సృజనాత్మకతకు చిరునామా వైవీయూ ఫైన్‌ఆర్ట్స్‌

18 Aug, 2022 08:55 IST|Sakshi

ఊహలకందని భావాలను ఆవిష్కరించే నైపుణ్యం.. ఎల్లలు లేని సృజనాత్మకత, కళలపై ఆసక్తి ఉన్నవారు చదవదగ్గ కోర్సు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌. యోగివేమన విశ్వవిద్యాలయంలోఈ కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తు, ఆప్షన్స్‌ ఇచ్చేందుకు ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం ఉందని, ఆసక్తి గల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని లలితకళల విభాగం అధ్యాపకులు కోరుతున్నారు. 

వైవీయూ(కడప): చిత్రలేఖనంలో రాణించాలనుకునే వారికి యోగివేమన విశ్వవిద్యాలయంలోని ఫైన్‌ఆర్ట్స్‌ విభాగం వేదికగా నిలుస్తోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలతో పాటు అభిరుచులకు ప్రాధాన్యత ఇస్తూ పెద్దపెద్ద నగరాలకే పరిమితమైన బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ (బీఎఫ్‌ఏ) యోగివేమన విశ్వవిద్యాలయంలో అందుబాటులో ఉండటం ఇక్కడి కళాకారులకు ఊతమిస్తోంది. ఆసక్తి, అభిరుచి కలిగిన విద్యార్థులు ప్రవేశాలు పొందేందుకు గడువు ఈనెల 31వ తేదీ వరకు ఉండటంతో విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అధ్యాపకులు కోరుతున్నారు. 2010లో యోగివేమన విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన ఈ కోర్సులో ఎందరో విద్యార్థులు చేరడంతో పాటు, కోర్సు పూర్తి చేసుకున్నవారంతా తమ అభిరుచికి తగ్గ రంగాల్లో స్థిరపడటం విశేషం. 

కోర్సు ద్వారా లభించే అవకాశాలు.. 
ఈ కోర్సులు చేయడం ద్వారా యానిమేషన్, ఫ్యాషన్, జ్యువెలరీ డిజైనింగ్‌ తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా అడ్వర్టయిజింగ్‌కు ఉన్న డిమాండ్‌ను బట్టి ఆయా ఏజన్సీల్లో సైతం ఉపాధి పొందవచ్చు. ఇంటీరియర్‌ డిజైనింగ్, ఫర్నిచర్‌ డిజైనింగ్, పిల్లల బొమ్మల తయారీ రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. కార్పొరేట్‌ స్కూల్స్, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులుగా, ప్రొఫెషనల్‌ ఆర్టిస్టుల్లా రాణించే అవకాశం ఉంది. 

అర్హతలు.. ప్రవేశం 
కోర్సు కాల వ్యవధి నాలుగు సంవత్సరాలు. ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. 90 శాతం ప్రాక్టికల్స్‌తో కూడిన కోర్సు. ఎటువంటి ఒత్తిడిలేని వాతావరణంలో విద్యను సాగించే వీలున్న కోర్సు. ప్రవేశాల కోసం ఎస్‌సీహెచ్‌ఈఏపీ.జీఓవి.ఇన్‌లో ఈ నెల 30వ తేదీ లోపు రిజిస్ట్రేషన్‌ చేసుకుని వెబ్‌ఆప్షన్స్‌ ద్వారా యోగివేమన విశ్వవిద్యాలయం లలితకళల విభాగాన్ని ఎంపిక చేసుకోవచ్చు. 

సాధించిన విజయాలు.. 
2022లో నేషనల్‌ ట్రెడిషనల్‌ అండ్‌ ట్రైబల్‌ పెయింటింగ్‌ వర్క్‌షాపు ద్వారా వివిధ రాష్ట్రాల ట్రైబల్, ట్రెడిషనల్‌ ఆర్టిస్టులు వైవీయూకు విచ్చేసి వర్క్‌షాపులో పాల్గొన్నారు. 
2020లో వైవీయూ, లలితకళా అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పెయింటింగ్‌ వర్క్‌షాపులో 7 రాష్ట్రాల ఆర్టిస్టులు విచ్చేసి వారి ప్రతిభను కనబరిచారు. అదే యేడాది విజయవాడలో నిర్వహించిన ఆర్ట్స్‌ ఎగ్జిబిషన్‌లో ఎల్దరడో పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌లో వైవీయూ విద్యార్థులు 10 మంది పాల్గొని తమ పెయింటింగ్స్‌ ప్రదర్శించారు. 
2020లో న్యూఢిల్లీలో నిర్వహించిన నేషనల్‌ యూత్‌ ఫెస్టివల్‌లో పోస్టర్‌ మేకింగ్, ఇన్‌స్టలేషన్‌ విభాగంలో వైవీయూ విద్యార్థులు రెండోస్థానంలో నిలిచారు. 
2019లో అలగప్ప విశ్వవిద్యాలయంలో నిర్వహించిన దక్షిణభారత యువజనోత్సవాల్లో ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ సాధించారు. 
2018 మార్చినెలలో విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మహిళా చిత్రకారిణిల వర్క్‌షాపునకు బీఎఫ్‌ఏ విద్యార్థులు ఎన్‌.రేఖ, పి.గాయత్రి పాల్గొన్నారు. సాంస్కృతిక శాఖ సంచాలకుల చేతుల మీదుగా నగదు పురస్కారం, ఘన సన్మానం అందుకున్నారు. 
 2018 ఏప్రిల్‌ నెలలో విజయవాడ–అమరావతి కల్చరల్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్యాలరీలో వైవీయూ ఫైన్‌ఆర్ట్స్‌ ఫైనలియర్‌ విద్యార్థులు చిత్రం, శిల్పకళాఖండాలు ప్రదర్శించారు. విద్యార్థుల ప్రతిభను మెచ్చుకుని రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.10వేలు నగదు ప్రోత్సాహం అందించారు. 
విజయవాడ ఆంధ్ర లయోల కళాశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి చిత్ర సంతలో విద్యార్థుల ప్రదర్శన, అమ్మకాలు నిర్వహించారు. 
2018 ఫిబ్రవరిలో ‘ఇంటాగ్లియో’ ప్రింట్‌ మేకింగ్‌ విధానంపై వారంరోజుల వర్క్‌షాపు నిర్వహణ. 
2018 అక్టోబర్‌లో 34వ సౌత్‌జోన్‌ యూత్‌ ఫెస్టివల్‌లో శిల్పం విభాగంలో బి.ఎఫ్‌.ఎ విద్యార్థి జి.సోమశేఖర్‌కు ప్రథమస్థానం. 
2017లో ప్రపంచ పర్యాటక దినోత్సవం –2017లో రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానం. 
2015లో మధ్యభారతదేశ కళలు అన్న అంశంపై లలితకళా అకాడమీ న్యూఢిల్లీ వారి ఆర్థిక సహకారంతో తొలి జాతీయ సెమినార్‌ నిర్వహణ. 
2013లో న్యూఢిల్లీలో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో ద్వితీయ బహుమతి రూ.10వేలు కైవసం చేసుకున్న వైవీయూ లలిత కళల విద్యార్థి వెంకటేశ్వర్లు. 

వీసీ, రిజిస్ట్రార్‌ల ప్రోత్సాహంతో.. 
యోగివేమన విశ్వవిద్యాలయంలో ఫైన్‌ఆర్ట్స్‌ కోర్సు దినదినాభావృద్ధి జరుగడానికి కారణం విశ్వవిద్యాలయ వైస్‌ చాన్సలర్, రిజిస్ట్రార్‌ల సంపూర్ణ సహకారమే. రాయలసీమలో తొలుత వైవీయూలోనే ఈ కోర్సు ప్రారంభించారు. ఇంటర్‌ తర్వాత కాస్త సృజనాత్మకంగా ఆలోచించేవారికి చక్కటి కోర్సు. ఆధునిక కాలపు ఒత్తిడిని దూరం చేసే విధంగా కోర్సు రూపకల్పన, బోధన జరుగుతోంది. చదువుకుంటూనే సంపాదించుకునే మంచి అవకాశం కూడా ఉంది.   
 – డా. మూల మల్లికార్జునరెడ్డి, లలితకళల విభాగాధిపతి, వైవీయూ

మరిన్ని వార్తలు