9,988 సచివాలయాల్లో జీరో కోవిడ్‌ కేసులు

3 Sep, 2021 05:47 IST|Sakshi

2,610 సచివాలయాల్లో ఒక్కటి మాత్రమే 

50 కేసులు పైగా ఉన్న సచివాలయాలు లేవు 

రాష్ట్రంలో ప్రస్తుతం 98.59 శాతం రికవరీ రేటు 

కేసులు తగ్గినా జాగ్రత్తగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ సూచన  

సాక్షి, అమరావతి: కోవిడ్‌ నియంత్రణకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 15,001గ్రామ/వార్డు సచివాలయాలుండగా 9,988 సచివాలయాల్లో ఒక్క కోవిడ్‌ యాక్టివ్‌ కేసు కూడా లేకపోవడం ఇందుకు నిదర్శనం. 2,610 సచివాలయాల్లో ఒకే ఒక్క యాక్టివ్‌ కేసు మాత్రమే ఉంది. మండలాల వారీగా చూస్తే.. నాలుగు కేసులు కంటే తక్కువగా ఉన్నవి 248 ఉన్నాయి. 9 లోపు యాక్టివ్‌ కేసులున్న మండలాలు 145. రాష్ట్రంలో మొత్తం 676 మండలాలుండగా.. 100, ఆపైన కేసులు నమోదైంది కేవలం 4 మండలాల్లోనే. గత వారంతో పోలిస్తే యాక్టివ్‌ కేసుల సంఖ్య తగ్గినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

రాష్ట్రంలో గురువారం సాయంత్రం నాటికి 14,702 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.59 శాతం ఉంది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 99.24 శాతం, అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 97 శాతం రికవరీ రేటు నమోదైంది. గత వారం రోజుల్లో నమోదైన కేసులను పరిశీలిస్తే.. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 0.23 శాతం మాత్రమే పాజిటివిటీ రేటు ఉంది. కాగా, అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 3.72 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. ప్రస్తుతం కేసుల ఉధృతి తగ్గినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ సూచిస్తోంది. మాస్కు విధిగా ధరించాలని చెబుతోంది. మాస్కు ధరించినవారే కోవిడ్‌ నుంచి తమను తాము కాపాడుకోగలిగారని నిపుణులు పేర్కొంటున్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు