ధనవంతుల ప్రయోజనాల కోసమే ఆరోపణలు

25 Feb, 2022 05:21 IST|Sakshi

శ్రీవారి ఆర్జిత సేవ టిక్కెట్ల ధరల పెంపు ప్రచారంపై టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి 

సామాన్య భక్తులకిచ్చే సేవా టిక్కెట్ల ధరలు పెంచే ఆలోచన లేదు 

దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం 

తిరుమల: సామాన్య భక్తులకు ఇచ్చే తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెంచాలన్న ఆలోచనే లేదని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. కేవలం సిఫారసు లేఖల ఆధారంగా విచక్షణ కోటాలో వీఐపీలకు కేటాయించే సేవా టికెట్ల ధరల పెంపుపై చర్చ జరిగిందని, నిర్ణయం తీసుకోలేదని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సిఫారసులను తగ్గించి, సామాన్య భక్తులకు శ్రీవారి సేవా టికెట్లు మరిన్ని అందుబాటులోకి తెచ్చే సదుద్దేశంతోనే విచక్షణ కోటా టిక్కెట్ల ధరల పెంపుపై చర్చించామన్నారు. ధనవంతుల ప్రయోజనాలను పరిరక్షించే కుట్రతోనే కొందరు ఈ చర్చను వక్రీకరించి  దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. పాలక మండలి సమావేశాలు పారదర్శకంగా ఉండాలనే ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని తెలిపారు.

చర్చ ప్రారంభంలోనే సామాన్య భక్తులకు కేటాయించే సేవా టికెట్ల ధరలు పెంచడంలేదని తాను స్పష్టంగా చెప్పిన మాటలు విమర్శకులకు వినిపించకపోవడం తమ తప్పు కాదన్నారు. మీడియా సమావేశంలోనూ తాను ఈ విషయం స్పష్టంగా చెప్పానన్నారు. దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగే కుట్రదారులను స్వామివారే శిక్షిస్తారని అన్నారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తీసుకోబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేకి అని అభిప్రాయం కలిగించేందుకు జరుగుతున్న రాజకీయ కుట్రను భక్తులు గ్రహించాలని కోరారు. తమ మాటలను ఎడిట్‌ చేసి దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

ఈ కార్యక్రమాలు కనిపించలేదా? 
టీటీడీ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు విమర్శకులకు కనిపించలేదా? అని సుబ్బారెడ్డి ప్రశ్నించారు. ‘శ్రీవాణి ట్రస్టు ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార ప్రాంతాల్లో 502 శ్రీవారి ఆలయాలు నిర్మించాం. 1,100 ఆలయాల నిర్మాణం, అభివృద్ధి పనులు చేస్తున్నాం. ఇప్పటివరకు శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోలేని పేదలను ఆహ్వానించి ఉచితంగా దర్శనం చేయిస్తున్నాం. గుడికో గోమాత కార్యక్రమంలో దేశవ్యాప్తంగా పలు ఆలయాలకు ఆవులు, దూడలు అందించాం. అలిపిరి వద్ద శ్రీ వేంకటేశ్వర సప్త గో ప్రదక్షిణ మందిరం ప్రారంభించాం. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేశాం. చిన్న పిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె సమస్యలను శస్త్ర చికిత్సల ద్వారా సరిచేసేందుకు పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంను ప్రారంభించాం. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి డీపీఆర్, డిజైన్లు ఖరారు చేశాం’ అని తెలిపారు.    

మరిన్ని వార్తలు