ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో వైఎస్సార్‌సీపీ ప్రత్యేకత

26 Feb, 2021 08:32 IST|Sakshi

బడుగులకే ప్రాధాన్యం..  ఇద్దరు మైనారిటీలకు చాన్స్‌..

చనిపోయిన ఎంపీ, ఎమ్మెల్సీల స్థానంలో వారి కుమారులకు అవకాశం

ఇచ్చిన మాటకు కట్టుబడిన సీఎం జగన్‌

బీసీ కోటా కింద దువ్వాడ శ్రీనివాస్‌ పేరు ఖరారు 

సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బడుగు, బలహీన వర్గాలకు వైఎస్సార్‌సీపీ ప్రాధాన్యం కల్పించింది. త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఆ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల పేర్లను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. అంతేగాక ఇచ్చిన మాటకు సీఎం వైఎస్‌ జగన్‌ కట్టుబడిన తీరు అభ్యర్థుల ఎంపికలో కనిపిస్తోంది. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మరణంతో ఆయన కుమారుడు బల్లి కళ్యాణ చక్రవర్తికి ఎస్సీ సామాజిక వర్గం కింద ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అదేరీతిలో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మరణంతో ఖాళీ అయిన స్థానంలో ఆయన కుటుంబానికే తిరిగి అవకాశమిచ్చారు.

ముందే ఇచ్చిన హామీ మేరకు రామకృష్ణారెడ్డి కుమారుడు చల్లా భగీరథరెడ్డిని సీఎం ఎంపిక చేశారు. మరోవైపు మైనారిటీ వర్గానికి ప్రాధాన్యమిచ్చారు. ఆ వర్గానికి చెందిన కరీమున్నీసా, మహ్మద్‌ ఇక్బాల్‌లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. హిందూపురం సమన్వయకర్త ఇక్బాల్‌ గత ఎన్నికల్లో ఓటమి చెందారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఆయనకు రెండోసారి అవకాశం కల్పించారు. శ్రీకాకుళం ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిన దువ్వాడ శ్రీనివాస్‌కు న్యాయం చేయాలని పార్టీ నిర్ణయించింది. బీసీ కోటా కింద ఆయనను ఖరారు చేశారు.

మహిళలకు, మైనార్టీలకు ప్రాధాన్యం.. 
వైఎస్సార్‌సీపీ తరఫున ఇదివరకు రాయచోటి నియోజక వర్గానికి చెందిన జకీయా ఖానంకు ఎమ్మెల్సీగా సీఎం వైఎస్‌ జగన్‌ అవకాశం కలి్పంచడం తెలిసిందే. తాజాగా విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 59వ డివిజన్‌కు పోటీ పడుతున్న కరీమున్నీసాను ఎంపిక చేయడంతో శాసన మండలిలో మహిళల ప్రాతినిధ్యం పెంచినట్లయింది. తద్వారా మహిళా సాధికారతకు వైఎస్సార్‌సీపీ పెద్దపీట వేసింది. అలాగే మైనారిటీ వర్గం నుంచి ఇద్దరికి తాజాగా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. మైనారిటీల పట్ల సీఎం జగన్‌కున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది.

సీనియారిటీకి గుర్తింపు.. 
పార్టీలో చేరినప్పటి నుంచి పార్టీకి సేవలందించటం, నాయకత్వం పట్ల విధేయతతో ఉండటం, పార్టీ ఆదేశాల మేరకు స్పందించటాన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సి.రామచంద్రయ్యకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. రామచంద్రయ్యకు విశేషమైన రాజకీయ అనుభవం ఉంది. రాయలసీమ బలిజ సామాజిక వర్గం నుంచి ఆయనకు అవకాశం కల్పించారు. 

ఎన్ని జన్మలెత్తినా జగన్‌ రుణం తీర్చుకోలేను: కరీమున్నీసా 
విజయవాడ నగరం 59వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా బరిలో ఉన్నాను. ఇలా సీఎం జగన్‌ నాకు ఎమ్మెల్సీగా పోటీకి అవకాశం కల్పిస్తారని ఊహించలేదు. ఎన్ని జన్మలెత్తినా సీఎం జగన్‌ రుణం తీర్చుకోలేను. వైఎస్సార్‌ కుటుంబానికి ముస్లిం మైనార్టీలన్నా, మహిళలన్నా విపరీతమైన గౌరవం. వైఎస్సార్‌సీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందేలా చేస్తాను. పార్టీ ఆశయాలకు కట్టుబడి నడుచుకుంటా.

పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా: సి.రామచంద్రయ్య 
వైఎస్సార్‌సీపీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా. శాసన మండలిలో పార్టీ వాణిని వినిపిస్తా. ఎమ్మెల్సీ స్థానానికి ఎంపిక చేయటంతో నాపై మరింత బాధ్యత పెరిగింది. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాను. సీఎం జగన్‌ నాయకత్వంపై విశ్వాసంతో ఇంతకాలం పనిచేశాను. ఎప్పటికీ అదే రీతిలో పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తాను.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల వివరాలు

సి.రామచంద్రయ్య
చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా మొదలుపెట్టి.. 
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి అయిన సి.రామచంద్రయ్య 1948, మే 27న కడపలో జన్మించారు. ఆయన కొంతకాలం చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా పనిచేశారు. అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించారు. 1985–89 మధ్యకాలంలో ఎమ్మెల్యేగా వ్యవహరించారు. 1986–88 మధ్య ప్లానింగ్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ మంత్రిగా ఉన్నారు. తర్వాత రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించారు. 1999–2004 మధ్యకాలంలో పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఆన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ ఫారెస్ట్స్‌ చైర్మన్‌గా పనిచేశారు. 2011లో ఎమ్మెల్సీగా ఉన్నారు. 2012లో దేవదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2019 ఎన్నికల ముందు వైఎస్సార్‌సీపీలో చేరారు.

చల్లా భగీరథరెడ్డి
తండ్రి బాటలో నడుస్తూ..
ఎమ్మెల్సీ అభ్యర్థి చల్లా భగీరథరెడ్డి 1976లో చల్లా రామకృష్ణారెడ్డి, శ్రీదేవి దంపతులకు జన్మించారు. హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చేసిన భగీరథరెడ్డి 2003 నుంచి 2009 వరకు కర్నూలు జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. 2007 నుంచి 2008 వరకు జాతీయ స్థాయి యువజన కాంగ్రెస్‌ సెక్రటరీగా, 2009 నుంచి 2010 వరకు ఉమ్మడి రాష్ట్రంలో యువజన కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీగా పనిచేశారు. రాజకీయంగా తండ్రి చల్లా రామకృష్ణారెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు సాగారు. 

బల్లి కళ్యాణ్‌ చక్రవర్తి
ఇంజనీరింగ్‌ చదివి..
దివంగత తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు కుమారుడైన 36 ఏళ్ల బల్లి కళ్యాణ్‌చక్రవర్తి బీఈ వరకు చదివారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని 16వ వార్డు ఆయన స్వస్థలం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ పరిశీలకుడుగా కొనసాగుతున్నారు. గత 12 ఏళ్లుగా తండ్రి బల్లి దుర్గాప్రసాద్‌రావుకు రాజకీయంగా చేదోడుగా ఉంటున్నారు. తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ తరఫున క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.

షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌
ఖాకీ వృత్తి నుంచి రాజకీయాల్లోకి.. 
షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ విశ్రాంత ఐజీ. అనంతపురం జిల్లా హిందూపురంలోని ప్రశాంత్‌నగర్‌లో నివాసముంటున్నారు. ఎంఏ వరకు చదివిన ఆయన 35 ఏళ్లపాటు పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2018లో వైఎస్సార్‌సీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బాలకృష్ణపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో మొదటిసారి ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. మార్చి 29తో ఆయన పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.

కరీమున్నీసా
కార్పొరేటర్‌గా మొదలై..
ఎండీ కరీమున్నీసా విజయవాడకు చెందిన మాజీ కార్పొరేటర్‌. భర్త ఎండీ సలీం. ఏడవ తరగతి వరకు ఆమె చదివారు. 2014లో జరిగిన విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున 54వ డివిజన్‌ కార్పొరేటర్‌గా గెలుపొందారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉండి కూడా డివిజన్‌ అభివృద్ధికి కరీమున్నీసా కృషి చేశారు. అలాగే పార్టీ బలోపేతానికీ కృషి చేశారు. ప్రస్తుతం 59వ డివిజన్‌ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆమెను ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ ఎంపిక చేసింది.

దువ్వాడ శ్రీనివాస్‌
పోరాటాలతో ప్రస్థానం..
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన దువ్వాడ శ్రీనివాస్‌ 1964లో దువ్వాడ కృష్ణమూర్తి, లీలావతి దంపతులకు జన్మించారు. కాకినాడ పీఆర్‌ కళాశాలలో ఎంఏ లిటరేచర్, బీఎల్‌ చేశారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. 2001లో శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్‌ కార్యదర్శిగా వ్యవహరించారు. 2006లో జిల్లాపరిషత్‌ వైస్‌ చైర్మన్‌గా పనిచేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో, తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున టెక్కలి ఎమ్మెల్యే పదవికి పోటీ చేశారు కానీ గెలవలేకపోయారు. అలాగే 2014లో టెక్కలి అసెంబ్లీకి, 2019లో శ్రీకాకుళం ఎంపీ పదవికి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేశారు. కానీ ఓటమి చెందారు. రాజకీయ ఆరంభం నుంచి కింజరాపు కుటుంబ ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ పోరాటం చేశారు. టెక్కలి నియోజకవర్గంలో అత్యధికంగా 112 సర్పంచ్‌ స్థానాల గెలుపునకు కృషి చేశారు. 

మరిన్ని వార్తలు