ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయ పట్టం

8 Nov, 2023 05:58 IST|Sakshi
ప్రసంగిస్తున్న ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జరిగిన బస్సు యాత్రకు హాజరైన జనసందోహంలో ఓ భాగం   

ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఈ వర్గాలకే..

మంత్రివర్గంలో దాదాపు 70 శాతం పదవులు బలహీనవర్గాలకే

ఆళ్లగడ్డ సామాజిక సాధికార యాత్రలో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా

సాక్షి, నంద్యాల: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయంగా సముచితస్థానం ఇచ్చి, సామాజిక న్యాయం కల్పించిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా అన్నారు. ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఈ వర్గాలకే ఆయన కేటాయించారని చెప్పారు. అలాగే, మంత్రివర్గంలో దాదాపు 70 శాతం పదవులు బడుగు, బలహీన వర్గాలకే కేటాయించి రాజకీయంగా ఉన్నత శిఖ­రాలు అధిరోహించేలా చేసిన ఘనత జగన్‌దేన­న్నారు.

దేశంలోనే మైనార్టీల పక్షపాత ప్రభుత్వం జగనన్నదేనన్నారు. సామాజిక సాధికార యాత్రలో భాగంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో అంజాద్‌ బాషా మాట్లాడారు. నా పాలన చూడండి, నా పథకాలు చూసి ఓటు వేయండి అని అడిగే ధైర్యం 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు లేదన్నారు. పేదలకు, పెత్తందార్లకు జరిగే మహా సంగ్రామంలో ప్రజలంతా పేదల ప్రభుత్వమైన వైఎస్సార్‌సీపీ వైపు నిలబడాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో నాలుగేళ్ల పాటు మైనార్టీలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యమే కల్పించలేదని అంజాద్‌ బాషా గుర్తుచేశారు.

బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం..
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు పాలించిన పార్టీలు బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలను ఓటు బ్యాంకుగానే చూశాయని.. కానీ, మొట్టమొదటిసారి వీరందరికీ సంపూర్ణ రాజ్యాధికారం ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కు­తుందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి కొని­యాడారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని చంద్రబాబు వ్యాఖ్యానిస్తే అదే వర్గానికి చెందిన వ్యక్తిని ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చో­బెట్టి సమున్నత స్థానం కల్పించిన ఘనత వైఎస్‌ జగన్‌కు దక్కుతుందన్నారు.

నా అక్క, చెల్లెమ్మలు నా అన్నదమ్ములు అంటూ ఎస్సీలను తన కుటుంబ సభ్యులుగా వైఎస్‌ జగన్‌ భావిస్తున్నారని చెప్పారు. నవరత్నాల ద్వారా అర్హులైన ప్రతీ పేదవారు ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందేందుకు కృషిచేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు, లోకేశ్, భువనేశ్వరి రాష్ట్రంలో ఉన్నప్పుడు వరుణ దేవుడు ఇటువైపు తొంగిచూసేందుకు కూడా భయపడ్డాడని, వారంతా హైదరాబాద్‌కు వెళ్లగానే మళ్లీ వర్షాలు పడుతున్నాయన్నారు.

బీసీల విలువ జగన్‌ పెంచుతున్నారు..
ఇక సామాజిక సాధికార యాత్రలో పాల్గొంటున్న బీసీ ప్రజాప్రతినిధులను టీడీపీ నాయకులు సున్నా­తో పోలుస్తున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే అనిల్‌­కుమార్‌ మండిపడ్డారు. టీడీపీ హయాంలో బీసీలంతా సున్నాగానే ఉండిపోయారని.. కానీ, వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక సున్నా ముందు ఒకటి అనే సంఖ్య పెట్టి బీసీల విలువ పెంచుకుంటూ వెళ్తున్నా­రని తెలిపారు. టీడీపీ నాయకులు బీసీలను నీచంగా చూస్తున్నారని.. గొర్రెలు, బర్రెలు కాసుకునే వారికి పదవులు ఇచ్చారని అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

మీరు అవమానిస్తే సీఎం జగన్‌ మమ్మల్ని గుండెల్లో పెట్టు­కుంటున్నారన్నారు. మీ తోకలు కట్‌ చేస్తానని నాయీ బ్రాహ్మణులను చంద్రబాబు అవమానిస్తే అదే వర్గానికి చెందిన వారిని పాలకమండళ్ల సభ్యు­నిగా చేసి సీఎం జగన్‌ గౌరవించారన్నారు. ఒళ్లు ఎలా ఉందని మత్స్యకారులను చంద్రబాబు బెది­రిస్తే అదేవర్గానికి చెందిన వ్యక్తిని రాజ్యసభ్యకు పంపి గౌరవించిన ఘనత జగన్‌కు దక్కుతుందని అనిల్‌ చెప్పారు. మంచికి చెడుకు మధ్య జరిగే యుద్ధంలో మనమంతా మంచి కోసం పోరాడు­తున్న జగన్‌ వైపు నిలవాలని ఆయన పిలుపుని­చ్చారు.

వచ్చే ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా ఏకమై జగన్‌ను సీఎం చేసుకోవాల­న్నారు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14కి 14 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు ఇచ్చి వైఎస్సార్‌సీపీకి అండగా నిలబడ్డారని.. 2024 ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌తో పాటు బంపర్‌ మెజార్టీలు ఇవ్వాలని అనిల్‌ అభ్యర్థించారు. విజయ­నగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ మాట్లా­డుతూ.. నవర­త్నాల ద్వారా అర్హులైన ప్రతి పేదవాడికి సీఎం జగన్‌ న్యాయం చేస్తున్నారన్నారు.

బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా చేయూతని­స్తున్న వైఎస్సార్‌సీపీకి ప్రజలంతా మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్‌ ఆకేపాటి అమరనాథ్‌­రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి, జలవనరుల శాఖ ప్రభుత్వ సలహాదారు ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. 

జోరు వానలోనూ ప్రభం‘జనం’..
ఇక మంగళవారం నంద్యాల పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో నిర్వహించిన సామా­జిక సాధికార బస్సు యాత్ర సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. కనుచూపు మేర ఎటుచూసినా ప్రజలే కనిపించారు. ఇసుకేస్తే రాలనంత జనం సభకు తరలివచ్చారు. జై జగన్‌.. జైజై జగన్‌.. జోహార్‌ వైఎస్సార్‌ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమ అభ్యున్నతికి కృషిచేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వెంటే తామంతా నిలుస్తామని నినదించారు.

మరోవైపు.. అట్టహాసంగా ప్రారంభమైన సభకు వరుణ దేవుడు స్వాగతం పలికాడు. నాయకులంతా సభా ప్రాంగణానికి ర్యాలీగా బయలుదేరే సమయంలో ఒక్కసారిగా ఉరుములు మెరు­పులతో భారీ వర్షం ప్రారంభమైంది. గంటపాటు ఏకధాటిగా వర్షం కురిసింది. అంతటి వర్షంలోనూ కార్యకర్తలు, ప్రజలు నాయ­కుల కోసం నిరీక్షించారు. సభకు మహిళలు, యువకులు, వృద్ధులు పోటెత్తారు. వర్షంవల్ల సభ ఆలస్యమైనా ఓపికతో వారంతా ఎదురుచూశారు. తొలుత యువకులు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

మరిన్ని వార్తలు