జీరో షాడో డే

9 May, 2021 04:34 IST|Sakshi
వస్తువుల నీడ నేలపై పడని దృశ్యం

ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఏర్పడే ఖగోళ అంశం

పలు పాఠశాలల్లో విద్యార్థులతో ప్రయోగం చేయించిన ఉపాధ్యాయులు 

భానుగుడి (కాకినాడ సిటీ): సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆవిష్కృతమయ్యే అరుదైన ఖగోళ దృగ్విషయం ‘జీరో షాడో డే’. సూర్యుడు ఉత్తరాయణంలో ఉన్నప్పుడు దక్షిణ భారతదేశంలోని కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే ఈ సన్నివేశం ఆవిష్కృతమవుతుంది. ఇది ఏర్పడే మే నెల మొదటి వారంలోని రెండురోజుల పాటు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.10 గంటల వరకు ఏ వస్తువు నీడ భూమిపై పడదని ఖగోళ శాస్త్ర నిపుణులు చెబుతారు. శనివారం తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు దీనిని సాంకేతికంగా నిరూపించి, జూమ్‌ యాప్‌ ద్వారా విద్యార్థులందరికీ విశదీకరించారు.

రాజమహేంద్రవరం సత్యసాయి గురుకులం ఖగోళ శాస్త్ర ఉపాధ్యాయుడు కూచిపూడి గుర్రయ్య విద్యార్థులతో ఈ ప్రయోగాన్ని చేయించారు. కాజులూరు జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పంపన కృష్ణమూర్తి విద్యార్థులతో ఈ ప్రయోగం నిర్వహించి, ఇంటర్నెట్‌ ద్వారా మిగిలిన విద్యార్థులందరితో పంచుకున్నారు. ఎస్‌సీఈఆర్‌టీ సాంఘిక శాస్త్ర పుస్తక రచయిత, ప్రధానోపాధ్యాయుడు రాకుర్తి త్రిమూర్తులు పాఠశాల విద్యార్థులతో ప్రయోగాలు నిర్వహించి విషయాన్ని విశదీకరించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు