జాతి గర్వించదగ్గ వ్యక్తి.. జాషువా 

29 Sep, 2022 05:09 IST|Sakshi
మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి 

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా గుర్రం జాషువా జయంతి 

సాక్షి, అమరావతి: కుల వివక్షకు వ్యతిరేకంగా కలమే ఆయుధంగా మలుచుకొని రచనలు చేసిన వ్యక్తి మహాకవి గుర్రం జాషువా అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కొనియాడారు. నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషువా జయంతి వేడుకలను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు.

విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. 1895లో గుంటూరు జిల్లా వినుకొండలో ఆయన జన్మించడం గుంటూరు జిల్లా ప్రజలందరికీ గర్వకారణమన్నారు. ఆయన జాతి గర్వించదగ్గ వ్యక్తి అని చెప్పారు. హోం శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. సమాజంలో బడుగు, బలహీనవర్గాల వారికి, మహిళలకు సమానత్వం కోసం కృషి చేసిన వ్యక్తి జాషువా అని ప్రశంసించారు. ఎక్కడైతే అవమానాలు పొందారో అక్కడే సత్కారాలు పొందారని చెప్పారు.

మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. గుర్రం జాషువా జాతి గర్వించదగిన కవి అని తెలిపారు. శాసనమండలిలో చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... గుర్రం జాషువాతో వ్యక్తిగత సాన్నిహిత్యం ఉండటం తన అదృష్టమన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, జాషువా కోరుకున్న విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలను సమాజంలో ఓ స్థాయికి తీసుకురావాలని సీఎం వైఎస్‌ జగన్‌ కృషి చేస్తున్నారని గుర్తు చేశారు.

శాసనమండలిలో విప్‌ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ మాట్లాడుతూ.. గుర్రం జాషువా సమసమాజాన్ని ఆశించారని తెలిపారు. ఎమ్మెల్యేలు అనంత వెంకట రామిరెడ్డి, హఫీజ్‌ ఖాన్, ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌ కుమార్, కల్పలతారెడ్డి, విజయవాడ నగర మేయర్‌ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు