వ్యవసాయ బిల్లులకు వైఎస్సార్‌ సీపీ మద్దతు

20 Sep, 2020 11:27 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభలో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇచ్చింది. ఈ బిల్లులతో  రైతులకు స్వేచ్ఛ లభించి, దళారీ వ్యవస్థకు ముగింపు లభిస్తుందని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సభలో జరిగిన వ్యవసాయ బిల్లులపై చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. పంటలకు ముందుగానే ధర నిర్ణయం వల్ల రైతులకు ప్రయోజనం జరుగుతుందన్నారు. దళారీల ఆగడాల నుంచి రైతులకు విముక్తి కలుగుతుందని పేర్కొన్నారు. ‘‘మార్కెట్ కమిటీల నియంతృత్వానికి తెరపడుతుంది. బిల్లులో పొగాకును ఎందుకు చేర్చడం లేదు. రైతు ప్రయోజనాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్ అండగా ఉంటుంది. రైతు భరోసా పేరుతో 49 లక్షల మంది రైతులకు ఏటా 13,500 ఇస్తోంది. రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధిని సీఎం జగన్ ఏర్పాటు చేశారు. పంటలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించింది. రైతు భరోసా కేంద్రాలతో విత్తనాలు, ఎరువులు తదితర అన్ని అంశాల్లో సహాయకారిగా ఉంటుందని’’ ఆయన వివరించారు. (చదవండి: రాజ్యసభలో విశాఖ వాణి)

కాంగ్రెస్‌ వ్యవహారశైలిపై విజయసాయిరెడ్డి ఫైర్‌..
కాంగ్రెస్ మేనిఫెస్టోలో మార్కెట్ కమిటీలు రద్దు చేసి, పంటల రవాణాపై ఆంక్షలను తొలగిస్తామని చెప్పిందని.. ఆ అంశాలనే ఎన్డీయే బిల్లుగా తెచ్చిందన్నారు. ఆత్మవంచన మానుకోవాలని కాంగ్రెస్‌కు విజయసాయిరెడ్డి హితవు పలికారు.  దళారులకు కాంగ్రెస్ అండగా నిలబడుతోందని ఎంపీ విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు.
 

మరిన్ని వార్తలు