గోవును పూజిస్తే తల్లిదండ్రులను పూజించినట్టే..

4 Feb, 2021 10:47 IST|Sakshi

విజయవాడ ‘గుడికో గోమాత’ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

సాక్షి, విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చేపట్టిన గుడికో గోమాత కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. గోమాతలను దానం ఇచ్చేందుకు భక్తులు ముందుకొస్తున్నారు. కాశీ విశ్వేశ్వర ఆలయానికి టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మీదగా కపిల గోవును గాయత్రీ సొసైటీ అందజేసింది. గోపూజ నిర్వహించి ఆలయానికి గోమాతను టీటీడీ ఛైర్మన్ అప్పగించారు. గోపూజలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు.(చదవండి: ‘అదే మమ్మల్ని గెలిపించే మంత్రం’

ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, గోవును పూజిస్తే ముక్కోటి దేవతలు, తల్లిదండ్రులను పూజించినట్టేనని ఆయన తెలిపారు. గోమాత విశిష్టతను తెలియచేసేందుకు గుడికో గోమాత కార్యక్రమం చేపట్టామని వివరించారు. నాలుగు రాష్ట్రాల్లో ‘గుడికో గో మాత’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. ఆలయ నిర్వాహకులు ముందుకొస్తే ఆవును,దూడను టీటీడీ అందచేస్తుందన్నారు.  టీటీడీ ఖర్చులతోనే ఆలయాలకు గోవులను చేరుస్తామని చెప్పారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం దేశ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నామని పేర్కొన్నారు.(చదవండి: స్థానిక ఎన్నికలు: బీజేపీ.. ఓటుకు రేటు)

గత ప్రభుత్వం కల్యాణమస్తు  కార్యక్రమాన్ని నిలిపివేసిందని.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనతో త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. ఆర్థిక స్థోమత లేని పేద జంటలకు తాళిబొట్టు, బట్టలు అందచేసి వివాహాలు జరిపిస్తామని చెప్పారు.  అందరికీ వెంకన్నను చేరువ చేసేందుకు టీటీడీ ఆధ్వర్యంలో 500 దేవాలయలను నిర్మించాలని సీఎం వైఎస్‌ జగన్‌ సంకల్పించారని తెలిపారు. త్వరలోనే ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నామన్నారు.  కరోనా కారణంగా ఆలయాల నిర్మాణం ఆలస్యమయిందని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు