అత్యాచార కేసుల్లో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు

11 Oct, 2020 03:29 IST|Sakshi

హాథ్రస్‌ హత్యాచారం ఘటనతో రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలు

60 రోజుల్లో అత్యాచార కేసులు దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశం

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతోన్న జీరో ఎఫ్‌ఐఆర్‌

దిశ యాక్ట్‌తో మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులపై కఠిన చర్యలు

21 రోజుల్లోనే విచారణ పూర్తి చేసేలా చర్యలు తీసుకున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం

సాక్షి, అమరావతి: మహిళలు, ఆడపిల్లలపై రోజురోజుకీ పెరిగిపోతున్న దారుణాలపై కేంద్ర హోం శాఖ స్పందించింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన హాథ్రస్‌ హత్యాచార ఘటన నేపథ్యంలో మహిళల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ చట్టాలను అనుసరించి కేంద్ర హోం శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.. 

► మహిళలపై నేరాలు.. ప్రధానంగా అత్యాచారం వంటి కేసుల్లో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. లైంగిక దాడి వంటి ఘటనల్లో తప్పనిసరిగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి. ఒకవేళ నేరం బాధితురాలుండే పోలీస్‌స్టేషన్‌ పరిధి వెలుపల జరిగితే.. ఎక్కడైనా సరే ‘జీరో ఎఫ్‌ఐఆర్‌’ నమోదు చేయాల్సిందే. లేకపోతే సదరు పోలీస్‌ అధికారి శిక్షార్హుడు.
► లైంగిక దాడి గురించి సమాచారం అందిన 24 గంటల్లోగా బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించాలి. న్యాయాధికారి ముందు రికార్డు చేయనప్పటికీ.. బాధితురాలి మరణ వాంగ్మూలం పరిగణనలోకి తీసుకోవాలి. 
► లైంగిక దాడుల కేసుల్లో సాక్ష్యాలను సేకరించేందుకు సెక్సువల్‌ అసెల్ట్‌ ఎవిడెన్స్‌ కలెక్షన్‌ కిట్లను ఉపయోగించాలి. అత్యాచార కేసుల్లో పోలీసుల దర్యాప్తు 60 రోజుల్లో పూర్తి చేయాలి.
► దర్యాప్తులో రాష్ట్ర పోలీసులకు సహకారం అందించేందుకు ‘ఇన్వెస్టిగేషన్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ ఫర్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌’ ఆన్‌లైన్‌ పోర్టల్‌ను కేంద్ర హోం శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఈ మార్గదర్శకాలు పాటించని పోలీసులపైనా కఠిన చర్యలు ఉంటాయి.

ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్‌
మహిళలు, ఆడపిల్లల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శంగా నిలిచింది. తెలంగాణలో జరిగిన ‘దిశ’ ఘటన నేపథ్యంలో.. ఏపీలోని ఆడబిడ్డలెవరికీ అలాంటి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. మహిళలు, బాలికల రక్షణకు ప్రత్యేకంగా ‘దిశ’ యాక్ట్‌ తెచ్చింది. దిశ పోలీస్‌ స్టేషన్‌లు, సైంటిఫిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేసింది. ఫలితంగా మహిళలు, చిన్నారులపై అత్యాచారానికి, లైంగిక వేధింపులకు పాల్పడిన దుర్మార్గులకు 21 రోజుల్లోనే శిక్షలు పడేలా కృషి చేస్తోంది.

ఏపీలోని దిశ యాక్ట్‌ తరహాలోనే ప్రత్యేక చట్టం తెచ్చేందుకు మహారాష్ట్ర, తదితర రాష్ట్రాలు ఏపీలో అధ్యయనం కూడా చేశాయి. అన్యాయానికి గురైన మహిళలు ఎక్కడైనా ఫిర్యాదు చేసేలా 2019 డిసెంబర్‌ 5 నుంచే రాష్ట్రంలో జీరో ఎఫ్‌ఐఆర్‌ను అమలులోకి తెచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 341 జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో రాష్ట్రంలో తీసుకొచ్చిన దిశ యాక్ట్, జీరో ఎఫ్‌ఐఆర్‌ తదితరాలు మహిళలు, చిన్నారుల రక్షణలో సత్ఫలితాలను ఇస్తున్నాయని ఏపీ పోలీస్‌ శాఖ టెక్నికల్‌ చీఫ్‌ పాల్‌రాజ్‌ ‘సాక్షి’కి తెలిపారు.   

మరిన్ని వార్తలు