AP: శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా జకియా

26 Nov, 2021 17:18 IST|Sakshi

సాక్షి, అమరావతి/రాయచోటి: శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ పదవి తొలిసారి మైనారిటీ మహిళకు దక్కింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమెను స్వయంగా కూర్చీ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జకియా మాట్లాడుతూ.. ఈ గౌరవప్రదమైన స్థానానికి తనను అర్హురాలుగా గుర్తించి మంచి ఉద్దేశంతో పదవి ఇచ్చినందుకు సీఎం జగన్‌కు రుణపడి ఉంటానన్నారు.

సీఎం జగన్‌ మహిళా పక్షపతి
మహిళల సంక్షేమ కోసం అనే పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్‌ మహిళా పక్షపతి అని నిరూపించుకున్నారని ఆమె కొనియాడారు. దేశానికే మన రాష్ట్రం ఆదర్శంగా ఉందన్నారు. ఒక సాధారణ గృహిణిగా ఉన్న తనకు సముచిత స్థానాన్ని కల్పించినందుకు మైనార్టీలందరూ హర్షించారని ఆమె పేర్కొన్నారు. మైనార్టీల సామాజిక, ఆర్టిక, రాజకీయ ఎదుగుదలకు తోడ్పడుతానని ఆమె భరోసా ఇ‍చ్చారు.

కాగా వైఎస్సార్‌ జిల్లా రాయచోటిలో మైనార్టీ వర్గాలకు ఎమ్మెల్సీ స్థానం ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌ తన మాట నిలబెట్టుకున్నారు. ఈక్రమంలో రాయచోటికి చెందిన జకియా ఖాన్మ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. మరో అడుగు ముందుకు వేసి ఆమెకు శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించారు.

జకియా ఖానమ్‌ నేపథ్యమిది.. 
పేరు: మయాన జకియా ఖానమ్‌ 
భర్త: దివంగత ఎం.అఫ్జల్‌ ఖాన్, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ 
సంతానం: ముగ్గురు కుమార్తెలు, 
ఒక కుమారుడు 
చదువు: ఇంటర్మీడియెట్‌ 
పుట్టిన తేది: జనవరి 01, 1971 
స్వస్థలం: రాయచోటి, వైఎస్సార్‌ జిల్లా 
రాజకీయ నేపథ్యం: ఎమ్మెల్సీ (ఆగస్టు 20, 2020 నుంచి)

మరిన్ని వార్తలు