విజయదశమికే విశాఖ నుంచి పాలన.. సీఎంవో ఏర్పాటుకు దశలవారీగా చర్యలు

23 Sep, 2023 15:09 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ రాజధాని అంశాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాజధాని అంశానికి ఎవరు సహకరించినా స్వాగతిస్తామని తెలిపారాయన. విశాఖ రాజధాని జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నిర్వహించిన భేటీకి శనివారం మంత్రి గుడివాడ అమర్నాథ్‌తో కలిసి హాజరయ్యారు వైవీ సుబ్బారెడ్డి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 

విశాఖలో సీఎం కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన చర్యలు దశలవారీగా చేపడతాం. విజయదశమి నుంచి పాలనకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ఇప్పటికే కమిటీ వేయడం జరిగిందని తెలిపారు. అలాగే.. అక్టోబర్ 15న విశాఖ రాజధానిని స్వాగతిస్తూ భారీ కార్యక్రమం చేపట్టే యోచనలోఉన్నట్లు తెలిపారాయన. ‘‘విశాఖ వందనం’’ పేరుతో అన్ని వర్గాల ప్రజలతో కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. అన్ని సమకూర్చుకున్న తర్వాతే విజయదశమి నుంచి విశాఖ నుంచి సీఎం జగన్‌ పాలనా ముహూర్తం ఖరారైందని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. 

సీఎస్‌ కీలక వ్యాఖ్యలు
అంతకుముందు వీఎంఆర్‌డీలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. రాజధాని బిల్డింగ్‌ల ఎంపిక, సన్నద్ధతపై సీఎస్ చర్చించారు. విశాఖలో రాజధాని ఏర్పాట్లపై అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రాక కోసం విశాఖలో జరిగే మౌలిక సదుపాయాలు, అభివృద్ధిని త్వరలో అందరూ చూస్తారని అన్నారు. విశాఖలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళికలపై చర్చించామని తెలిపారాయన.

విశాఖలో ఇప్పటికే ఆమోదం పొందిన జాతీయ స్థాయి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌ల అమలు కోసం కొన్ని సూచనలు చేశామని జవహర్ రెడ్డి తెలిపారు. నీతి ఆయోగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 20 నగరాలలో విశాఖ ఒకటి కావడం శుభ పరిణామమని.. 2047 వికసిత్ భారత్ కోసం ఎంపిక చేసిన నాలుగు నగరాలలో విశాఖ ఒకటని ఈ సందర్భంగా సీఎస్‌ జవహర్ రెడ్డి ప్రస్తావించారు.

మరిన్ని వార్తలు