిల్లా మైదుకూరులో సోమవారం జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఓ మహోత్సవంలా సాగింది. వేలాదిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు పాదయాత్రగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరికి వీధివీధిలో ప్రజలు ఘనస్వాగతం పలికారు. బాణాసంచా, డప్పు వాయిద్యాల నడుమ యాత్ర పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలికి చేరుకుంది. అక్కడ అశేష జనవాహిని మధ్య బహిరంగ సభ జరిగింది. సభలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతి­నిధులు రాష్ట్రంలో సీఎం జగన్‌ సంక్షేమ పాలనను వివరించారు. సీఎం జగన్‌ పేరు విన్న ప్రతిసారీ ప్రజలు పెద్దపెట్టున జై జగన్‌ అని నినాదాలు చేస్తూ సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు.

సామాజిక సాధికారత నినాదం కాదు మా విధానం: ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశంలో సామా­జిక సాధికారత ఓ నినాదంగానే మిగిలిపోయిందని, ఆ కలను సాకారం చేసి బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి బాటలు వేస్తున్న తొలి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజాద్‌బాషా చెప్పారు. వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికారతలను విధానంగా మార్చుకుందని అన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సీఎం వైఎస్‌ జగన్‌ అక్కున చేర్చుకొని, కేబినెట్‌ సహా అన్ని పదవుల్లో అధికభాగం ఇచ్చి, రాజకీయంగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకా­ల్లోనూ అత్యధిక భాగం ఈ వర్గాలకే ఇస్తూ ఆర్థికంగా బలం చేకూరుస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రభు­త్వం­లో ఒక్క మైనార్టీకీ మంత్రివర్గంలో స్థానం ఇవ్వ­లే­దని, సీఎం జగన్‌ మంత్రి పదవితోపాటు నలు­గురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా, మరో నలుగురికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారని తెలిపారు.

జగన్‌ సీఎం అయ్యాక రాష్ట్రంలో వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయని, నదులు, రిజర్వా­యర్లు, చెరు­వులు జలకళను సంతరించుకున్నాయని తెలిపారు. ఇటీవల జిల్లాలో చంద్రబాబు, లోకేశ్‌ అడుగు పెట్టగానే కరువు మొదలైందని ఎద్దేవా చేశారు. 

వైఎస్‌ జగన్‌కు బహుజనులు అండగా నిలవాలి: డిప్యూటీ సీఎం నారాయణస్వామి
సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో సామాజిక న్యాయం దక్కుతోందని, ఆకలితో ఉన్నవాడు రాజ్యమేలాలని ఆయన సంకల్పించారని డిప్యూటీ సీఎం నారాయ­ణస్వామి చెప్పారు. చంద్రబాబు ఎస్సీలను కించపరుస్తూ మాట్లాడితే, అదే ఎస్సీలు తలెత్తుకొని బ్రతకాలనే ఉద్దేశంతో వైఎస్‌ జగన్‌ పనిచేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే అగ్రవర్ణాల పిల్ల­ల్లానే పేదల పిల్లలూ ఉన్నత స్థితికి ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశ­పెట్టారని తెలిపారు. పేదలంతా చదువుకో­వాలని కాంక్షిస్తూ అమ్మ ఒడి పథకం తెచ్చారన్నారు.

పేదల కోసం పెత్తందారులతో పోరాడుతున్న జగన్‌ : మంత్రి విడదల రజిని
సీఎం పేదల కోసం పెత్తందారులతో పోరాడుతు­న్నారని రాష్ట్ర మంత్రి విడదల రజిని అన్నారు. రాష్ట్రానికి గొప్ప నాయకత్వాన్ని అందించిన జిల్లాగా కడపలో ప్రతి గడప గర్వపడేలా వైఎస్‌ జగన్‌ పాలన సాగుతోందన్నారు. 25 మంది మంత్రుల్లో 17 మంది ఎస్సీ ఎస్టీ బీసీ, మైనార్టీలు ఉండడం సామాజిక సాధికారతకు నిదర్శనమన్నారు. బీసీల తోలు తీస్తా, తోకలు కత్తిరిస్తా అన్న చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో ఆయన తోక కత్తిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

రణ నినాదం మోగుతోంది : ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్‌రావు 
సీఎం జగన్‌ ఏపీలో విప్లవాత్మక మార్పులు తెచ్చి, రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతు­న్నా­రని ప్రభుత్వ సలహాదారు (సాంఘిక సంక్షేమం) జూపూడి ప్రభాకర్‌రావు చెప్పారు. స్వార్థం లేకుండా పేదల తరపున సీఎం జగన్‌ యుద్ధం చేస్తున్నార­న్నారు.  పేదలకు భూములందించాలని  అంబేడ్కర్‌ సంకల్పిస్తే, సీఎం జగన్‌ ఆచరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే ఎస్‌ రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌ ప్రసంగించారు.

మరిన్ని వార్తలు