‘శ్రీవారికి ప్రథమ సేవకుడిగా అవకాశం.. నా పూర్వజన్మ అదృష్టం’

11 Aug, 2021 12:18 IST|Sakshi

సాక్షి, తిరుమల: టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లడూతూ.. శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రథమ సేవకుడిగా రెండో సారి అవకాశం రావడం తన పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. గత రెండేళ్లుగా సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ.. మెరుగైన సౌకర్యాలు కల్పించామని ఆయన తెలిపారు. సామాన్య భక్తులకు శీఘ్రంగా స్వామి వారి దర్శనం కల్పించడంలో విజయవంతం అయ్యామని అన్నారు.

తిరుమలలో చారిత్రాత్మక నిర్ణయాలు, మార్పులు తీసుకు రావడంతో పాటు వాటిని అమలు చేసామని ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలంతా ఇబ్బందులకు గురి అవుతున్న సమయంలో దర్శనాలు‌ కూడా కుదించాల్సి వచ్చిందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమలలో ప్లాస్టిక్ పూర్తిగా బ్యాన్ చేసి పర్యావరణ పరిరక్షణ దిశగా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు.

వాయు కాలుష్యాన్ని నియంత్రించే విధంగా డీజిల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించనున్నామని టీటీడీ చైర్మన్‌ వెల్లడించారు. తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే భక్తులు ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. వెయ్యేళ్ల కిందట ప్రకృతి సిద్ద వ్యవసాయం ఆధారంగా పండించిన ధాన్యాలతో శ్రీవారికి నైవేద్యం సమర్పించే వారని, మళ్లీ 100 రోజులుగా తిరిగి ఆ విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు.

మరిన్ని వార్తలు